ప్రాయంలోనే గుండెకు ఎసరు

30-year-old youth in Metro City are heart attacks

మెట్రో సిటీలో 30 ఏళ్ల యువతకే హృద్రోగాలు

కాటేస్తున్న ఒత్తిడి, జంక్‌ఫుడ్‌

ఒక సర్వేలో ప్రమాద ఘంటికలు

మారుతున్న జీవన విధానం, ఉరుకుల పరుగుల జీవితం, కెరీర్‌లో ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి ఐటీ సిటీ వాసికి ‘గుండె’ ముప్పును పెంచుతున్నాయి. 30 ఏళ్ల యవ్వనంలోనే గుండెజబ్బుల బారినపడాల్సి వస్తోంది. బెంగళూరులోని 30 ఏళ్ల వయస్సు వారిలో 45 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు హృద్రోగాలకు గురవుతున్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నగరానికి చెందిన ఇండస్‌ హెల్త్‌ ప్లస్‌ సర్వేలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి.

సాక్షి, బెంగళూరు: ఐటీ, బీటీ నగరిగా ప్రఖ్యాతి గాంచిన బెంగళూరులో ఆ రంగాల్లో లక్షల సంఖ్యలో నిపుణులు, ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. ఈ రంగాల్లో ఉన్న వారికి టార్గెట్‌లను చేరుకోవడంతో పాటు రాత్రి సమయాల్లో పనివేళలు, ఈ కారణంగా వేళకు ఆహారం తీసుకోకపోవడం పాటు ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో సహజంగానే వీరికి అధిక రక్తపోటు, మధుమేహం తద్వారా గుండె వ్యాధులు సులభంగా వ్యాపిస్తున్నాయి. దీంతో ఐటీ, బీటీ రంగాల్లో పనిచేస్తున్న వారిలో 50 శాతం మంది (మహిళలు, పురుషులు కలిపి) గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. 35 నుంచి 45ఏళ్ల వయస్సు వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ వయస్సు వారిలో 45 శాతం మంది పురుషులు, 42 శాతం మంది మహిళల్లో ఎక్కువగా ఊబకాయం సమస్య కనిపిస్తోంది. తద్వారా వారు కూడా గుండె జబ్బులకు లోనవుతున్నారు.

జంక్‌ఫుడ్‌.. ఊబకాయం
గుండె జబ్బులు ఇంతలా పెరగడానికి కారణం వీరంతా ముందుగా ఊబకాయం బారిన పడుతుండడమే. అధిక కొవ్వుతో కూడిన పిజ్జాలు, మాంసాహారం, మిఠాయిలు వంటి ఆహారంతో పాటు ఎక్కువ మందిలో ఊబకాయం సమస్య కనిపిస్తోంది. జంక్‌ ఫుడ్‌లు తినడం, కారం, ఉప్పుతో పాటు నూనెలు ఎక్కువగా ఉన్న పదార్థాలు, ఇన్‌స్టంట్‌ ఆహార పదార్థాలతో ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఈ సమస్యే తర్వాత మధుమేహానికి, ఆ తర్వాత గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతోంది.

కాలుష్యం.. ఇతర దురలవాట్లూ కారణమే
అధిక కొవ్వు, చక్కెరలున్న తిండితోపాటు రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం, కెరీర్‌లో ఒత్తిళ్లు పెరుగుతుండడం, వ్యాయామం లోపించడం, ధూమపానం, మధ్యపానంతో పురుషుల్లో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు వస్తుంటే, మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ సమస్యలు, గర్భనిరోధక మాత్రల సేవనం, పెయిన్‌ కిల్లర్స్‌ అధిక వినియోగం గుండెకు ముప్పు తెస్తున్నాయి.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top