ప్రేమలోకంలో గడ్డిపోచ కూడా..

Woman Fight With Lion For Husband In California - Sakshi

ప్రేమ... ధైర్యాన్నిస్తుంది. బతకడానికే కాదు... చావుతో పోరాడటానికి కూడా. అందుకు నెల్ సాహసమే ఓ పెద్ద ఉదాహరణ. తాను ప్రాణంగా ప్రేమించే తన భర్త ప్రాణాన్ని కాపాడుకోవడానికి మృత్యువు ముఖంలో ముఖం పెట్టి చూసింది నెల్. ఆ పోరాటంలో చివరికి ఆమె గెలిచిందా? ఓడిందా? ఈ కథ చదివితే తెలుస్తుంది.

‘‘రేపు మన పెళ్లి రోజు... గుర్తుందా?’’ అంది నెల్. ‘‘నా పుట్టిన రోజునైనా మరిచి పోతానుగానీ... మన పెళ్లి రోజును మరిచిపోగలనా? అది నేను నిజంగా పుట్టిన రోజు కదా!’’ చెప్పాడు జిమ్. ‘‘మరి రేపు మన ప్లాన్ ఏమిటి?’’‘‘ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్,  బంధువులతో కలిసి రెస్టారెంటుకి వెళ్లడం, డిన్నర్‌లు చేయడం బోర్ కోడుతుంది. ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం.’’‘‘ఎలా?’’‘‘మనిద్దరమే ఎక్కడికైనా ఏకాంతంలోకి వెళదాం. అక్కడ  మన ప్రేమ జ్ఞాప కాలను  ఒక్కొటొక్కటిగా  గుర్తు తెచ్చుకుందాం. నాకైతే క్రిక్ రెడ్‌వుడ్ స్టేట్  పార్క్ చూడాలని ఎప్పటి నుంచో ఉంది. నువ్వే మంటావు?’’ ఆసక్తిగా అడిగాడు జిమ్.‘‘తప్పకుండా వెళదాం’’ అంది నెల్. జిమ్, నెల్‌లకు పెళ్ళై రెండు దశబ్దాలు దాటిందంటే ఎవరూ నమ్మరు. ఎప్పుడూ నవ దంపతులలాగే కనిపిస్తారు వాళ్లు.

జిమ్, నెల్‌
పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇరువైపుల పెద్దలూ అంగీకరించలేదు. అయినా ఎన్నో కష్టాలకు ఎదురు నిల్చి పెళ్లి చేసుకున్నారు. ఆదర్శ దాంపత్యానికి  నమూనాగా మారారు. కాలిఫోర్నియాలోని ‘క్రిక్ రెడ్‌వుడ్ స్టేట్ పార్క్’ పద్నాలుగు వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులోకి అడుగు పెడితే ఒక మహారణ్యంలోకి  అడుగు పెట్టినట్లుగానే ఉంటుంది. రకరకాల జంతు జాతులతో పాటు కొన్ని  వందల ఏళ్ల నాటి రెడ్‌వుడ్ చెట్లు పార్క్‌కు నిండుదనం తీసుకు వచ్చాయి. విశాలమైన రెడ్‌వుడ్ చెట్టు నీడలో కూర్చున్నారు జిమ్, నెల్‌లు. ఆ చల్లటి చెట్టు నీడలో వెచ్చటి ప్రేమ జ్ఞాపకాలు అలలు అలలుగా! ‘‘బొద్దింకను  చూస్తే కూడా భయపడే నువ్వు, నన్ను ప్రేమించి పెళ్లాడటానికి సింహంలాంటి మీ నాన్నను ఎలా ఎదిరించావో, ఎంత ధైర్యం చేశావో తలచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది నాకు’’ అన్నాడు జిమ్ నవ్వుతూ.

ఆ నవ్వుతో శృతి కలిపింది నెల్.‘‘నీకోసం సింహంలాంటి మా నాన్నతోనే కాదు, నిజంగానే సింహం వచ్చినా ఎదురొడ్డి పోరాడతాను’’ అంది నెల్ నాటకీయంగా. ఆమె అన్న ఆ మాట కొద్ది క్షణాల్లో నిజమైంది. ఉన్నట్టుండి ఒక చిత్రమైన, భయానకమైన శబ్దం వినిపించింది. అది ఏమిటా అని వెనక్కి తిరిగి చూశాడు జిమ్. సింహం! భయంతో గుండెలు అదిరిపోయాయి. మెదడు స్తంభించిపోయింది. ఆ సింహం  ఒక్కసారిగా పంజా విసిరింది. తల మీద ఎవరో బేస్‌బాల్ బ్యాట్‌తో  బలంగా కొట్టినట్లు అనిపించింది జిమ్‌కు అతడు తేరుకునే లోపే. సింహం జిమ్‌ను నోట కరచుకుంది. ఈడ్చుకెళ్లసాగింది. అతడిని రకాలుగా గాయపరుస్తోంది. జిమ్ నిస్సహాయంగా అరుస్తున్నాడు. నెల్‌కి ఏం చేయాలో అర్థం కావడం లేదు.

 గాయాలతో జిమ్‌, పక్కనే నెల్‌
తన భర్తను ఎలా కాపాడుకోవాలి? దగ్గరలో ఎవరూ కనిపించడం లేదు. మరి ఎలా? జిమ్‌కి ఏదైనా అయితే?ఆ ఆలోచనే భరించలేకపోయింది నెల్. చుట్టూ చూసింది. ఒక కర్ర కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని పరుగు తీసింది నెల్. అప్పటికే సింహం జిమ్‌ని ఓచోట పడేసింది. చంపడానికి సిద్ధపడుతోంది. దాని దృష్టి కేవలం జిమ్పైనే ఉంది. ఇదే అదునుగా, తన చేతిలోని కర్రతో సింహం తల మీద బాదడం మొదలెట్టింది నెల్. జేబులోంచి పెన్ను తీసి  సింహం కళ్లలోకి గుచ్చింది. తట్టుకోలేక సింహం వెన్నుచూపింది.  అంతలో పార్క్ సిబ్బంది వ్యాన్ ఒకటి అక్కడికి వచ్చింది. వాళ్లు జిమ్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ‘కాలిఫోర్నియా పసిఫిక్ మెడికల్ సెంటర్’లో చికిత్స పొందుతూ  కోలుకున్నాడు జిమ్. భర్త కోసం ప్రాణాలొడ్డిన నెల్ ధైర్యసాహసాలని మెచ్చుకుంటూ ఎన్నో అవార్డ్‌లు వరించాయి. ‘ప్రేమలోకంలో గుడ్డిదీపం కూడా సూర్యతేజం అవుతుంది. ప్రేమలోకంలో గడ్డిపోచ కూడా... వజ్రాయుధమై మెరిసిపోతుంది!’ 
(2007లో సింహం దాడికి గురైన జిమ్‌ 13 ఏళ్ల తర్వాత 82ఏళ్ల వయసులో 2019 అక్టోబర్‌లో క్యాన్సర్‌ బారిన పడి మృతి చెందాడు.)
- యాకూబ్ పాషా


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top