మా ఫార్ములా మాకుంది.. మెజారిటీ పెంచుకుంటాం!

Amit Shah Interview In Hyderabad With Sakshi

2014లోకన్నా ఎక్కువ సీట్లు, మెజారిటీ ఖాయం..

పేదల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కోపం ఉంది

సాక్షి ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా

కేంద్ర పథకాల ప్రయోజనం పొందే హక్కు తెలంగాణ ప్రజలకు లేదా?

పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో కూడా చేయనివ్వని చరిత్ర కాంగ్రెస్‌ది

కాంగ్రెస్, టీడీపీల పొత్తుతో ప్రజలు ఆశ్చర్యచకితులవుతున్నారు

సాక్షి, కంచర్ల యాదగిరిరెడ్డి/మేకల కల్యాణ్‌ చక్రవర్తి : ‘కేంద్రంలో మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం. 2014 ఎన్నికల్లోకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం. మెజారిటీ కూడా పెరుగుతుంది. ఇందుకు మా ఫార్ములా మాకుంది. గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని ప్రయత్నాలు మేం చేశాం. దేశంలోని 50 కోట్ల మంది ప్రజలు తలెత్తుకునేలా పాలించాం. నాలుగున్నరేళ్లలో 13 రాష్ట్రాల ప్రజల మద్దతు పొంది అధికారంలోకి వచ్చాం. మేమేం చేసినా పేదల కోసమే. అభివృద్ధే ప్రధాన నినాదంగా లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటాం. ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసంతోనే ప్రజల్లోకి వెళతాం. గెలిచి తీరుతాం’అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుంటు న్నామని, గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తా మని ఆయన చెప్పారు. ఒక్క రోజు తెలంగాణ పర్యటన కోసం శనివారం రాష్ట్రానికి వచ్చిన ఆయన శనివారం రాత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణ సమయంలో ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, పార్టీ వ్యూహాలు, ప్రచారాస్త్రాలు, తెలం గాణలో టీడీపీ, కాంగ్రెస్‌ల పొత్తు, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయా లను పంచుకున్నారు. తెలంగాణతోపాటు ఎన్నికలు జరిగే మూడు రాష్ట్రాల్లో తమ పరిస్థితి బాగానే ఉందని, మిజోరంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నిరాశా, నిస్పృహలు అలముకున్నాయన్నారు. పేదల్లో ఈ ప్రభు త్వంపై కోపం ఎక్కువగా కనిపిస్తోందని, మార్పు అని వార్యమనే భావనలో ప్రజానీకం ఉందని అమిత్‌ షా అభిప్రాయ పడ్డారు. ధనిక రాష్ట్ర మైన తెలంగాణలో జర గాల్సిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథ కాలు తెలంగాణ ప్రజలకు దక్కకుండా ఇక్కడి ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపిం చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ఎవరికి ప్రయోజనమో చెప్పాలని టీఆర్‌ఎస్‌ను డిమాండ్‌ చేశారు. రాజకీయ ఎజెండాతో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు.

ఇంటర్వ్యూ విశేషాలివీ...
సాక్షి: పాలమూరు సభ విజయవంతం అయినందుకు అభినందనలు. ఈ సభకు కారణమైన ముందస్తు ఎన్నికలపై మీ అభిప్రాయం ఏమిటి?
షా: ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం బీజేపీకి సమ్మతం కాదు. వాస్తవానికి రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరపాలనేది మా విధానం. తెలంగాణలో గతంలో అదే సంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని వేరు చేశారు. దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలి. రెండుసార్లు ఎన్నికలు జరగడం వల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏ ప్రయోజనం ఉందో చెప్పాలి. మీ రాజకీయ ఎజెండా కోసం మాపై ఇంతటి భారాన్ని మోపుతారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీన్ని ప్రజలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నారు. మా ప్రభుత్వం, మా ఇష్టం అనే రీతిలో టీఆర్‌ఎస్‌ వ్యవహరించింది. ఎలాంటి రాజ్యాంగబద్ధత లేకుండానే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని పరిమితులను దాటి హామీ ఇచ్చింది. దీన్ని తెలంగాణ ప్రజలు కూడా విశ్లేషించుకుంటున్నారు. 50 శాతంకన్నా రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. మరి ఎలా ఇవ్వాలనుకున్నారు. అలా ఇవ్వాలనుకుంటే ఎవరి రిజర్వేషన్లు తగ్గిస్తారో టీఆర్‌ఎస్‌ చెప్పాలి. ఎస్సీలవి తగ్గిస్తారా, ఎస్టీలు, బీసీల కోటాలో కోత పెడతారా? దీనిపై టీఆర్‌ఎస్‌ నుంచి స్పష్టత రావాలి.

