నిన్ను తప్ప వేరే వ్యక్తిని భర్తగా ఉహించుకోలేను.. అంది

Arjun Happy Ending Telugu Love Story - Sakshi

నేను బీటెక్‌ చదువుతున్న రోజులవి. మా తల్లిదండ్రులు, ఇల్లు, ఫ్రెండ్స్, చదువు ఇవే నా లోకం. అప్పట్లో నాకు ప్రేమ అనే వాటిపై నమ్మకం ఉండేది కాదు. ఆ వయసులో మనకి కలిగేది ఒక ఆకర్షణ మాత్రమే ప్రేమ కాదు అని నమ్మే వాడిని. అప్పుడే నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నా నమ్మకం నిజం కాదు అని తెలిసేలా చేసింది. ఇప్పుడు మీతో ఆ సంఘనని పంచుకోవాలనుకుంటున్నా. నేను హైరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాను. వేసవికాలం సెలవులు ముగించుకుని కళాశాల ప్రారంభం అయింది. నేను కళాశాలకి ఎప్పటిలాగే వెళ్ళాను. నా తరగతి గదికి వెళ్లే ముందు నాకు ఒక అమ్మాయి కనపడింది. తను ఆ రోజే మొదటిసారి కాలేజ్‌కు వచ్చింది. ‘ప్రిన్సిపాల్ గారి రూం ఎక్కడ’ అని నన్ను అడిగింది. తనని చూడగానే నాలో ఏదో తెలియని కల్లోలం. తనని చూడటానికి నా రెండు కళ్లూ సరిపోలేదు! తను నా కోసమే పుట్టిందేమో అన్న భావన నాలో కలిగింది. తనని చూస్తూ ఓ నిమిషం పాటు అలానే ఉండిపోయా..!! తను అప్పుడు మళ్లీ నన్ను ‘‘హల్లో!! ప్రిన్సిపాల్ గారి రూం ఎక్కడ’’ అని అడిగింది.  అప్పుడు నేను ఊహా లోకంనుంచి బయటకి వచ్చి తనకి దారి చూపించాను. తను వెళ్లిపోయింది. నేను తననే ఊహించుకుంటూ తరగతి గదికి వెళ్లిపోయాను.

ఇంతలో తను నా తరగతి గదికి వచ్చి నా పక్క బెంచిలో కూర్చుంది. నేను అది అంతా నా ఊహ అనుకున్నా. కానీ, అప్పుడే మా ఫ్రెండ్ చెప్పాడు తను మా సహ విద్యార్థిని అని, వేరే కళాశాల నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్  ద్వారా వచ్చింది అని. ఇక తనని రోజూ చూడొచ్చు మాట్లాడొచ్చు అని నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇలా ఒక నెల గడిచిపోయింది. ఆ అమ్మాయితో అంతవరకు మాట్లాడలేకపోయాను. ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడని నేను ఆ అమ్మాయితో మాట్లాడడం కరెక్టో కాదో అన్న సందేహం. తనతో మాట్లాడాలి అంటే నాలో ఏదో తెలయని భయం కలిగేది. ఆ భయంతో మాట్లాడ లేదు. ఇక లాభం లేదు అని ఒక రోజు కళాశాలలో పుస్తకం అడిగే వంకతో తనతో మాటలు కలిపాను. అప్పుడే తన పేరు తెలుసుకున్నా.. శ్రావ్య అని. ఇలా అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉన్నా. కొన్ని రోజుల తర్వాత నా చిన్ననాటి స్నేహతురాలు చైత్ర నన్ను కలవడానికి ఇంటికి వచ్చింది. చాలా రోజుల తర్వాత కలిశాం కదా అని తనతో అలా బయటకి వెళ్ళినప్పుడే అక్కడ నాకు శ్రావ్య కనపడింది. తనతో మాట్లాడుతూ చైత్రని పరిచయం చేపిద్దాం అని అనుకునేలోపు నాకు తెలిసింది ఏమిటి అంటే వాల్లిద్దరికీ ముందునుండే పరిచయం వుంది అని.

