త్రిష వదులుకున్న పాత్రలో ఐశ్వర్యరాజేశ్‌

Aishwarya Rajesh In Vikram Movie - Sakshi

తమిళసినిమా: త్రిష వదులుకున్న పాత్ర యువ నటి ఐశ్వర్యరాజేశ్‌ను వరించింది. ఇంతకు ముందు విక్రమ్, త్రిష జంటగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సామి చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. విక్రమ్‌ను మాస్‌ హీరో చేసిన చిత్రం, త్రిషకు క్రేజ్‌ పెంచిన చిత్రం ఇదే. తాజాగా సామికి సీక్వెల్‌గా సామి స్క్వేర్‌ను హరి తెరకెక్కిస్తున్నారు. దీన్ని తమీన్‌ ఫిలింస్‌ పతాకంపై శిబు తమీన్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకిగా కీర్తీసురేశ్‌ నటిస్తోంది. మరో కథానాయకిగా త్రిష నటించడానికి అంగీకరించి ఆ తరువాత చిత్రం నుంచి వైదొలిగింది. కారణం చిత్రంలో తన పాత్ర కంటే కీర్తీసురేశ్‌ పాత్రకే ప్రాధాన్యత ఉండటమేననే ప్రచారం హోరెత్తింది.

ఈ విషయంలో చిత్ర దర్శక, నిర్మాతలు, త్రిష మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఫిర్యాదులు అంటూ పెద్ద రాదాంతమే జరిగింది. త్రిషను నటింపచేయడానికి నటుడు విక్రమ్‌ కూడా రాయబారం జరిపారనే ప్రచారం జరిగింది. ఏదేమైనా సామీ స్క్వేర్‌ చిత్రంలో నటించేది లేదన్న మాటపైనే త్రిష నిలబడింది. ఇదిలాఉండగా చిత్ర షూటింగ్‌ చాలా వరకు పూర్తయ్యింది. చిత్ర ఫస్ట్‌లుక్, మోషన్‌ పోస్టర్‌ కూడా విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఇన్నాల్టికి త్రిష పాత్రలో నటి ఐశ్వర్యరాజేశ్‌ను చిత్ర దర్శక నిర్మాతలు ఎంపిక చేశారు. ఐశ్వర్యరాజేశ్‌ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉందన్నది గమనార్హం. ప్రస్తుతం సామి స్క్వేర్‌ చిత్రంలో విక్రమ్‌తో ఆమె నటించే పాటను, సన్నివేశాలను పళనిలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభు, బాబీసింహా, సూరి, ఇమాన్‌ అన్నాచ్చి, జాన్‌ విజయ్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సింగిల్‌ ట్రాక్‌ను త్వరలో విడుదల చేయడానికి, ఆ తరువాత ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top