కరోనా సోకిందేమో.. కానీ ఇంతవరకు: నటి

Actress Charvi Saraf Says Struggling To Get Covid 19 Test In Delhi - Sakshi

నటి చార్వీ సరాఫ్‌ ఆవేదన

న్యూఢిల్లీ: గొంతు నొప్పి, దగ్గు వంటి కరోనా వైరస్‌ లక్షణాలతో తాను బాధపడుతున్నట్లు ప్రముఖ టీవీ నటి, కసౌటీ జిందగీ కే ఫేం చార్వీ సరాఫ్‌ తెలిపారు. ఐదు రోజులుగా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీనైన తన పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తన కారణంగా కుటుంబం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. (ఢిల్లీ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఫైర్‌)

ప్రాణాంతక వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తనకు అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది కరోనా లక్షణాలు ఉన్నా బయటకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ వర్గాలు.. తనలాంటి వాళ్లు పరీక్ష చేయించుకోవడానికి ముందుకు వస్తే మాత్రం స్పందించడం లేదని విమర్శించారు. కోవిడ్‌-19 హెల్‌‍్పలైన్‌ నంబరుకు ఫోన్‌ చేస్తే వారం రోజుల దాకా తమ స్లాట్‌ నిండిపోయి ఉందని సమాధానం వచ్చిందన్నారు.  (నేను వెళ్లను.. తనను పంపించను)

ఈ మేరకు చార్వీ సరాఫ్‌ బహిరంగ లేఖ రాశారు. ‘‘ నాలో కోవిడ్‌-19 లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ ఢిల్లీలో టెస్టు చేయించుకోవడం ఎంత ప్రహసనంతో కూడుకున్న పనో తెలుసా? లాక్‌డౌణ్‌ విధించిన నాటి నుంచి నా స్వస్థలం ఢిల్లీలోనే ఉన్నా. అందరిలాగే మా కుటుంబమంతా ఇంటికే పరిమితమైంది. నిత్యావసరాలకు తప్ప బయటకు వెళ్లడం లేదు. కరోనాతో కలిసి జీవించడానికి అలవాటు పడ్డాం. అయితే గతవారం రోజులుగా నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. జ్వరం వచ్చింది. గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది.

ఇక ఆనాటి నుంచి మా ఫ్యామిలీ డాక్టర్లు, ప్రైవేటు డాక్టర్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు ఫోన్‌ చేస్తూనే ఉన్నా. అందరిదీ ఒకేమాట.. తగినన్ని కిట్లు అందుబాటులో లేవట. ఆ మాటలు వినీ వినీ నాకు విసుగు వచ్చింది. రోజూ మీడియాలో వార్తలు ఏమో అనుకున్నా గానీ.. అవన్నీ నిజమే. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నా. నా పరిస్థితి ఇలా ఉందంటే.. ఏ ఆధారం లేని వాళ్లు ఈ కష్టకాలాన్ని, మహమ్మారిని ఎలా ఎదుర్కొంటారో’’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం అంటే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top