రాజీనామా ఈజీ కాదు

employer should pay the offense fee

ఉద్యోగం వదిలేవారు అపరాధ రుసుం చెల్లించాల్సిందే

పోలీసుశాఖలో త్వరలో కొత్త నిబంధనలు

సాధారణంగా కొన్ని ప్రైవేటు సంస్థలు ఉద్యోగులను నియమించుకునే ముందు బాండ్‌ పేపరు పై కనీసం ఇన్ని సంవత్సరాలు ఇదే సంస్థలోనే పనిచేస్తామని రాయించుకుంటాయి. చేరిన త్వరలోనే ఉద్యోగం వదిలిపోతే, ఒప్పందంలో పేర్కొన్న మేరకు కొంత డబ్బును కంపెనీకి చెల్లించాలని స్పష్టం చేస్తాయి. ప్రైవేటు రంగంలో ఇటువంటివి సాధారణమైనా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇటు వంటి నిబంధనలను అమలు చేయబోతోంది. అది కూడా పోలీసు శాఖలో. అంతకంటే మంచి ఉద్యోగం వస్తే ఇట్టే వెళ్లిపోతుండడమే దీనికి కారణం.

సాక్షి, బెంగళూరు: పోలీసు శాఖలో నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ఓ అభ్యర్థి అన్ని ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసుకుని శిక్షణకు ఎన్నిక కావడానికి దాదాపు రెండేళ్లు పడుతుంది. ఇక శిక్షణ దాదాపు ఏడాది. అయితే సదరు ఉద్యోగంలో చేరిన మూడు నెలల్లోనే చాలా మంది ఖాకీ దుస్తులను వదిలేసి ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. ఎక్కువగా క్షేత్రస్థాయిలో ఈ బెడద ఉంది. కానిస్టేబుల్, సబ్‌–ఇన్‌స్పెక్టర్లలో చాలా మంది తమకు నచ్చిన మరో ఉద్యోగం దొరికితే రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు.

కష్టసాధ్యమైన ఉద్యోగమనే...
కర్ణాటకలో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి పీయూసీ, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు డిగ్రీ విద్యార్హతలు. అయితే కానిస్టేబుల్‌ ఉద్యోగానికే పీహెచ్‌డీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసి ఆ పోస్టుకు ఎంపికవుతున్నారు. ఈ ఉద్యోగులపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. నెలకు ఒక సెలవు కూడా దొరకడం గగనం. కనీసం వారాంతపు సెలవూ దొరకదు. జీతభత్యాలు కూడా మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ. పదోన్నతి ఎప్పుడోగానీ లభించదు. కానిస్టేబుల్‌గా చేరి  25 ఏళ్లు సర్వీసున్నవారు కూడా అదే పోస్టులో, లేదా రిటైర్మెంటుకు రెండుమూడు నెలలకు ముందు హెడ్‌కానిస్టేబుల్‌ అవుతారు. వీటితో ప్రతిభావంతులు విసిగిపోతున్నారు.

కానిస్టేబుల్‌కు రూ. లక్ష ఎస్‌ఐలకు రూ. 2 లక్షలు
దీంతో సమస్య పరిస్కారం కోసం పోలీసు శాఖ అపరాధ రుసుం వసూలు విధానాన్ని చేపట్టబోతోంది. ఇక పై కానిస్టేబుల్‌ ఐదేళ్లలోపు రాజీనామా చేయదలిస్తే రూ.1 లక్షను అపరాధ రుసుంగా చెల్లించాలి. ఎస్‌.ఐ విషయంలో ఇది రూ.2 లక్షలు. అలా స్టాంప్‌ పేపర్‌ పై లిఖిత పూర్వకంగా శిక్షణకు ముందు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇప్పటికే ముసాయిదా నోటీఫికేషన్‌ విడుదల చేసిన పోలీసుశాఖ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ విషయమై ఈ నెల 6 లేదా 10వ తేదీన ఉన్నతాధికారుల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై ఉద్యోగులు న్యాయస్థానానికి వెళితే పోలీసుశాఖకు ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు.

సమస్య పరిష్కారం కోసమే: ఏడీజీపీ
ఏడీజీపీ (అడ్మినిస్ట్రేషన్‌) కమల్‌పంత్‌ మాట్లాడుతూ... ‘అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి అతను శిక్షణ పూర్తి చేసేంత వరకూ అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఇది ప్రస్తుతం మూడు లక్షల రుపాయలను దాటుతోంది. అయితే మరో ఉద్యోగం వచ్చిందని చెప్పి అభ్యర్థులు వెళ్లిపోతున్నారు. సమస్య పరిష్కారం కోసమే ‘అపరాధరుసుం’ నిర్ణయం తీసుకొన్నాం.’ అని వివరించారు. 

ఇదీ సంగతి
►రాష్ట్రంలో ఏటా కానిస్టేబుల్స్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసే వారు సివిల్‌ విభాగంలో 5 శాతం, రిజర్వ్‌ విభాగంలో ఇది 45 శాతం, మిగిలిన విభాగాల్లో ఇది 15 శాతంగా ఉంది.
►ఎస్‌ఐల విషయంలో అన్ని విభాగాల్లో కలిపి ఇది 15 శాతంగా ఉంది. ఈ పరిస్థితి వల్ల పోలీసుశాఖ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top