ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు

Venky Sad Ending Telugu Love Story - Sakshi

‘‘రేయ్‌ మన క్లాస్‌లోకి ఎవరో కొత్త అమ్మాయి వస్తోందిరా’’ అన్నాడు జీవన్‌. అంతే నా కళ్లు అటు వైపు తిరిగాయి. మదిలో ఎన్నో ప్రశ్నలు. ఇప్పటికే నా ర్యాంక్‌ రెండుకు పడిపోయింది. ఆమె కూడా టాప్‌ ర్యాంక్‌ స్డూడెంట్‌ అయితే ఇంకేముంది నా పని ఖతం అని అనుకుంటూనే క్లాస్‌రూంలోకి వెళ్లాను. ఎప్పుడు వస్తుందా అని వెయిట్‌ చేస్తున్నాను. ఇంతలోనే రెండు జడలు, కాళ్లకు పట్టీలు ఉన్న ఓ అమ్మాయి తరగతి గదిలోకి ఎంటరైంది. అమాయకపు ముఖంతో పెదవులపై చిరునవ్వుతో ఆమె క్లాస్‌లోకి వచ్చింది. బోర్డు దగ్గరికి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంది. తొమ్మిదో తరగతి వరకూ ప్రైవేట్‌ స్కూల్‌లో చదివిన అపర్ణ.. పదో తరగతి కోసం మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చింది. వాళ్ల నాన్న వ్యాపారం రీత్యా మా గ్రామానికి వచ్చి స్థిరపడిపోయాడు.

దీంతో తన కుటుంబాన్ని కూడా మా గ్రామానికి తీసుకొచ్చారు. అపర్ణ అమాయకపు పిల్ల! సిగ్గు ఎక్కువే. ఎక్కువ మాట్లాడేది కాదు. ప్రైవేట్‌ స్కూల్‌ కదా.. టాపర్‌ అనుకొని కొద్ది రోజులు మేమూ ఆమెతో సరిగా మాట్లాడలేదు. బుక్స్‌ అడిగితే ఇవ్వడానికి భయపడేవాళ్లం. ఎక్కడ మా రాత బాగోలేదని నవ్వుకుంటుందని. కొద్ది రోజుల తర్వాత ఆమెతో మెల్లిగా మాటలు కలిశాయి. మా క్లాస్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ని కాదని నన్నే బుక్స్‌ అడిగేది. అలా మా పరిచయం కొంచెం పెరిగింది. సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లే ముందు ఇద్దరం కలిసే వెళ్లేవాళ్లం. వాళ్లు కిరాయికి ఉన్న ఇల్లు కూడా మా ఇంటి వైపే ఉండడం వల్ల మేం ఇంకా క్లోజ్‌ అయ్యాం. ఇద్దరం కలిసి చదువుకునే వాళ్లం. ప్రతి విషయం షేర్‌ చేసుకునే వాళ్లం. రేయ్‌, ఒసేయ్‌ అనే స్థాయికి మా ఫ్రెండ్‌షిప్‌ ఎదిగింది.

అయితే అది ప్రేమ అని మాత్రం మాకు తెలియదు. మా ఇద్దరికి ఆ ఆలోచన లేదు. అయితే ప్రతి బ్యాచ్‌లో పుకార్లు పుట్టించేవాళ్లు ఒకరిద్దరు ఉన్నట్లే.. మా బ్యాచ్‌లోనూ ఓ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్లకి చదువు రాదు కానీ.. పుకార్లు పుట్టించడంలో వాళ్లే టాపర్లు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో సిద్ధహస్తులు.  అపర్ణ, వెంకీ మధ్య ఏదో  ఉందని, వాళ్లు క్లాస్‌ రూంలో సైగలు చేసుకుంటున్నారని పుకార్లు పుట్టించారు. ఆ పుకారు కాస్త మా క్లాస్‌మేట్స్‌ అందరికి తెలిసింది. నాకు, అపర్ణకు తప్ప. ఇంకేముంది మేము మామూలుగా మాట్లాడుకున్నా మా క్లాస్‌మేట్స్‌ ఆ దృష్టితోనే చూసేవారు. నాకేమో ఆ ఆలోచనే రాలేదు. తనకు నేను ప్రపోజ్‌ చేశానని, ఆమె ఒప్పుకుందని, క్లాస్‌ రూంలో ఏవేవో పుకార్లు చక్కర్లు కొట్టాయి.

