చిత్ర పరిశ్రమకు వైజాగ్ కచ్చితంగా అనువైనదే :దాసరి

చిత్ర పరిశ్రమకు వైజాగ్ కచ్చితంగా అనువైనదే :దాసరి


తొలి చినుకుకి తెలీదు... అదో ఉప్పెనకు కారణం అవుతుందని. తొలి అడుగుకి తెలీదు. అది భావితరాలకు అడుగుజాడగా నిలుస్తుందని. దాసరి నారాయణరావు జీవితం అదే. తను ఎంచుకున్న రంగంలో సమున్నతంగా నిలిచి, ఎందరికో ఆదర్శప్రాయుడైన నిత్య కృషీవలుడు దాసరి. నేడు ఆయన 70వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దర్శకరత్నతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్‌వ్యూ.



70 ఏళ్లు వచ్చేశాయి కానీ, అలా కనిపించరు. ఏంటి మీ ఆరోగ్య రహస్యం?

యోగా చేస్తాను. తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటాను. అంతే.



సినీ పరిశ్రమ అంటేనే ప్రలోభాల నిలయం అంటారు. ఇంత క్రమశిక్షణగా జీవితాన్ని ఎలా మలుచుకోగలిగారు?

నేను పేద కుటుంబం నుంచి వచ్చినవాణ్ణి. జీవితం విలువ తెలుసు నాకు. రోజుకు 24 గంటల సమయం ఉంటే.. దానిలో పనిగంటలు ఎనిమిది. మిగతా సమయాన్నంతా విశ్రాంతికే ఉపయోగిస్తారు అందరూ.  కానీ నాకు ఆ విశ్రాంతి లేదు. రోజుకు 22 గంటలు పనిచేసేవాణ్ణి. ఇతర ఆలోచనలు రాకుండా ఉండటానికి అదీ ఓ కారణం. పైగా చిన్న వయసులోనే ఈ పరిశ్రమ నాకు పెద్దరికం ఇచ్చేసింది. దాంతో అందరి కళ్లూ నాపైనే. అందుకే.. ‘పదుగురికి స్ఫూర్తిగా మెలగాలి’ అనుకొని ఇలా జీవితాన్ని మలుచుకున్నాను.



ప్రస్తుతం సినిమాల విషయంలో స్లో అయ్యారేంటి?

నా భార్య పద్మకు అనారోగ్యం తలెత్తడం, ఆమె స్వర్గస్థురాలవ్వడం, తర్వాత పొలిటికల్ గొడవలు, రాష్ట్రం రెండుగా విడిపోవడాలు ఇలా... పలు  కారణాలు నన్ను డిస్ట్రబ్ చేశాయి. అందుకే సినిమాలకు విరామం వచ్చింది. త్వరలో మా అబ్బాయి అరుణ్‌బాబు హీరోగా ఓ సినిమా నిర్మించనున్నా.



ఎందరికో జీవితాన్ని ఇచ్చిన మీరు మీ అబ్బాయికి లైఫ్ ఇవ్వలేకపోయారెందుకని?

పొరపాటు జరిగింది. నా బిడ్డను ఎలా ప్రమోట్ చేయాలో అప్పట్లో నాకు తెలియలేదు. అందుకే వాడి రీ ఎంట్రీకి ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నా. మలయాళంలో ‘నేరం’ అనే సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నాం. చాలా మంచి కథ. నా కో-డెరైక్టర్ రవికుమార్‌ని దర్శకునిగా పరిచయం చేస్తున్నా.



మరి మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు?

నా దర్శకత్వంలో ‘పితృదేవోభవ’ అనే సినిమా చేయనున్నా. నేనే లీడ్‌రోల్ చేస్తా.



దర్శకునిగా మీ తీరని కోరిక ఏదైనా ఉందా?

మహాభారతంలోని యుద్ధపర్వాన్ని రెండు భాగాలుగా  సినిమా తీయాలని ఉంది. ఎందుకంటే.. దానిలో అంత విషయం ఉంది. స్క్రిప్ట్ తయారు చేస్తున్నా. ఎప్పటికైనా దాన్ని తెరకెక్కిస్తా.



మీ యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో పరిశ్రమ ఎదుర్కొన్న ఒడుదొడుకుల్ని మీరెన్నో చూశారు. ఇప్పుడు తెలుగునేల రెండు భాగాలైంది. దాంతో పరిశ్రమ కూడా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పరిశ్రమ పెద్దగా దీన్ని ఎలా విశ్లేషిస్తారు?

