'ఈ వయసులో ప్రయోగాలు ఎందుకన్నారు'

Ananya Panday Interview In Sakshi Funday

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2’తో బాలీవుడ్‌కు పరిచయమైన అనన్యా పాండే రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ ‘పతి పత్నీ ఔర్‌ వో’తో నవ్వులు పూయించింది. పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ సినిమాతో మన తెలుగు తెరకు పరిచయం కానున్న పాండే ముచ్చట్లు ఆమె మాటల్లోనే...

తగిన సలహాలు
కరణ్‌ జోహర్‌ సినిమా చేయడం అనేది ఒక కల. ఆ కల నిజమైనందుకు సంతోషంగా ఉంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2’ సినిమాకు ముందు ‘చుంకీ పాండే కూతురు’గానే గుర్తించేవారు. ఇప్పుడు మాత్రం హీరోయిన్‌గా చూస్తున్నారు. సినిమాల గురించి సంభాషిస్తున్నారు. ఎవరైనా  సలహాలు చెబితే శ్రద్ధగా వింటున్నాను. కెమెరా ముందుకు వచ్చినప్పుడు ముఖకవళికల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకున్నాను.

తీయని స్నేహం
నాకు బోలెడు మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు గాని, మా మధ్య సినిమాల ప్రస్తావన తక్కువగా ఉంటుంది. హీరోయిన్‌ అంటూ ప్రత్యేక మర్యాద ఇవ్వడం నాకు నచ్చదు. స్నేహం అనేది సహజంగానే ఉండాలి. ఎలాంటి భేషజాలు ఉండకూడదు. నా స్కూల్‌ఫ్రెండ్స్‌తో కలిసి లంచ్‌ చేయడం అంటే చాలా ఇష్టం. ఆడంబర జీవనశైలి కంటే సాధారణ జీవనశైలిని ఇష్టపడతాను.

కొత్త మార్పు
ఇన్‌స్పిరేషన్‌ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. సహ నటుల నుంచి కూడా స్ఫూర్తి పొందవచ్చు. ఆలియాభట్‌ నాకు బిగ్గెస్ట్‌ ఇన్‌స్పిరేషన్‌. కెరీర్‌ తొలినాళ్లలో ఆమె రకరకాల విమర్శలు ఎదుర్కొంది. ‘హైవే’, ‘రాజీ’ సినిమాలతో తానేమిటో నిరూపించుకుంది. నాలో కొత్త కోణాన్ని చూపే సినిమాల్లో నటిస్తాను. ఈ మాట చెప్పినప్పుడు కొద్దిమంది ఏమన్నారంటే  ‘‘ఈ వయసులో ప్రయోగాలు ఎందుకు!’’ అని. అయితే ప్రేక్షకుల దృష్టిలో ఇప్పుడు మార్పు వచ్చింది...భిన్నమైన పాత్రలకు ఇప్పుడు ఆదరణ లభిస్తోంది. కాబట్టి... ఇక ధైర్యంగా ముందుకు వెళ్లడమే.

గర్ల్‌గ్యాంగ్‌
సుహానా ఖాన్, శనయా కపూర్, నేను... యాక్టింగ్‌ గేమ్స్‌ ఆడుతూ పెరిగినవాళ్లం. మమ్మల్ని ‘గర్ల్‌గ్యాంగ్‌’ అని సరదాగా పిలుస్తుంటారు. మా మధ్య సినిమాల ప్రస్తావన తప్ప మరేమీ ఉండదనుకుంటారు. నిజానికి మేము అందరు టీనేజర్స్‌లాగే సాధారణ విషయాలే మాట్లాడుకుంటాం. ‘దిల్‌ చాహతా హై’ ‘జిందగీ నా మిలేగీ దోబారా’ సినిమాల గర్ల్స్‌ వెర్షన్‌ గనుక చేస్తే మేము ముగ్గురం పర్‌ఫెక్ట్‌ అనుకుంటున్నాను. డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో డాడీతో కామెడీ సినిమా చేయాలని ఉంది.

ఆరోగ్యం
లాక్‌డౌన్‌ పుణ్యమా అని ఊహించనన్ని రోజులు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. పని నుంచి ఎప్పుడూ మూడురోజులకు మించి విరామం తీసుకోని నాకు ఇది కొత్తగానే ఉంది. పనికి ఆటంకం కలిగింది అనుకోవడం కంటే ఆరోగ్యం గురించి ఆలోచించడం  ముఖ్యం కదా! 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top