సాక్షి: ఈ ఎన్నికల్లో మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి?
షా: మా వ్యూహాలు నేను బహిరంగంగా చెప్పలేను. కానీ ప్రజల్లోకి వెళ్లేందుకు మాకు చాలా సానుకూలతలున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత సాయం మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది. సమైక్యాంధ్రలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 13వ ఆర్థిక సంఘం కింద కేవలం రూ. 16,500 కోట్లను తెలంగాణకు ఇచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 1.15 లక్షల కోట్లు ఇచ్చింది. దీనికి అదనంగా అనేక ప్రాయోజిత పథకాల కింద మరో రూ. 1.15 లక్షల కోట్లిచ్చాం. అన్నీ కలిపి రూ. 2.30 లక్షల కోట్ల నిధులు తెలంగాణకు ఇచ్చాం. మెట్రో రైలు, ఇళ్ల నిర్మాణం కోసం నిధులిచ్చాం. రూ. 40 వేల కోట్లతో రహదారులు నిర్మించాం. యూరియా కార్ఖానాల కోసం రూ. 5 వేల కోట్లు ఇచ్చాం. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రానికి అన్ని నిధులివ్వడం చిన్న విషయమేమీ కాదు. ఇవేమీ మేం తెలంగాణకు ఉచితంగా ఇవ్వలేదు.

ఈ నిధులను తెలంగాణ ప్రజల హక్కుగానే భావించి మంజూరు చేశాం. ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమూ తెలంగాణ ప్రజలకు ఇన్ని నిధులివ్వలేదు. దీన్ని మోదీనే ప్రారంభించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఈ రాష్ట్రంలో నిలిపివేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ అనే పథకం కింద ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని తెలంగాణలో అమలు చేయలేదు. అంటే ఆ పథకాన్ని ఉపయోగించుకునే హక్కు ఇక్కడి ప్రజలకు లేదా? రోగాల బారి నుంచి విముక్తి పొందే స్వేచ్ఛ కూడా లేదా? ఈ ప్రశ్న తెలంగాణ ప్రజల నుంచి తప్పక వస్తుంది. నేను తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇంకో విషయం చెబుతుంటాను. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరపరు? ఇందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఒత్తిడి కారణం కాదా? ఇలా విభజించి పాలించే టీఆర్‌ఎస్‌ విధానాలే ఈ ఎన్నికల్లో మాకు ప్రధానాంశాలు కాబోతున్నాయి.

సాక్షి: టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి జరిగిందని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే కేంద్ర మంత్రులు మాత్రం ఇక్కడి ప్రభుత్వ పనితీరును మెచ్చుకుని వెళ్లిన సందర్భాలున్నాయి. దీన్నెలా సమర్థిస్తారు?
షా: ఇందులో సమర్థించుకునేది ఏముంటుంది? రాజకీయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లావాదేవీల్లో శత్రుత్వం ఉండకూడదు. ఆ పద్ధతి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు సమాఖ్య వ్యవస్థ బలోపేతమై ఉంది. రాష్ట్రాల్లో అధికారంలో ఏ ప్రభుత్వమున్నా కేంద్ర మంత్రులు రాజకీయాలు చేసేందుకు రాష్ట్రాలకు రారు. ప్రజల్లో విశ్వాసం పొందేందుకు మాత్రం ప్రయత్నిస్తారు. నేను ముందుగా చెప్పినట్లు తెలంగాణ ప్రజలకు మేం చాలా చేశాం. ఈ విషయాలనే ప్రజల్లోకి తీసుకెళ్తాం.

