కొరియాను రెచ్చగొట్టొద్దు

కొరియాను రెచ్చగొట్టొద్దు


ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఫోన్‌

వాషింగ్టన్‌/బీజింగ్‌: ఉత్తర కొరియాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, చర్యల్ని ఆపాలని.. లేదంటే కొరియా ద్వీపకల్పంలో పరిస్థితులు మరింత దిగజారుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ సూచించారు. అమెరికా అధీనంలోని గ్వామ్‌ ద్వీపంపై క్షిపణుల్ని ప్రయోగిస్తామని ఉత్తర కొరియా హెచ్చరికలు, ఏమాత్రం అనాలోచితంగా వ్యవహరించినా తీవ్ర పర్యవసానాలు తప్పవని అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.


కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతల్ని తగ్గించే లక్ష్యంతో అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్‌ చెప్పారని జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.   గ్వామ్‌పై బాలిస్టిక్‌ క్షిపణుల్ని ప్రయోగిస్తామన్న ఉత్తర కొరియా హెచ్చరికల నేపథ్యంలో జపాన్‌ క్షిపణి నిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసింది. షిమానే, హిరోషిమా, కొచిలో పేట్రియాట్‌ అడ్వాన్స్‌డ్‌ కేపబిలిటీ–3(పీఏసీ–3) క్షిపణుల్ని మోహరించింది.  ఎహిమేలో కూడా యాంటీ మిస్సైల్‌ వ్యవస్థను సర్వసన్నద్ధంగా ఉంచింది. 

Back to Top