రెమో సంస్థలో నివీన్‌ పౌలీ

రెమో సంస్థలో నివీన్‌ పౌలీ


తమిళసినిమా: మలయాళ నటుడు నివీన్‌పౌలీ కోలీవుడ్‌లోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే మాలీవుడ్‌లో ప్రేమమ్‌ చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నివీన్‌ పౌలీ ప్రస్తుతం అక్కడ నయనతారతో రొమాన్స్‌ చేస్తున్నారు. ఈయన తాజాగా శివకార్తీకేయన్‌ సంస్థలో పాగా వేయనున్నారు.శివకార్తీకేయన్‌ హీరోగా రెమో చిత్రాన్ని నిర్మించిన 24 ఏఎం స్టూడియోస్‌ అధినేత ఆర్‌డీ.రాజా ప్రస్తుతం అదే నటుడితో వేలైక్కారన్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో ఆర్‌డీ.రాజా తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. తన సంస్థలో తెరకెక్కనున్న మూడవ చిత్రంలో కథానాయకుడిగా నివీన్‌ పౌలీని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి నవదర్శకుడు ప్రభు రాధాకృష్ణన్‌ మెగా ఫోన్‌ పట్టనున్నారు. ఈ విషయంపై మంగళవారం ఓ ప్రకటనలో తెలుపుతూ దర్శకుడు ప్రియదర్శన్,సంతోష్‌శివన్‌లవద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన ప్రభు రాధాకృష్ణన్‌లో మంచి ప్రతిభ ఉందన్నారు.ఈ చిత్రానికి ప్రముఖ చాయాగ్రహకుడు పీసీ.శ్రీరామ్‌ పని చేయనుండటం సంతోషకరమైన విషయం అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌ జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 24 ఏఎం.స్టూడియో ద్వారా దర్శకుడిగా పరిచయం కానుండడం సంతోషంగా ఉందని దర్శకుడు ప్రభు రాధాకృష్ణన్‌ అన్నారు. చిత్ర నిర్మాణంపై మంచి అవగాహన ఉన్న నిర్మాత ఆర్‌డీ.రాజాలో మంచి కథకుడు ఉన్నాడని, ఈ చిత్రానికి కథను ఆయనే అందించారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

Back to Top