నా కూతుర్ని నేను కిడ్నాప్‌ చేశానా?

నా కూతుర్ని నేను కిడ్నాప్‌ చేశానా?


చెన్నై: తన కూతుర్ని కిడ్నాప్‌ చేసిందంటూ నటి వనితపై మాజీ భర్త ఆనంద్‌రాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... చంద్రలేఖ, మాణిక్యం చిత్రాల్లో నాయకిగా నటించిన నటి వనిత తల్లిదండ్రులు సీనియర్‌ నటుడు విజయకుమార్, మంజుల. బుల్లితెర నటుడు ఆకాశ్‌ను ప్రేమించి పెళ్లాడిన వనిత కొంత కాలం తర్వాత ఆయన నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు.


తర్వాత హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆనందరాజ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి జయనిత అనే 8 ఏళ్ల కూతురు ఉంది. కాగా మసస్పర్ధల కారణంగా వనిత, ఆనంద్‌రాజ్‌లు విడిపోయారు. కూతురు తండ్రి వద్దే పెరుగుతోంది. నటి అల్ఫాన్స్‌ సోదరుడు, డాన్స్‌మాస్టర్‌ అయిన రాబర్ట్‌ను వనిత మూడో పెళ్లి చేసుకుంది. ఇటీవల వీరిద్దరూ కూడా విడిపోయినట్లు సమాచారం.కాగా తాజాగా వనితపై రెండో మాజీ భర్త ఆనంద్‌రాజ్‌ తన కూతుర్ని కిడ్నాప్‌ చేసిందంటూ హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హైదరాబాద్‌ పోలీసులు వనితను విచారించడానికి చెన్నైకి చేరుకున్నారు. అయితే వనిత కోవైలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కూతురి కిడ్నాప్‌పై స్పందించిన నటి వనిత స్పందిస్తూ.... ఆనంద్‌రాజ్‌ నుంచి విడాకులు పొందాక అతని అడ్రస్‌ కూడా తనకు తెలియదని, తనే కూతుర్ని తీసుకెళ్లాడని తెలిపింది.అనంతరం తాను ఈమెయిల్‌ ద్వారా కూతురు గురించి తెలుసుకున్నానని చెబుతూ... ఆనంద్‌రాజ్‌ కూతురికి తన గురించి లేనిపోనివి నూరి పోశాడని ఆరోపించింది. అయితే ఈ మెయిల్‌ ద్వారా తన ఫోన్‌ నెంబర్‌ తెలుసుకున్న జయనిత తండ్రి దగ్గర నుంచి తనను తీసుకెళ్లమని అభ్యర్ధించిందని పేర్కొంది.


దీంతో తాను హైదరాబాద్‌ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారితోపాటు ఆనంద్‌రాజ్‌ ఇంటికి వెళ్లి కూతురిని తీసుకొచ్చానని ఇది కిడ్నాప్‌ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను వేరే ప్రాంతంలో ఉన్నానని, తన కూతురు కోసం అరెస్ట్‌ అవడానికి ఎప్పుడూ తాను సిద్ధమేనన్నారు. అయితే దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని వనిత తెలిపారు.

Back to Top