సాక్షి: ప్రధాని మోదీపై ఏపీ సీఎం అనేక విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
షా: ఎన్నికల కౌంటింగ్‌ వరకు ఆగండి. వాళ్లేం చేశారో ప్రజలే తీర్పు చెప్తారు. ఆంధ్ర ప్రజలు ఎవరిని విశ్వసిస్తారో మీకే అర్థమవుతుంది.

సాక్షి: ఆ నాలుగు రాష్ట్రాల్లో మీ పరిస్థితి ఏమిటి?
షా: మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మా పరిస్థితి చాలా బాగుంది. మిజోరంలో సంకీర్ణ ప్రభు త్వం మళ్లీ ఏర్పడుతుందన్న విశ్వాసం నాకుంది.

సాక్షి: కేంద్రంలో ఇప్పుడు ఉన్న సీట్లను మళ్లీ దక్కించుకోగలుగుతారా?
షా: కచ్చితంగా... ఇప్పటికన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీకన్నా ఎక్కువ సీట్లు మేం గెలవబోతున్నాం. ఇందుకోసం మా ఫార్ములా మాకుంది. మేం గెలిచి తీరుతాం.

సాక్షి: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సా, ప్రాంతీయ పార్టీలా?
షా: దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీని ఎదుర్కోవాల్సి ఉంది. కానీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. ఒక పార్టీ పేరు చెప్పడం ఇప్పుడు అనుచితం.

సాక్షి: ఎన్నికలను ఎదుర్కొనేందుకు
మీ ప్రధానాస్త్రం ఏమిటి?
షా: అభివృద్ధే మా ప్రధాన నినాదం. గత నాలుగున్నరేళ్ల పాలనలో దేశంలోని 50 కోట్ల మంది ప్రజలు తలెత్తుకునేలా మేం పాలించాం. 5 కోట్ల మందికిపైగా మహిళలకు గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చాం. 7.5 కోట్ల మందికి టాయిలెట్స్‌ నిర్మించాం. 18 కోట్ల మంది మహిళలు, చిన్నారులకు టీకాలు వేయించాం. 2 కోట్ల ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాం. 2 కోట్ల ఇళ్లు కట్టించాం. 17 వేలకుపైగా గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాం. కోట్లాది మంది యువతకు ముద్ర బ్యాంకు ద్వారా రుణాలిప్పించాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా దేశ గౌరవం పెరిగేలా వ్యవహరించాం. ఈ విషయాలన్నీ క్షేత్రస్థాయికి వెళ్లాయి. ప్రజలందరికీ అన్నీ తెలుసు. అందుకే 2014 నుంచి ఇప్పటివరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా మాకు రివర్స్‌ గ్రాఫ్‌ లేదు. ఆరు రాష్ట్రాల నుంచి 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం. నాలుగేళ్లలో 13 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం చిన్న విషయమా? ఇది ప్రజలు మాకిచ్చిన గుర్తింపు.

సాక్షి: వచ్చే ఎన్నికల తర్వాత కూడా మీరు పార్టీ అధ్యక్షునిగానే కొనసాగుతారా లేక కేంద్ర కేబినెట్‌లో చేరే ఆలోచన ఉందా?
షా: అది పార్టీ నిర్ణయం. పార్టీ ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తా. ఇప్పుడు మా దృష్టంతా లోక్‌సభ ఎన్నికలపైనే.

సాక్షి: రానున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపును ఏ ప్రాతిపదికన చేస్తారు?
షా: మాకో వ్యవస్థ ఉంది. క్షేత్రస్థాయి నుంచి మాకు ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది. ఆ ప్రకారమే రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకుని టికెట్లిచ్చే సంప్రదాయం మాది. ఆ రీతిలోనే ముందుకెళ్తాం.

