కాంగ్రెస్‌తో బాబు ఆజన్మ బంధం

KSR Interview With Actress And BJP Leader Kavitha - Sakshi

కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కవిత.. మనసులలో మాట

కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు విషయంలో కొత్తదనం ఏమీ లేదని, నూటికి నూరుపాళ్లూ ఆయన కాంగ్రెస్‌ మనిషేనని ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కవిత అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటినుంచి ఈరోజు దాకా అంచెలంచెలుగా చంద్రబాబు కాంగ్రెస్‌తోనే ఉన్నారనీ, తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీరామారావును సర్వనాశనం చేసి టీడీపీని హైజాక్‌ చేసిన చంద్రబాబు అక్షరాలా కాంగ్రెస్‌ సంస్కృతితోనే కొనసాగుతున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్‌ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ ఐటమ్‌లాగా వాడుకుంటున్న బాబు తాజాగా తన సొంత కోడల్ని కూడా పనిముట్టుగా వాడుకుని ఆమెను అభాసుపాలు చేశారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు జనం నుంచి వస్తున్న ఆదరణ టీడీపీలో కార్యకర్తనుంచి చంద్రబాబుదాకా భీతిని కలిగిస్తోందంటున్న కవిత అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...

మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారా?
లేదండి. కాంగ్రెస్‌లో చేరబోతున్న కవిత అనే వార్త టీవీలో స్క్రోల్‌ అయింది. నేను ఆ సమయంలో అరకులో షూటిం గులో ఉన్నాను. రెండు రోజుల తర్వాత సిగ్నల్‌ ఉన్న ప్రాంతానికి వస్తే ఫోన్‌ వచ్చింది. ఎన్టీరామారావు అంతటి ప్రముఖ నటుడు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే మీరు కాంగ్రెస్‌లో చేరడం ఏమిటి అంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. అదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి రుద్రరాజు కూడా ఫోన్‌ చేసి మీరు, జయసుధ తప్పకుండా పార్టీలో చేరాలమ్మా అని చెప్పారు. ఏం జరుగుతోందో నాకు తెలీదు. అయోమయంలో ఉన్నాను. కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పాను. తర్వాత టీడీపీ నేతలు నేరుగా ఇంటికే వచ్చి ఒత్తిడి చేశారు. తర్వాత చంద్రబాబును కలిసినప్పుడు టీడీపీలో చేరి పెద్ద ప్లాట్‌ఫామ్‌ నుంచి ప్రజలకు సేవ చేయండి అన్నారాయన. అయితే వైజాగ్‌ సౌత్‌ సీటు నుంచి పోటీ చేయమని ముందు చెప్పి మరీ మోసం చేశారు. ప్రచార ఏర్పాట్లకు రూ. 40 లక్షలు ఖర్చుపెట్టాక నాకు దక్కిన ఫలితం అది. ఒకటి మాత్రం నిజం. బాబు ఈజ్‌ ఎ స్వీట్‌ టాకర్‌. అంటే తియ్యగా మాట్లాడతారు. కానీ పని విషయంలో మాటల వ్యక్తే కానీ చేతల వ్యక్తి కాదు. 

వైఎస్సార్, బాబుపై మీ అభిప్రాయం?
నక్కకూ నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. నమ్మినవారిని నట్టేట ముంచవద్దన్నది వైఎస్సార్‌ స్లోగన్‌ కాగా చంద్రబాబు స్లోగన్‌ కట్‌ త్రోట్‌ పర్సన్‌. నిలువునా గొంతుకోసేసే మనస్తత్వం బాబుది. నమ్మినవాళ్లకు ఆయన చేసేంత ద్రోహం మరెవ్వరూ చేయరు. మనుషులను వాడుకుని తర్వాత వదిలేయడంలో నంబర్‌వన్‌ ఉదాహరణ బాబు. 

కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన టీడీపీకి మళ్లీ అదే కాంగ్రెస్‌తో పొత్తా?
నికృష్ట రాజకీయం అంటే ఇదే. 1983లో కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఒక విజన్‌ పెట్టుకున్నారు. ఆరోజు నుంచి ఈరోజు దాకా అంచెలంచెలుగా చంద్రబాబు కాంగ్రెస్‌తోనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చీ, ఎన్టీఆర్‌ టీడీపీని సర్వనాశనం చేసీ, చేస్తూనే బతుకుతున్న చరిత్ర బాబుది. ఎన్టీరామారావు టీడీపీ అధినేతగా ఉంటే, కొనసాగితే తెలుగుదేశం పార్టీయే సర్వనాశనం అవుతుంది. అలాంటి లీడరే మాకు వద్దు అని చెప్పి వేరుకుంపటి పెట్టుకున్న వారు మళ్లీ ఆ ఎన్టీఆర్‌ ఫొటోనే పెట్టుకుని బతుకీడుస్తున్నారు. 