ఈ విషయం ఓ రోజు అపర్ణకు తెలిసింది. అంతే ఇక ఆ రోజు మొత్తం డల్‌గా ఉంది. మరుసటి రోజు నుంచి నాతో మాట్లాడడం మానేసింది. సాయంత్రం కూడా నాతో కలిసి రాలేదు. నాకు చాలా బాధేసింది. ఏదో కోల్పోయిన ఫీలింగ్‌ నాకు కలిగింది. ఉండలేకపోయాను. ఓ రోజు సాయంత్రం తనింటికి వెళ్లాను. ఏమైంది. ఎందుకు మాట్లాడడం లేదని అడిగాను. అంతే ఇక తను ఏడవడం మొదలెట్టింది. ‘‘ మన మధ్య ఏదో ఉందట. ఫ్రెండ్స్ అందరూ మన గురించి బ్యాడ్‌గా అనుకుంటున్నారు. అందుకే మాట్లాడడం లేదు’’ అని చెప్పింది. అంతే ఇక నాకు చిర్రెత్తుకొచ్చింది. మరుసటి రోజు ఆ ఇద్దరు అమ్మాయిలను ఎడాపెడా తిట్టేశా. ‘‘ఆడా, మగా మాట్లాడుకుంటే ప్రేమేనా? నేను అందరితో మాట్లాడుతా. అలా అని అందరిని ప్రేమించినట్లేనా? పుకార్లు ఆపి చదువుపై దృష్టిపెడితే మంచిది’’  అంటూ వార్నింగ్‌ ఇచ్చా.

ఆ రోజు నుంచి మా గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇంతలోనే వీడ్కోలు పార్టీ వచ్చింది. అందరూ డాన్స్‌, పాటలు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అపర్ణ కూడా డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తోంది. నా దృష్టి అంతా అపర్ణ మీదే ఉంది. తను ఎలా చేస్తోంది అని. తెల్లారితే వీడ్కోలు పార్టీ. అంతకు ముందు రోజు సాయంత్రం అపర్ణ మా ఇంటికి వచ్చింది. ‘‘రేయ్‌ రేపు పార్టీ కదరా ఏ డ్రెస్‌ వేసుకోవాలి’’ అని అడిగింది. ‘నాకేం తెలుసే బాబు! నువ్వు ఏ డ్రెస్‌ వేసినా బాగుంటావ్‌’’ అన్నాను. ‘‘అబ్బ ఛా.. ఇప్పుడు నిజం చెప్పు’’ అంది. ‘‘ నిజమే బాబు!’’ అన్నా. ‘‘సరే చెప్పకులే’’  అంటూ తను అలిగి వెళ్లిపోయింది. మరుసటిరోజు పార్టీకి అందరూ వచ్చారు. నేను ముందే వెళ్లాను. అపర్ణకు చెప్పకుండా. అందరూ వచ్చారు. ఇంకా అపర్ణ రాలేదు. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా.

ఇంతలో లైట్‌ ఎల్లో కలర్‌ శారీలో అపర్ణ దర్శనమిచ్చింది. అంతే నా కళ్లు ఆమె వైపునుంచి పక్కకు తిరగలేదు. మనసులో ఏదో ఫీలింగ్‌. అపర్ణ అంటే ‘నా’  అనే ఫీలింగ్‌ ఆ రోజు కలిగింది. ఆ డే మొత్తం అపర్ణను చూస్తూనే ఉన్నా. ఆ రోజే తెలిసింది నేను అపర్ణను ప్రేమిస్తున్నానని. ఇంతలో ఎగ్జామ్స్‌ వచ్చాయి. పదోతరగతి అయిపోయింది. ఇంటర్‌ వేరు వేరు కాలేజీల్లో జాయిన్‌ అయ్యాం. తను సీఈసీ అయితే.. నాది ఎంపీసీ గ్రూప్‌. ఎక్కువగా కలిసేది కాదు. కాలేజీ టైమింగ్స్‌ కూడా వేరు వేరు. తను ఆటోలో వెళ్తే.. నేను సైకిల్‌పై వెళ్లేవాణ్ని. కొద్దిరోజులకు వాళ్లు సొంత ఇల్లు కట్టుకొని దాంట్లోకి వెళ్లిపోయారు. దీంతో మా మధ్య దూరం పెరిగింది. ఆటోలో కాలేజీకి వెళ్తుంటే చూడటమే తప్ప.. తనతో ఎక్కువగా మాట్లాడలేదు. ఓ రోజు వాళ్ల నాన్న ఫోన్‌ నెంబర్‌ నాకు తెలిసింది. 