అది రాబోయే ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. మద్రాసు రాష్ట్రం, ఆంధ్రరాష్ట్రం రెండూ విడిపోయినప్పుడు కూడా వెంటనే పరిశ్రమ ఇక్కడకు రాలేదు. దానికి కారణం ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు. 1990 నాటికి హైదరాబాద్‌లో కూడా సదుపాయాలు ఏర్పాటు చేసుకొని, క్రమంగా ఇక్కడకు షిఫ్టయ్యాం. ఇప్పుడు తెలుగునేల రెండు రాష్ట్రాలయ్యింది. కాబట్టి ఎక్కడైతే మౌలిక సదుపాయాలున్నాయో... అక్కడ వర్క్ జరుగుతుంది. అలాగే.. ఎక్కడైతే సదుపాయాలు లేవో... అక్కడ వాటిని క్రియేట్ చేస్తారు. కొత్త రాష్ట్రంలో రాయితీలు ప్రకటిస్తారు. కచ్చితంగా లాభం చేకూరే విధంగానే రాయితీలుంటాయి. దాన్ని బట్టే పరిశ్రమ స్థితి, గతి ఉంటుంది.



ఇటీవల ఓ ప్రముఖ నిర్మాత ‘హైదరాబాద్ మీదున్న ప్రేమతో మేం ఇక్కడకు రాలేదు. రాయితీలు ప్రకటించారు కాబట్టే వచ్చాం. కొత్త రాష్ట్రం ప్రకటించే రాయితీలను బట్టే పరిశ్రమ నిర్ణయం ఉంటుంది’ అన్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా?

ఎవరి దృక్పథం వారిది. మా వరకు మేం ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమతోనే ఇక్కడకొచ్చాం. మద్రాసులో ఇళ్లు, స్థలాలు ఉండి, సినిమా నిర్మాణానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉండి... మేం ఇక్కడకు ఎందుకు వచ్చామంటే, అది తెలుగు నేలపై ఉన్న ప్రేమతోనే.



అసలు సినిమా పరిశ్రమ పరంగా వైజాగ్ భవిష్యత్తు ఎలా ఉంటుందనుకుంటున్నారు?

వైజాగ్ కచ్చితంగా పరిశ్రమకు అనువైనదే. మౌలిక సదుపాయాలు కూడా అక్కడ తొందరగానే సమకూరుతాయి. ఉదాహరణకు కర్నాటక రాష్ట్రంలో బెంగళూరుతో పాటు మైసూర్‌లోనూ స్టూడియోలున్నాయి. తమిళనాడులో చెన్నయ్‌తో పాటు కోయంబత్తూర్‌లో కూడా సదుపాయాలున్నాయి. అలా మనం కూడా వైజాగ్‌ని సినీ కేంద్రంగా అభివృద్ధి చేసుకోవచ్చు.



మీరు ఈ రోజుల్లో దర్శకుడైతే ఇంత సాధించేవారా?

అసలు దర్శకునిగా నాకు ఛాన్సిచ్చేవారు ఎవరున్నారిప్పుడు. ఒకవేళ దర్శకుణ్ణి అయినా... నా సినిమా తొలి కాపీ ల్యాబ్‌లో పడి ఉండేది. నేనేమో... ఫొటో కార్డులు పట్టుకొని డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ, ఎగ్జిబిటర్ల చుట్టూ, సురేశ్‌బాబు చుట్టూ, దిల్ రాజు చుట్టూ తిరుగుతూ ఉండేవాణ్ణి. అప్పుడు పరిశ్రమకు ఒక మోహన్‌బాబు వచ్చేవాడు కాదు... మురళీమోహన్ లేడు... శ్రీహరి లేడు.. నారాయణమూర్తి లేడు.. రేలంగి నరసింహారావు, రవిరాజా, కోడి రామకృష్ణ... ఇలా ఎవ్వరూ ఉండేవారు కాదు.



చివరిగా ఓ ప్రశ్న. అక్కినేనిగారికి, మీకు మనస్పర్థలున్నా.. భౌతికంగా ఆయన దూరమవుతున్న సమయంలో చితిపై ఉన్న ఆయన పార్ధివ దేహాన్ని చూసి అంతగా కదిలిపోయారేం?

ఎంతైనా నేను ఆరాధించే నటుడాయన. పైగా అక్కినేనిగారితో నా అనుబంధం చాలా గొప్పది. ఆయన హీరోగా 27 ిసినిమాలు డెరైక్ట్ చేశాన్నేను. తొమ్మిదేళ్లు మా ఇద్దరి మధ్య మాటల్లేవు. ఓ ప్రత్యేకమైన కారణం వల్ల మేం విడిపోయాం. కానీ, మనసులో గూడుకట్టుకున్న అనుబంధం ఎక్కడికి  పోతుంది. బుర్రా నరసింహ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top