లోకం పాపం చూడలేక..

A story of an italy man morandi - Sakshi

ఈయన పేరు మొరాండి.. వయసు 79.. పుట్టింది.. పెరిగింది ఇటలీలో.. 29 ఏళ్ల క్రితం పడవ ఇంజిన్‌ చెడిపోయి.. లంగరు కాస్తా సముద్రపు అడుగుభాగంలో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో ఇటలీకి సమీపంలోని బుదెలీ ద్వీపానికి చేరాడు. ఏం చేయాలో తెలియలేదు. ఆ దీవిని చూసుకునేందుకు ఏర్పాటైన వ్యక్తి రెండు రోజుల్లో రిటైర్‌ అవుతున్నాడని తెలిసింది. అప్పటి వరకూ తనకు ఎదురైన అనుభవాలతో విసిగిపోయాడో ఏమో.. తన పడవను అతడికి అమ్మేశాడు.

ఒంటరిగా బతికేందుకు సిద్ధమైపోయాడు! ఆ చెట్లుపుట్టల మధ్య, పిట్టలు చేసే ధ్వనులు తప్ప మరే సవ్వడి వినిపించని ఆ దీవిలో బతికేస్తున్నాడు. పైపెచ్చు అదే తనకు స్వర్గం అని అంటున్నాడు. ‘ఈ భూమిపై పెత్తనం చెలాయించగల మహామహులం మేమే అని మనుషులు విర్రవీగుతూంటారు. కానీ మనం కేవలం(భూమితో పోలిస్తే) దోమలంత వారు మాత్రమే’ అంటాడు మొరాండి! ఒంటరిగా ఓ దీవిలో జీవితం గడుపుతున్న మొరాండీకి అక్కడా పోరాటం తప్పలేదు.

ఇలా ఒంటరిగా దీవిలో ఉండరాదని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. దీన్ని తీవ్రంగా నిరసించిన మొరాండీ చిన్న ఉద్యమమే నడిపాడు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఆ దీవిలో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, అరుదైన వాతావరణ పరిస్థితుల్ని ఫొటోలు తీయడం హాబీగా మార్చుకున్నాడు.. టెక్నాలజీ పెరిగి సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మొరాండీకున్న హాబీ అతనిని పాపులర్‌ చేసింది. ఆ దీవిలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన వైఫై సదుపాయం అతనికి ఒక వరంలా మారింది. అందరినీ కట్టిపడేసే ఆ ఫొటోల వల్ల అతనికి ఫేస్‌బుక్‌లో 5 వేల మంది ఫ్రెండ్స్‌ అయ్యారు. ఇప్పడు మొరాండీ ఒంటరిగా ఉన్నా సమూహంలో ఉన్నట్టే.. కాదంటారా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top