అలా కాసేపు మాట్లాడాక శ్రావ్య వెళ్లిపోయింది. అక్కడి నుండి నేను ఎంతో సంతోషంతో చైత్రకు జరిగింది అంతా చెప్పాను. తనతో నా స్నేహం పెంచమని అడిగాను. తను సందేహంతోనే ఒప్పుకుంది. ఆ తర్వాత చైత్రతో తనకి ఫోన్ చేపించి బయటకి రప్పించే వాడిని. ఇలా చాలా సార్లు జరిగింది తను కూడా నో అని చెప్పకుండా వచ్చేది. దానితో నాకు తనకి వున్న పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత చైత్ర లేకుండానే మేం బయటకి వెళ్ళడం మొదలుపెట్టాం. అలా మేము ప్రతి రోజు కళాశాల అయిపోగానే ఒక ప్రదేశానికి వెళ్లి కాసేపు మాట్లాడుకునే వాళ్ళం. అలా అలా మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. మేం ఇద్దరం మా ప్రేమ యాత్రలో ప్రయనించ సాగాం. ఇంతలోనే మా అన్నయ్యకి పెళ్లి కుదిరింది. పెళ్లికి మా ఫ్రెండ్స్ అందరినీ ఆహ్వానించాను. శ్రావ్యకు మాత్రం తన ఇంటికి వెళ్లి తన అమ్మ నాన్నలకి పెళ్లి కార్డ్ ఇచ్చి రమ్మని ఆహ్వానించాను. వాళ్లు అందుకు ఒప్పుకున్నారు. అలా తన ఇంట్లో కూడా నాకు పరిచయం ఏర్పడింది. అంతలోనే అన్నయ్య పెళ్లి రానే వచ్చింది. నేను అనుకున్నట్టుగానే శ్రావ్య పెళ్లికి వచ్చింది. అందుకు నేను ఎంతో సంతోషపడి మా అమ్మ నాన్నలకి తనని పరిచయం చేపించాను.

మా అన్నయ్య పెళ్లి పుణ్యమా అని తన ఇంట్లో నేను నా ఇంట్లో తనకి పరిచయాలు పెరిగాయి.. కానీ అంతలోనే ఒక సంఘటన జరిగింది. అప్పుడే పూస్తున్న పువ్వుని ఎవరో తెంపి నలిపేసినట్లు... చిగురిస్తున్న నా ప్రేమకి సమాధి కట్టేశారు. అన్నయ్య పెళ్లి సందడిలో పడి నేను కళాశాలకి నెల రోజులు వెళ్ళలేదు. ఆ సమయంలోనే శ్రావ్య వాళ్ల బావ యూఎస్‌ నుంచి వచ్చాడు. వాళ్ళ బావ వచ్చి రాగానే శ్రావ్యకు తనని ప్రేమిస్తున్నా అని, పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్లని తనని ఒప్పించాడు. తను కూడా ఒప్పుకుంది. ఆ నెల రోజులు వాళ్లు ఎంతో సంతోషంగా గడిపారు. అన్నయ్య పెళ్లి తర్వాత కొన్ని రోజులకి నేను కళాశాల వెళ్లాను. అప్పుడు శ్రావ్య నాతో సరిగ్గా ఉండకపోవడం గమనించాను. ఎందుకో తెలుసుకోవడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. ఇక ఉండలేక ఒక రోజు శ్రావ్యతో నా ప్రేమ విషయం చెప్పేయాలి అని కళాశాల అయిపోగానే మేము ఎప్పుడు కలుసుకునే ప్రదేశంకి వెళ్ళాను. తను కూడా అక్కడే ఉంది.. కానీ, ఈ సారి తను ఒక్కతే లేదు తనతో వాళ్ల బావ కూడా ఉన్నాడు. తను తన బావతో ఎంతో చనువుగా వుంది అలా వుండటం చూసి నేను తట్టుకోలేక పోయా. 

వెళ్లి వెంటనే తనని ఏంటి ఇదంతా అని అడగాలి అనిపించింది. కానీ, అడగలేకపోయా! తనని మొదట చూడగానే ఎలా ఒక నిమిషం పాటు ఉండి పోయానో ఇప్పుడు ఒక నిమిషం పాటు అలానే ఉండిపోయా. అప్పుడు అలా ఉండడానికి కారణం ప్రేమ అయితే ఇప్పుడు ఇలా ఉండడానికి కారణాన్ని ఏమి  అనుకోవాలో తెలియలేదు. తరవాత అసలు అతను ఎవరో తెలుసుకుందాం అని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి అడిగాను వాళ్ళు నాకు జరిగిందంతా చెప్పారు తను వాళ్ల బావ ఆస్తి చూసి ఇష్టపడింది. అందుకే వాళ్ల బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని తెల్సింది. ఇక నాకు ఏం చెయ్యాలో అర్థం కాక తన దగ్గరికి వెళ్లి అడిగాను ‘నువ్వు చేస్తుంది అంతా తప్పు! ఒకర్ని ప్రేమించి ఇంకొకరితో పెళ్లికి ఒప్పుకోవడం కరెక్ట్ కాదు ’ అని నచ్చ చెప్పాను. అయినా తను వినలేదు ‘‘నువ్వే నా స్నేహాన్ని ప్రేమ అని తప్పుగా అర్థం చేసుకుని ఇప్పుడు నన్ను తప్పు అని అంటున్నావ్’’  అంది. అయినా నేను నా ప్రేమని తనకి అర్థం అయ్యేలా చెప్తూ వచ్చా. తను నా మాటలేవి వినకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఏమీ చెయ్యలేక ఇక నాలో నేను బాధ పడతూ అక్కడే ఉండిపోయా. ఇంతలో నన్ను వెతుక్కుంటూ చైత్ర వచ్చింది.