సాక్షి: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు ఎన్డీయే ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనుకుంటున్నారు?
షా: ఇది తాత్కాలికమే. అంతర్జాతీయ స్థాయి పరిస్థితులే ఇందుకు కారణం. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధంతో డాలర్‌ విలువ పెరిగింది. రూపాయి విలువ పడిపోయింది. దీనికితోడు క్రూడాయిల్‌ ధరలు కూడా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా సానుకూలంగా వ్యవహరిస్తోంది. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం.

సాక్షి: ఢిల్లీ నుంచి మాకు సరైన మద్దతు లభించడం లేదని తరచూ తెలంగాణ బీజేపీ నేతల విమర్శలపై మీ కామెంట్‌?
షా: నేనలా అనుకోను. తెలంగాణలో పార్టీతో మేం నిత్యం టచ్‌లో ఉంటున్నాం. ఇంతవరకు నా దగ్గరకు అలాంటి ఫిర్యాదు రాలేదు.

సాక్షి: బీజేపీ, టీఆర్‌ఎస్‌ మిత్రపక్షాలేననే వాదనపై ఏమంటారు?
షా: అది మీడియా సృష్టి మాత్రమే. ప్రజల్లో అలాంటి అభిప్రాయం లేదు.

సాక్షి: ముస్లింలకు దగ్గర కావడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
షా: మేం అలాంటి విధానాలను నమ్మం. 5 కోట్ల మంది మహిళలకు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తే అందులో ముస్లిం మహిళలు లేరా? మరుగుదొడ్లు, ఇళ్లు, కరెంటు లబ్ధిదారుల్లో ముస్లింలు లేరా? ఆ దిశలో మాకు ఇంకొంత కాలం పట్టొచ్చు. కానీ మేం సరైన మార్గంలోనే వెళ్తున్నాం.

సాక్షి: ఉత్తరప్రదేశ్‌లో మీ పరిస్థితి ఎలా ఉంది? రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు?
షా: యూపీలో మా కేడర్‌ క్షేత్రస్థాయి వరకు ఉంది. 81 లోక్‌సభ స్థానాల్లో బలంగా ఉన్నాం. 45–47 శాతం ఓటింగ్‌ ఉంది. మరో 4 శాతం పెరగాల్సి ఉంది. బూత్‌స్థాయిలో బలంగా ఉన్న మా కార్యకర్తలు అదే పనిలో ఉన్నారు.

సాక్షి: మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?
షా: దేశ ప్రజలందరి ఆశీస్సులు, భగవంతుని ఆశీర్వాదంతో నేను ఆరోగ్యంగా ఉన్నా. వారే నన్ను నడిపిస్తున్నారు.

సాక్షి: పోలవరం ప్రాజెక్టును మా డబ్బులతోనే కడుతున్నామని చంద్రబాబు అంటున్నారు. ఈ అంశంపై మీ స్పందన ఏమిటి?
షా: చంద్రబాబు మాయ మాటలతో ప్రజలను వంచించలేరు. మేం ఆంధ్రకు వెళ్లినప్పుడల్లా అసలు విషయాలు చెబుతున్నాం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. కానీ మాకన్నా మీడియా మద్దతు తెలుగుదేశం వాళ్లకే ఎక్కువ ఉంది కదా.! అందుకే మీకు అలా అనిపిస్తోంది.

సాక్షి: గుజరాత్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని జైల్లో పెట్టారు... ఎప్పుడైనా రాజకీయాలెందుకు.. ఈ జీవితాన్ని వదిలేద్దామా అనిపించిందా?
షా: కాంగ్రెస్‌ చేసేదే అది. అధికారంలో ఉన్నప్పుడల్లా అలానే వ్యవహరిస్తుంది. ఎమర్జెన్సీ నుంచి ఇప్పటివరకు జరిగింది అదే. ఇతరులు అధికారంలో ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టం ఉండదు. కాంగ్రెస్‌ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం.

