నేను ఓకే కానీ..

నేను ఓకే కానీ..


నేను ఓకే కానీ.. అంటూ దర్శక నిర్మాతలకు షాక్‌ ఇస్తోందట ఇంగ్లీష్‌ బ్యూటీ ఎమీజాక్సన్ . ఈ అమ్మడు తమిళంలో నటించింది నాలుగైదు చిత్రాలే. వాటిలో తొలి చిత్రం మదరాసుపట్టణం విజయం సాధించింది. ఆ తరువాత సరైన సక్సెస్‌ ఏదీ అమ్మడి ఖాతాలో పడలేదు. ఐతే లక్కు మాత్రం వెంటాడుతూనే ఉంది. శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌కు జంటగా బ్రహ్మాండ చిత్రం ఐ లో నటించే అవకాశం ఎమీని వరించింది. ఆ చిత్రంలో మ్యాగ్జిమమ్‌ అందాలను ఆరబోసింది. అయినా ఐ చిత్రం మాత్రం సక్సెస్‌ టార్గెట్‌ను చేరుకోలేకపోయింది. అయితేనేం శంకర్‌ మరోసారి బంపర్‌ ఆఫర్‌ను ఎమీకిచ్చారు. అదే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 2.ఓ చిత్రంలో రొమాన్స్  చేసే అవకాశం. ఈ చిత్రంపైనే అమ్మడి ఆశలన్నీ.


కాగా తాజాగా యువ నటుడు విజయ్‌సేతుపతితో జత కట్టే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇంతకు ముందు కార్తీ కథానాయకుడిగా కాష్మోరా చిత్రాన్ని తెరకెక్కించిన గోకుల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. మొత్తం మీద కథ, పాత్ర గురించి కూడా అడగకుండా విజయ్‌సేతుపతితో నటించడానికి ఎమీజాక్సన్  అంగీకరించడంతో తదుపరి కార్యక్రమాలకు దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు.


ఈ కెనడా భామను పారితోషికం గురించి కూడా ఒక మాట అనుకుంటే బాగుంటుందని అడిగారట. మీ చిత్రంలో నటించడానికి నేను ఓకే, పారితోషికం తదితర విషయాల గురించి నా మేనేజర్‌తో మాట్లాడండి అని అన్నారట. 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన ఎమీకి ప్రస్తుతం చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు కాబట్టి పారితోషికం గురించి పెద్దగా డిమాండ్‌ చేయదులే అని భావించిన దర్శక నిర్మాతలకు ఈ అమ్మడి మేనేజర్‌ చాలా సింపుల్‌గా కోటిన్నర ఇవ్వండి అని సెలవిచ్చాడట. దీంతో వారి కి దిమ్మ తిరిగిందట. ఇంతకీ ఆ చిత్రంలో ఎమీ ఉంటుం దా?లేదా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Back to Top