ట్వీటర్‌లో నంబర్‌వన్‌ ట్రంప్‌

US President Donald Trump is the most followed world leader on Twitter - Sakshi

రెండోస్థానంలో పోప్‌

మూడోస్థానంలో ప్రధాని మోదీ

మహిళల్లో సుష్మకు తొలిస్థానం

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే ట్వీటర్‌లో అత్యధికులు అనుసరించే వ్యక్తిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిలిచారు. ట్వీటర్‌లో ట్రంప్‌ను 3,97,35,749 మంది అనుసరిస్తున్నట్లు ట్విప్లోమసీ సంస్థ తెలిపింది. క్రైస్తవ మతగురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ దాదాపు 3.95 కోట్ల మంది ఫాలోవర్లతో రెండోస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. ట్వీటర్‌లో మోదీ ఖాతాను 3.40 కోట్ల మంది అనుసరిస్తున్నట్లు తెలిపింది.

భారత ప్రధాని కార్యాలయం పీఎంవో ఇండియా 2.10 కోట్ల ఫాలోవర్లతో నాలుగోస్థానం దక్కించుకుంది. భారతీయులతో పాటు విదేశీయులు సైతం ఎలాంటి సాయం కోరినా ట్వీటర్‌లో వెంటనే స్పందించే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ మహిళల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచారు. ట్వీటర్‌లో సుష్మను 90.6 లక్షల మంది అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికార ట్వీటర్‌ ఖాతాలు @POTUand,  @WhiteHouse ఈ జాబితాలో ఐదు, ఆరు స్థానాలు దక్కించుకున్నట్లు తెలిపింది.

దీంతోపాటు టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిబ్‌ ఎర్డోగన్‌(7), సుష్మా స్వరాజ్‌(8), ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో(9), యూఏఈ ప్రధాని షేక్‌ మొహమ్మద్‌(10) తర్వాతి స్థానాల్లో నిలిచారు. అయితే ట్వీటర్‌లో అత్యధికులు అనుసరించిన ప్రపంచ నేతగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రికార్డు(దాదాపు 7.49 కోట్ల మంది) పదిలమని ట్విప్లోమసీ పేర్కొంది. ప్రస్తుతం పదవి నుంచి తప్పుకున్నప్పటికీ ఒబామాకు దాదాపు 9.50 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారని తెలిపింది.

అమెరికాకు చెందిన ప్రముఖ ప్రజా సంబంధాల సంస్థ బర్సన్‌ మార్‌స్టెల్లర్‌ పరిశోధనా విభాగమైన ట్విప్లోమసీ.. అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు ట్వీటర్‌ను ఏమేరకు వినియోగిస్తున్నాయో నివేదికలు రూపొందిస్తుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top