నా ఫోన్‌ నుంచి ఆ నంబర్‌కు ‘‘హాయ్‌’’ అని మెసేజ్‌ చేశా. నో రిప్లై. మరుసటి రోజు ‘‘హూ ఆర్‌ యూ’’ అని రిప్లై వచ్చింది. ‘‘ఐయామ్‌ యూవర్‌ టెన్త్‌ ఫ్రెండ్‌’’ అని రిఫ్లై ఇచ్చా.  ‘‘వెంకీనా’’ అని రిఫ్లై వచ్చింది.  అవును అని చెప్పా. ఆ రోజు నుంచి మా మధ్య చాటింగ్‌ మొదలైంది. ప్రతి రోజు రూ.11 పెట్టి మెసేజ్‌ బ్యాలెన్స్‌ వేయించుకొని చాట్‌ చేసేవాణ్ని. బాగా మాట్లాడేది కానీ.. ప్రేమ విషయం చెప్పాలంటే భయపడేవాణ్ని. ఓ రోజు ఎలాగైనా చెప్పాలని డిసైడ్‌ అయ్యాను. నాకు ఇంగ్లీష్‌ పుస్తకం కావాలని మెసేజ్‌ చేశాను. వచ్చి తీసుకెళ్లమని చెప్పింది. పుస్తకం తెచ్చుకుని లవ్‌ లెటర్‌ అందులో పెట్టివ్వాలనేది నా ప్లాన్‌. కానీ భయమేసింది. లవ్‌లెటర్‌ రాయలేకపోయాను. పుస్తకం మధ్య రెడ్‌ పెన్నుతో ‘ఐ లవ్‌ యూ అప్పు’  అని రాశా.

మరుసటి రోజు పుస్తకం తనకు ఇచ్చా. తను చూసిందో లేదో ..చూస్తే ఎలా రియాక్ట్‌ అవుతుందో అని టెన్షన్‌ పడ్డా. కానీ అపర్ణ మాత్రం రోజూ లాగే మాట్లాడింది. బహుశా తను చూడలేదనుకున్నా.ఇలా ఉండగానే ఇంటర్‌ కంప్లీట్‌ అయింది. నేను బీటెక్‌లో జాయిన్‌ అయ్యా. తను డిగ్రీ చేసింది. ఇద్దరం దూరమైపోయాం. నంబర్‌ ఛేంజ్‌ చేశారు. నో కాంటాక్ట్‌. బీటెక్‌లో చాలా మంది అమ్మాయిలు ఫ్రెండ్స్‌ అయినా అప్పును మర్చిపోలేకపోయాను. తన జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ నాతోనే ఉండేవి. వాళ్లు మా ఊరి నుంచి వెళ్లిపోయారు. ఇక జీవితంలో తనను చూడలేకపోతానేమో అనుకుని బాధపడే వాణ్ని. కొద్ది రోజుల తర్వాత ఓ ఫ్రెండ్‌ ద్వారా తను చదువుకునే కాలేజీ అడ్రస్‌ తెలుసుకున్నాను. ఆమె ఫోన్‌ నంబర్‌ కనుకునేందుకు చాలా ప్రయత్నించాను కానీ కుదరలేదు.

బీటెక్‌  థర్డ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు ఆ కాలేజీకి వెళ్లాను. తనను కలిసేందుకు ట్రై చేశా. కానీ కనిపించలేదు. అలా 6 నెలల్లో దాదాపు 20-30 సార్లు ఆ కాలేజీకి వెళ్లి ఆమె కోసం ఎదురు చూశా. కానీ కనిపించలేదు. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు స్నేహితుడి పెళ్లి కోసం కర్నూలు వెళ్లేందుకు ఎంజీబీఎస్‌ బస్టాండ్‌కు వెళ్లాను. బస్టాండ్‌లో ఓ గొంతు వినబడింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించింది. వెనక్కి తిరగ్గా.. కొంతమంది గుంపుగా బస్టాండ్‌ వైపు వెళ్తున్నారు. ఆ గొంతు ఆ గుంపులోనుంచే వచ్చింది.

రెండడుగులు వెనక్కి వేసి గుంపులోకి తొంగి చూశా. ఎల్లో కలర్‌ శారీలో పొడవాటి జడతో అపర్ణ కనిపించింది. ఎగిరి గంతేశా. ఇంతలోనే ‘‘ఏమండీ త్వరగా రండి బస్‌ వెళ్లిపోతుంది’’ అని అపర్ణ పిలిచింది. అంతే ఇక అక్కడే ఆగిపోయా. తనకి పెళ్లి అయిపోయింది. తను నన్ను మర్చిపోయింది. మళ్లీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసి బాధపడొద్దని అక్కడి నుంచి వెళ్లిపోయాను. నేను తన నుంచి ప్రేమను ఆశిస్తే.. తను నా స్నేహాన్ని మాత్రమే కోరుకుంది కాబోలు. ఏదేమైనా నా జీవితంలో అప్పు జ్ఞాపకాలు ఇప్పటికీ చెరిగిపోలేదు! ఇక, ఎప్పటికీ చెరిగిపోవు కూడా.
-వెంకీ


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top