ఊపిరి తీసుకున్నారు..

5 members commit suicide in old karimnagar - Sakshi

ఉమ్మడి జిల్లాలో ఐదుగురి ఆత్మహత్య

కొడుకు జైలు పాలయ్యాడని తండ్రి..

ఒంటరితనం భరించలేక మహిళ..

అప్పుల బాధతో ఇద్దరు..

మతిస్థిమితం కోల్పోయి ఒకరు..

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వేర్వేరు చోట్ల శనివారం ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ కేసులో కొడుకు జైలు పాలయ్యా డని మనస్తాపంతో తండ్రి.. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి అప్పుల పాలై యువకుడు, ఆర్థిక ఇబ్బందులతో ఒకరు.. భర్త చనిపోవ డంతో ఒంటరితనం భరించలేక మహిళ, మతిస్థిమితం కోల్పోయి ఒకరు ఊపిరి తీసుకున్నారు. దీంతో పండుగపూట వారివారి ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి...

కొడుకు అరెస్ట్‌ తట్టుకోలేక తండ్రి..
సారంగాపూర్‌(జగిత్యాల): మండలంలోని నాగునూర్‌ గ్రామంలో కొడుకు ఓ కేసులో అరెస్టు అయ్యాడని మనస్తాపంతో జంగ గంగాధర్‌ (45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడి కేసులో గంగాధర్‌ రెండో కుమారుడు జంగ రాకేశ్‌ను రెండో నిందితుడిగా పేర్కొంటూ.. శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో గంగాధర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చేతికందొచ్చిన కొడుకు తప్పుడుదారిలో నడిచి జైలుపాలు కావడాన్ని తట్టుకోలేక పోయాడు. శుక్రవారం రాత్రి ఇంటి పక్కనే ఉన్న తన తమ్ముడి పశువుల పాకలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.     ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

అప్పుల బాధతో యువకుడు..
పెగడపల్లి(గొల్లపల్లి): గొల్లపల్లి మండలంలోని అగ్గిమల్ల గ్రామానికి చెందిన మారం రవి(30) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శంకర్‌ నాయక్‌ వివరాల ప్రకారం.. రవి జీవనో పాధి నిమిత్తం రెండుసార్లు గల్ఫ్‌ వెళ్లాడు. అక్కడి కంపెనీల్లో సరైన పని లభించక పోవడంతో తిరిగొచ్చాడు. గల్ఫ్‌వెళ్లేందుకు రూ. 4లక్షల వరకు అప్పు  చేశాడు. అక్కడ పని లేకపోవడం, అప్పులు ఎక్కువ కాడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం వేకువజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవికి భార్య, తల్లిదండ్రులున్నారు. తండ్రి రాయమల్లు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒంటరితనంతో మహిళ..
వేములవాడరూరల్‌: వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన సుధాల రామవ్వ(48) శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రామవ్వ భర్త ఎల్లయ్య పది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయి ఒంటరిగా నివసిస్తోంది. శుక్రవారం రాత్రి 11గంటలకు ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం తన కూతురు వచ్చి చూసేసరికి మృతి చెంది ఉంది. ఎస్సై రాజశేఖర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మతిస్థిమితం కోల్పోయి ఒకరు..
పెగడపల్లి(ధర్మపురి): మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన ముంజ కృష్ణమోహన్‌(28) శనివారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణమోహన్‌ కొంతకాలంగా మతిస్థిమితం కోల్పో యాడు. గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు కాపాడారు. శనివారం ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి వెనుకాల ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  

ఆర్థిక ఇబ్బందులతో రైతు...
చందుర్తి(వేములవాడ): రుద్రంగి మండలం మానాల గ్రామ శివారులోని  దేగావత్‌ తండాకు చెందిన దెగావత్‌ బన్సిలాల్‌ (50) శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మానాల గ్రామానికి చెందిన బన్సిలాల్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో అప్పు చేసి ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. ట్రాక్టర్‌ నడవక అప్పులు పెరిగి పోయాయి. దీంతో తన పెద్దకుమారుడిని దుబాయ్‌ పంపాడు. అక్కడ పని లేక రూపాయి కూడా పంపలేదని చుట్టుపక్కలవారు అంటున్నారు. శనివారం సాయంత్రం బన్సిలాల్‌ భార్య ప్రమీల వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. అదే సమయంలో బన్సిలాల్‌ తమ్ముడి కుమార్‌ భూపతి నాయక్‌ ఇంటికి వచ్చి చూడగా బన్సిలాల్‌ నోట్లో నుంచి నురుగులు వస్తున్నాయి. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

Back to Top