పాక్‌కు అమెరికా తాజా వార్నింగ్‌

US Sends Another Warning To Islamabad - Sakshi

న్యూయార్క్‌ : తన భూభాగంలో పనిచేసే ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాలని, ఉగ్ర వ్యతిరేక పోరాటంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పాకిస్తాన్‌ను అమెరికా మరోసారి హెచ్చరించింది. తన భూభాగంలో కార్యకలాపాలు నిర్వహించే హక్కానీ నెట్‌వర్క్‌ వంటి ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా పాకిస్తాన్‌ను పదేపదే కోరుతోంది. అయితే తమ ప్రజలతో పాటు దేశానికి ఇబ్బందులు ఎదురవుతున్నా ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం సాగిస్తున్నామని పాక్‌ స్పష్టం చేస్తోంది. పాక్‌ తీరు నచ్చని అమెరికా తీవ్ర హెచ్చరికలతో విరుచుకుపడుతుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల సన్నగిల్లాయి.

ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతూ కఠిన చర్యలు చేపట్టాలని పాక్‌కు స్పష్టం చేశామని, పాక్‌ తక్షణమే తాలిబాన్లకు సహకారం అందించే చర్యలకు స్వస్తిపలుకుతుందని ఆశిస్తున్నామని అమెరికా విదేశాంగ డిప్యూటీ కార్యదర్శి ఎలిస్‌ జీ వెల్స్‌ పేర్కొన్నారు. కాగా, ఉగ్రవ్యతిరేక పోరు పేరిట అమెరికా గత 15 ఏళ్లలో 33 మిలియన్‌ డాలర్లను పాకిస్తాన్‌కు ఉదారంగా ఇచ్చిందని, ప్రతిగా వారు తమకు చేసిందేమీ లేదని, తమ నేతలను వెర్రివాళ్లను చేశారని ట్రంప్‌ గతంలో చేసిన ట్వీట్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top