ఆస్తి కావాలా? ప్రేమ కావాలా? నిర్ణయించుకో..

Young Man Love Story - Sakshi

పెద్దమ్మ జాతర తెచ్చిన సందడితో ఆ రోజు మా ఊరు మొత్తం అందంగా మారిపోయింది. ముఖ్యంగా మా ఇళ్లు. కొత్త, పాత బంధువులు.. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు. నలుగురం ఉండే ఆ ఇంట్లో ఒక్కసారిగా అంతమంది చేరేసరికి సంతోషంగా అనిపించింది. నా ఆనందానికి మరో కారణం కూడా ఉంది. కీర్తి.. ఆమె నాకు కొత్తకాదు. మా దగ్గరి బంధువు, మరదలి వరుస! ఎన్నో సార్లు నేను వాళ్ల ఊరికి వెళ్లాను, వాళ్ల ఇంట్లో ఉన్నాను. కానీ, నాకెప్పుడూ ఆమె మీద ప్రేమ కలగలేదు. కానీ, మా ఊరిలో ఉన్నపుడు మా ఇద్దరి మధ్యా చనువు బాగా పెరగటం మూలాన కావచ్చు! నేను ఆమెను ప్రేమించటం మొదలుపెట్టాను. తను కూడా నేను చదువుతున్న ఊర్లోనే చదువుతుండటంతో వీలైనంత ఎక్కువగా కలుస్తుండేవాళ్లం. ఓ సారి మాటల సందర్భంలో నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పాను. ఏ విషయం తను తర్వాత చెప్తానంది.

నన్ను ప్రేమిస్తున్నానని కీర్తి చెప్పినా.. చెప్పకపోయినా తను నన్ను ప్రేమిస్తోందని నాకు అర్థమైంది. ఆ తర్వాత ఇద్దరం ఫోన్లలో తరుచూ మాట్లాడుకునే వాళ్లం, చాటింగ్‌లు చేసుకునే వాళ్లం. అప్పటినుంచి వాళ్ల ఊరికి తరుచూ వెళ్లేవాణ్ని. వాళ్ల అమ్మానాన్నలతో చాలా క్లోజ్‌ అయ్యాను. వాళ్లు కూడా నేనంటే చాలా ప్రేమగా ఉండేవాళ్లు. మెల్లగా మా ప్రేమ విషయాన్ని వాళ్ల ఇంట్లో వాళ్లకు చెప్పాను. వాళ్లు మొదట ఒప్పుకోలేదు. కీర్తి వాళ్లను కన్విన్స్‌ చేసింది. సరే అన్నారు వాళ్లు. కానీ, ఓ కండిషన్‌ పెట్టారు. మా అమ్మానాన్న ఒప్పుకుంటేనే పెళ్లి చేస్తానన్నారు. మా వాళ్లు నా మాట కాదనరని మొండి నమ్మకం, వాళ్లను ఒప్పిస్తానని మాట ఇచ్చాను. కొద్దిరోజుల తర్వాత నేను చెప్పకుండానే ఆ విషయం మా ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది. వాళ్లు మొదట సుముఖంగానే ఉన్నా బంధువుల చెప్పుడు మాటలు విని నా మీద ఒత్తిడి తెచ్చారు.

మా అన్న నా మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నేను వెనక్కి తగ్గలేదు.  ‘‘ఆస్తి కావాలా? ప్రేమ కావాలా? నిర్ణయించుకో.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను’’ చాలా సినిమాల్లో విన్న డైలాగే మొదటిసారి మా అమ్మ నోటివెంట విన్నపుడు చాలా బాధగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించి ‘‘ నాకు మీ ఆస్తి అక్కర్లేదు. నాకు కీర్తి అంటే ప్రాణం. ఆమెనే పెళ్లిచేసుకుంటాను’’ అన్నాను. నేను కీర్తిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మా అమ్మ బెదిరించింది. అమ్మా.. కీర్తి.. ఎవరో ఒక్కర్ని మాత్రమే నేను నా జీవితంలో ఉంచగలను. ఆ ఆలోచనరాగానే ఎంతో బాధగా అనిపించింది.. గుండె బరువెక్కింది.. కళ్లు అప్రయత్నంగా చెమర్చాయి. అలా ఒక్కసారి కాదు. లెక్కలేనన్ని సార్లు. చివరిగా ఓ నిర్ణయం తీసుకున్నాను. కీర్తిని.. కాదు నా ప్రాణాన్ని వదిలి దూరంగా ఉండాలని.
- ఎస్‌. రమేశ్‌ రావు( పేర్లుమార్చాం)

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top