ఎలాంటి పాత్రకైనా రెడీ

ఎలాంటి పాత్రకైనా రెడీ


తమిళసినిమా: ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా తాను సిద్ధం అంటున్నారు నటి సాయి ధన్సిక. పేరాన్మమై చిత్రం ద్వారా దర్శకుడు జననాథన్‌ పరిచయం చేసిన నటి సాయిధన్సిక. ఆ చిత్రంలో జయంరవితో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించి ప్రత్యేకత చాటుకున్న తంజావూర్‌కు చెందిన అచ్చ తమిళమ్మాయి ఆ తరువాత కేరీర్‌ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయ్యిందనే చెప్పాలి.
వరుసగా అవకాశాలు తలుపు తట్టడం, అవి నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు కావడంతో తనదైన  స్టైల్‌లో నటిస్తూ దూసుకుపోతున్నారు సాయి ధన్సిక. కబాలి చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు కూతురుగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో రజనీకాంత్‌ తరువాత అంత మంచి పేరు తెచ్చుకున్న నటి సాయి ధన్సికనే అని చెప్పాలి. అందుకు నిదర్శనం ఇటీవల ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్‌ అవార్డును గెలుచుకోవడమే. ఇక మరో విషయం ఏమిటంటే తను నటించిన ఉరు చిత్రం ఇటీవల విడుదలై మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతుండటం ఈ ఆనందాన్ని సాయిధన్సిక సోమవారం పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ ముచ్చట్లు చూద్దాం.ప్ర: ఉరు చిత్రంలో అద్దాలు పగలగొట్టుకొని దూసుకొచ్చే యాక్షన్‌ సన్నివేశాల్లో నటించిన అనుభవం గురించి?

జ: ఆ యాక్షన్‌ సన్నివేశంలో నటించగలవా? అని దర్శకుడు అడిగారు. తానూ ఓకే అన్నాను. నిజంగా అది చాలా రిస్కీ షాటే. కరెక్ట్‌గా నేను అద్దంలోంచి దూకే సమయంలో ఒక వ్యక్తి పక్క నుంచి అద్దాన్ని పగలగొట్టారు. ఆ టైమింగ్‌ సింక్‌ అవడంతో ఆ సీన్‌ చాలా సహజంగా ఉంది. అయితే ఆ సన్నివేశాన్ని కులుమనాలిలో 4 డిగ్రీల చలిలో చిత్రీకరించారు. నేనే కాదు, నటుడు కలైయరసన్‌ తదితర చిత్ర యూనిట్‌ అంతా ఎంతో శ్రమించి పనిచేశారు. ఉరు చిత్రంలో నటించడానికి విల్‌పవర్‌ అవసరమైంది.ప్రశ్న: ఉరు చిత్రంపై మీ స్పందన?

జ: దర్శకుడు కొత్తవాడైనా చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా చిత్ర సస్పెన్స్‌ను చాలా ఆసక్తిగా రీవీల్‌ చేశారు.  చిత్రానికి ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. చిత్ర వర్గాలు ఆన్‌లైన్‌ ప్రచారం బాగానే చేస్తున్నారు. అయితే పోస్టర్లలాంటివి ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. అయినా చిత్రం చూసిన వారి  స్పందన బాగుంది. ఆ మౌత్‌ ప్రచారం చిత్రానికి బాగా హెల్ప్‌ అవుతుంది.

ప్ర: అన్నీ యా„ýక్షన్‌ కథా పాత్రల్లోనే నటిస్తున్నట్లున్నారు. కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రల్లో నటించే ఆలోచన లేదా?

జ: అలాగని ఏమీ లేదు. వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. నాకు అలాంటి పాత్రలు రావడానికి బహుశ నేను వచ్చిన దర్శకుడు జననాథన్, బాలా లాంటి వారి స్కూల్‌ ఒక కారణం కావచ్చు. నా వరకూ నటిగా ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ. అది కమర్షియల్‌ కథానాయకి పాత్ర అయినా. అయితే పాత్రలు నాకు నచ్చాలి.ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?

జ: తదుపరి కాలకూత్తు చిత్రం విడుదల కానుంది. ఇది మదురైలో చాలా కాలంగా జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఇందులోనూ నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాను. ఆ తరువాత ఇళిత్తిరు చిత్రం విడుదల కానుంది. ఇందులో విదార్ధ్, తంబిరామయ్యలతో కలిసి హాస్యం పండించాను.ఇంతకు ముందు మీరు అన్నట్లు కమర్షియల్‌ కథానాయకి పాత్రను ఈ చిత్రంలో చూడవచ్చు. వాటితో పాటు తమిళం, మలయాళం భాషల్లో సోలో అనే చిత్రాన్ని, తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న వాలుజడ చిత్రాల్లో నటిస్తున్నాను. సోలో చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌ హీరో. తెలుగు చిత్రం వాలుజడ మహిళా ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం.

ప్ర: తమిళంతో పాటు తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటిస్తున్నారు. బాలీవుడ్‌కెళ్లే ఆలోచన ఉందా?

జ: నిజం చెప్పాలంటే కబాలి చిత్రం తరువాత ఇతర భాషా చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. అలానే హిందీలోనూ వస్తున్నాయి. అయితే తొందర పడదలచుకోలేదు. మంచి పాత్ర అనిపిస్తే హిందీలోనూ నటిస్తా.

Back to Top