ప్రేయసి ముందే వేరే అమ్మాయితో...

Charan Happy ending Telugu  Love Story  - Sakshi

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో చూశాను తనని. చాలా సరదాగా, ఉల్లాసంగా ఉండేది. కాలేజీలో ఎంత మంది అమ్మాయిలు ఉ‍న్నా..నేను తనకే కనెక్ట్‌ అయ్యాను. నేను చూస్తున్నానన్న సంగతి తనకు కూడా తెలుసు కానీ ఏమీ తెలీనట్లు ఉండేది. రోజూ తనని చూడటం కోసమే కాలేజీకి వెళ్లేవాడిని. తను ఎప్పుడైనా కాలేజీకి రాకపోతే చాలా బాధేసేది. తనతో డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నా. కానీ మాట్లాడలేకపోయా. ఒకరోజు నేను బైక్‌పై వెళుతుంటే నన్నే చూస్తుందని అద్దంలో చూశాక అర్థమయ్యింది. అప్పుడు తెలిసింది నేనంటే తనకు కూడా ఇష్టమని.

ఆ తర్వాత ప్రతీరోజు లంచ్‌ బ్రేక్‌లో తన క్లాస్‌ ముందు పడిగాపులు కాస్తూ తనకి సైట్‌ కొట్టేవాడిని. తను మాత్రం అసలు ఏమీ తెలీనట్లు ఉండేది. నేను ఎన్నిసార్లు చూసినా తిరిగి చూసేది కాదు. అలా సంవత్సరం గడిచింది. ఓ రోజు ల్యాబ్‌లో నా పక్కనే కూర్చింది. నేనే మొదట మాటలు కలిపా. అయినా తను మాత్రం నిగ్రహంలా ఉండేది తప్ప మాట్లాడేది కాదు. నేనేమో తను నన్ను చూడాలన్న తాపత్రయంతో ప్రతీరోజు కొత్త కొత్త బట్టలు వేసుకునేవాడ్ని. స్టైల్‌గా ఫోజులు కొడుతూ తన క్లాస్‌ బయట వెయిట్‌ చేసేవాడిని. తన నుంచి నో రెస్పాన్స్‌.

ఇలా అయితే కష్టం అనుకొని ఓ ప్లా్న్‌ వేశా. తన ముందే నేను వేరే అమ్మాయితో చనువుగా ఉన్నట్లు నటించాను. అప్పుడు నన్ను చాలా కోపంగా చూసేది. ఎలా అయితే ఏంటి చూస్తుంది కదా అనుకునేవాడ్ని. నా నటన కాస్తా డోస్‌ పెంచాను. రుద్రకాళీలా నాపై కన్నెర్ర చేసింది. ఇక లాభం లేదనుకొని తన ఫ్రెండ్‌ సహాయంతో ఓ రెస్టారెంట్‌లో కలిసా. అసలు నిజం చెప్పి ప్రేమిస్తున్నానంటూ చేతిలో ఓ రోజా పువ్వు పెట్టా. మొదట నన్ను బాగా తిట్టింది కానీ అర్థం చేసుకుంది. తను నా లైఫ్‌లో వచ్చినప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి. నా జీవితం మరింత అందంగా మారింది. మేము ప్రేమించుకొని ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. తను దొరకడం నా అదృష్టంగా భావిస్తుంటా. 

- చరణ్‌

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top