సాక్షి: ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటేయాలో కారణాలు చెప్తారా?
షా: మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం మేం ఏం చేశామనేది గమనించాలి. మజ్లిస్‌ పంచన చేరి విభజించి పాలించే రీతిలో టీఆర్‌ఎస్‌ వ్యవహారశైలిపై ఇక్కడి ప్రజలు చాలా నిరాశతో ఉన్నారు. మేం పేదలనుపైకి తెచ్చేందుకు కృషి చేస్తుంటే తెలంగాణలో అణగదొక్కే ప్రయత్నం జరిగింది. ఈ ప్రభుత్వంపై పేదల్లో చాలా కోపం ఉంది. అందుకే మార్పు అనివార్యమనే భావనలో తెలంగాణ ప్రజానీకం ఉంది.

సాక్షి: 51 నెలల టీఆర్‌ఎస్‌ పాలనపై మీ అభిప్రాయం ఏమిటి?
షా: తెలంగాణలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇది ధనిక రాష్ట్రం. దేశంలో రెవెన్యూ లోటు లేని ఇలాంటి రాష్ట్రాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకో విషయం గమనించాలి. ఇది పుట్టుకతోనే ధనిక రాష్ట్రం. గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ల తరహాలో రెవెన్యూ లోటును అధిగమించిన ధనిక రాష్ట్రంగా మారిన పరిస్థితి కూడా ఇక్కడ లేదు. కానీ ఇక్కడ సాధించింది చాలా తక్కువ. ఈ రాష్ట్రంలో పూర్తయిన ఒక్క మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పేరు చెప్పగలరా? ఎందుకు పూర్తి కాలేదు? ఈ అంశాన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలు లేవనెత్తుతారు.

సాక్షి: తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని ఊహిస్తున్నారు?
షా: ఎన్నికలకు చాలా రోజుల సమయం ఉన్నందున అప్పుడే ఊహించడం సరైంది కాదు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మీరో విషయం గమనించాలి. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌కు విరుద్ధంగా. తెలుగు ఆత్మగౌరవం పేరుతో పెట్టిన పార్టీని కాంగ్రెస్‌తో కలిపేసిన చంద్రబాబు మార్కు మార్పును చూసి తెలుగు ప్రజలు ఆశ్చర్యచకితుల వుతున్నారు. టి. అంజయ్య నుంచి ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తెలుగు ప్రజలకు చేసిన అవమానాలను ప్రజలు అప్పుడే మర్చిపోతారా? దేశ ప్రధానులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి చనిపోయినప్పుడు ఎవరెలా వ్యవహరించారో చూడండి. ఆయనకేం జరిగిందో ఈయనకెలా జరిగిందో గమనించండి. పీవీ అంత్యక్రియలను ఢిల్లీలో కూడా చేయనివ్వలేదు. చావు తర్వాత కూడా ఆయన్ను అవమానించారు. అలాంటి చరిత్ర ఉన్న పార్టీతో చంద్రబాబు వెళ్తున్నారు.

సాక్షి: అమిత్‌ షా ఎక్కడికెళ్లినా మ్యాజిక్‌ చేసి పార్టీని గెలిపిస్తారనే పేరు మీకుంది. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఏం మ్యాజిక్‌ చేయబోతున్నారు?
షా: అది నా మ్యాజిక్‌ కాదు. ఎన్నికలను ఎదుర్కొనేది బీజేపీ కేడరే. పార్టీ అధ్యక్షునిగా ముందుండి ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేలా కేడర్‌ను నడిపించడం నా బాధ్యత. మోదీపై ప్రజలకు విశ్వాసం ఉంది. అందుకే ఎక్కడ ఎన్నికలు జరిగినా విజయం కట్టబెట్టారు. తెలంగాణలోనూ ఎన్నికలను మేం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. పోటీ చేసే ప్రతి చోటా గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తాం.

Read latest Interview News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top