రాహుల్‌తో భేటీకీ బాబు కోడలు వెళ్లడంపై మీ అభిప్రాయం?
తెలుగుదేశం గూట్లో ఒక పక్షి కూర్చున్నా అది కలుషితం అవుతుంది. ఆ అమ్మాయి రాహుల్‌ని కలిసినప్పుడు ఆమెపై ఎంత వ్యతిరేకత ఏర్పడింది? ఎంతమంది ఆమెను దూషించి ఉంటారు? ఆ అమ్మాయికి టీడీపీతో ఏ సంబంధమూ లేకున్నా ఆమెను చర్చనీయాంశంగా చేసేశారు కదా. ఇలా ఎన్టీఆర్‌ ఫ్యామిలీకి చెందినని ఎంతమందిని బలి చేస్తారో చెప్పండి. రామారావు కుటుంబంలో ఎంతమంది చంద్రబాబు అధికార దాహానికి బలైపోవాలి. ఎన్టీఆర్‌ కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాబు ప్రచారానికి కావాలి. బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంకా ప్రతి ఒక్కరూ బాబు కుర్చీలో కూర్చోవడానికి ఉపయోగపడాలి. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ బాబుకు ఐటమ్‌లాగా కావాలి. చివరకు సొంత కోడలు కూడా బాబు రాజకీయ క్రీడలో పని ముట్టు మాత్రమే. ఎన్టీఆర్‌ కుటుంబంలో ఎవరినీ బాబు వదలడు అనేందుకు బ్రాహ్మణి కూడా ఉదాహరణ.

విపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రపై మీ అభిప్రాయం?
నిరంతరం జనంలో తిరుగుతున్నారు. జనం సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలను పాలించాలి, వారికి మేలు చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవలసిందే. జగన్‌ జనాల్లో తిరుగుతున్నారు, విపరీతంగా జనం ఆయన్ని ఆదరిస్తున్నారు అనే భయం టీడీపీలో ప్రతి ఒక్కరిలో ఉంది. అధినేత చంద్రబాబులో ఇంకా ఎక్కువ ఉంది. పైనుంచి కింది వరకు టీడీపీ శ్రేణుల్లో భీతి కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

అంటే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారంటారా?
ఓడిపోవడం కాదండి, అసలు ఏపీలోనే ఉండరాయన. ఇంకో ఊరు చూసుకోవలిసిందే. మీడియా ఉంది కదా అని రోజంతా ఎంత గొంతు చించుకుని ఆయన శోష పెట్టినా జనం ఎవ్వరు కూడా బాబును నమ్మే  పరిస్థితి లేదు. ఏపీ ప్రజలు బాబు చేసిన తప్పిదాలన్నింటినీ చూస్తున్నారు. యువత అయితే విసిగి వేసారిపోతోంది. తన చేతకానితనాన్ని బాబు ప్రధాని మోదీపైకి నెట్టేస్తున్నారు. దానికి తోడు బెదిరింపులు ఒకటి. నా ఫించన్‌ తింటున్నావు, నా రోడ్లమీద నడుస్తున్నావు అంటూ పిచ్చిపిచ్చిగా వాగితే ఏపీ జనం రాళ్లతో కొట్టడం ఖాయం. ఓటెయ్యకపోతే నీకు ఫించను కట్‌ చేస్తా, నేను కట్టిన రోడ్లపై తిరగనివ్వను అని ఒక సీఎం బెదిరించడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇంత పచ్చి బ్లాక్‌ మెయిలింగ్‌కు ఒక రాష్ట్ర సీయం పాల్పడవచ్చా? జనం చూస్తూనే ఉన్నారు. 

బాబు ఎందుకలా అయ్యారంటారు?
అభద్రతాభావం. నేను అయిపోయాను. నా పని ఇక అయిపోయింది అనే ఎరుక, భీతి కలిగేటప్పటికీ వాళ్లు ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ఏం చేస్తున్నారో తెలీదు. ఏపీ ప్రజలు తెలుసుకోవలిసిన విషయం ఒక్కటే. చంద్రబాబు మైక్‌ పట్టుకుని మాట్లాడే మాటలన్నీ శుద్ధ అబద్ధాలు. బాబు వందమాటలు మాట్లాడారంటే 99.9 శాతం అబద్ధాలే. ప్రజలను పక్కతోవ పట్టించడం, ప్రజల్ని మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సొంత పార్టీ శ్రేణులను కూడా గౌరవించని వ్యక్తి, కనిపించిన ప్రతి ఒక్కరినీ వాడుకుని వదిలేసే వ్యక్తి, ఎవరినయినా సరే అక్కర తీరగానే పక్కనపెట్టడం అలవాటు చేసుకున్న వ్యక్తి ప్రజలకు మేలు చేస్తాడంటే నమ్మొద్దు. రామారావును నిలువునా చంపేసిన వ్యక్తితో, రామారావు కుటుం బాన్ని విసిరిపారేసిన వ్యక్తి పార్టీలో నేను పనిచేశానా అనే బాధ ఇప్పుడు నన్ను దహించివేస్తోంది.

(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) 
https://bit.ly/2OaiJqH
https://bit.ly/2x3oKhr

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top