తనకి నా బాధ అంతా చెప్పుకుంటూ ఏడిచా.. తను నన్ను ఓదార్చి ఇంటికి తీసుకెళ్ళింది. అలా కొన్ని రోజులు నేను బాధ పడ్తూనే ఉన్నా. అలాంటి సమయంలో నాకు చైత్ర తోడుగా ఉండి.. నన్ను ఆ బాధ నుండి బయట పడేలా చేసి, మాములు మనిషిగా మార్చింది. తను నాపై చూపించే ఆ ప్రేమ జాగ్రతలు అన్నీ నాకు మెల్ల మెల్లగా శ్రావ్యను మర్చిపోయేలా చేశాయి. అలా కొన్ని రోజులు చైత్రతోనే ఉన్నా! కొన్ని రోజులకి ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. కానీ తనకు ఇష్టం లేదు. తను ఒక రోజు నాకు ఫోన్ చేసి కలుద్దాం అని ఒక ప్లేస్‌కి రమ్మంది. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక చైత్ర ఏడుస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అది విని నేను నేను దిగ్బ్రాంతున్ని అయ్యా. నేను నిన్ను గత 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నా. నువ్వు శ్రావ్యను ప్రేమిస్తున్నావని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చాను. అయినా కానీ నా ప్రేమ నీతో చెప్పలేదు నువ్వు శ్రావ్యతో సంతోషంగా ఉండడం చూసి నీ సంతోషం కన్నా నాకు ఏదీ ఎక్కువ కాదు అని నేను వెళ్ళిపోయా.

నిన్ను ప్రాణంలా ప్రేమించా కాబట్టే నీ కోసం ఏడవడం కూడా సంతోషం అని నీ నుండి దూరంగా వెళ్ళిపోయా. మళ్లీ శ్రావ్య నిన్ను మోసం చేసిందని తెలిసి, ప్రేమించిన వాళ్లు దూరం అయితే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆ బాధ నీకు ఉండకూడదు అని నీ దగ్గరికి వచ్చి నీ బాధని పంచుకున్నా. నీ బాధలో నీకు తోడుగా వున్నా. నిన్ను మళ్లీ మాములు మనిషిని చేశాను. అప్పుడే నా ప్రేమ విషయం నీకు చెప్పి పెళ్లి చేసుకుందాం అని అడగాలి అనుకున్నా! కానీ, తను వదిలేసింది కదా అన్న జాలితో మాట్లాడుతున్నాననుకుంటావని, నీకు చెప్పలేదు. కానీ అప్పటికి అయినా నా ప్రేమను చేతల్లో చూపించా నీకు అర్థం అవుతుంది అనుకున్నా! కానీ, కాలేదు. ఇప్పుడు ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు.

నేను నిన్ను తప్ప వేరే వ్యక్తిని భర్తగా ఉహించుకోలేను. అందుకే నా ప్రేమని ఇప్పటికి అయినా చెప్దాం అని చెప్పా’’  అని అంది. నేను చాలా ఆలోచించా నాకు అప్పుడే నేను చేసిన తప్పు తెలిసి వచ్చింది. ప్రేమ అంటూ నేను శ్రావ్య వెంట తిరిగాను కానీ, నాతో ఉన్న చైత్ర  ప్రేమని గుర్తించలేకపోయా. అప్పుడే నేను నా తప్పు తెలుసుకుని చైత్ర దగ్గరికి వెళ్లి ‘పెళ్లి చేసుకుందాం’ అని అడిగా తను ఎంతో సంతోషించింది.  ఇలా నా జీవిత ప్రయాణంలో ఒక అమ్మాయితో మొదలయిన ప్రేమ ఇంకో అమ్మాయితో పెళ్లి వరకు తీసుకోచ్చింది. నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేసింది. నా ఈ ప్రేమ కథ నాకు నేర్పింది ఏంటంటే "మనం వెతుక్కుంటూ వెళ్లేది కాదు నిజమైన ప్రేమ అంటే.. మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమని గుర్తించడంలోనే మన ప్రతిభ దాగి ఉంది" అని. ప్రేమ అంటే చేతల్లో చూపించాలి, చేయి జారిపోతుందన్నపుడు మాటల్లో చెప్పాలి.
- అర్జున్‌ (పేర్లు మార్చాం)


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top