ఇద్దరూ ఇద్దరే!

Story about trump and Kim Jong Un  - Sakshi

తెంపరితనం, ఇంకొకరి మాట లెక్క చేయకపోవడం మొండివారి లక్షణాలు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఇద్దరూ అలాంటివారే.. ప్రపంచాన్నే శాసించగల అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నా ట్రంప్‌ వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే..

ఓ దేశాన్ని పూర్తిగా చేతిలో పెట్టుకుని ఏదనిపిస్తే అదే చేసే చిత్రమైన మనస్తత్వం కిమ్‌ది.. ఉత్తరకొరియా అణు ప్రయోగాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన నెలకొన్న సమయంలో.. చిత్రమైన మనస్తత్వం కలిగిన ఈ ఇద్దరు నేతలు ‘అణు’ చర్చలకు కూర్చోబోతున్నారు. సింగపూర్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6.30 గంటలకు భేటీ కానున్నారు. ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎందుకంటే వీరి చర్చల్లో తేలే అంశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలపై ప్రభావం చూపించగలవు మరి.

ఎవరి మాట వినడు.. ట్రంప్‌
ట్రంప్‌కు మహా మొండిఘటంగా పేరుంది. తన తండ్రి నుంచి వచ్చిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్నే పెట్టుబడిగా పెట్టి, తనకున్న ధనబలంతో ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల సమయంలో సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైతే.. పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతానని హెచ్చరించే వరకు వెళ్లారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ‘అమెరికా ఫస్ట్‌’ అంటూ ఆ దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని రెచ్చగొట్టాడు.

ఇతర దేశాల ప్రజల్ని దొంగలు, దోపిడీదారులుగా చిత్రీకరించడమే కాదు పొరుగున ఉన్న మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టేస్తాననీ ప్రకటించిన తెంపరితనం ఆయనది. నిబంధనలు, పద్ధతులు, ప్రొటోకాల్‌ వంటివి నచ్చవు. విమర్శలను, వ్యతిరేకతను తట్టుకోలేరు. అధ్యక్షుడు ఏం చేసినా తప్పు కాదని ట్రంప్‌ అంటుండటం... అధ్యక్షుడిగా తనను తాను క్షమించుకునే అధికారం ఉంటుందంటూ ట్వీట్‌ చేయడం ఆయన మనస్తత్వాన్ని పట్టి చూపుతాయి.

అంతేకాదు ట్రంప్‌కు మహిళలంటే చిన్నచూపు. ఆయన వెకిలిచేష్టలు, వెకిలిమాటలు, వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడికి ఉండే గౌరవాన్ని, హోదాను తగ్గించాయనే అభిప్రాయాలున్నాయి. తానే గొప్ప, తనకే తెలుసన్నట్టు అహంకారంగా వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి. ట్రంప్‌ మాట్లాడుతూంటే హెలికాప్టర్లు రొద చేసినట్టు ఉంటుందని బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

కిమ్‌ రూటే సెపరేటు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సంచలనానికే సంచలనం. 2011లో తండ్రి మరణించిన పదిహేను రోజుల్లోనే దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. మిలటరీ ఫస్ట్‌ అన్న నినాదంతో నియంతృత్వ పోకడలకు తెరతీశారు. అణు పరీక్షలు నిర్వహిస్తూ, అవి విజయవంతమైనప్పుడు కెమెరాల ముందు బిగ్గరగా నవ్వుతూ.. తనకే ఎదురూ లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. హైడ్రోజన్‌ బాంబును కూడా విజయవంతంగా పరీక్షించామని ప్రకటించి.. ప్రపంచ దేశాల గుండెల్లో బాంబు పేల్చారు.

ఎన్ని రకాల ఆర్థిక ఆంక్షలు విధించినా.. అమెరికా నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా బెదరని మొండితనం కిమ్‌ది. తనకు ఎవరైనా ఎదురు చెప్పినా, లేదా చెబుతారనే అనుమానం వచ్చినా ప్రాణాలు తీయడానికి వెనుకాడరు. రాజకీయంగా తనపై కుట్ర చేస్తున్నాడన్న అనుమానంతో 2013లో తన సొంత మేనమామ చాంగ్‌ సాంగ్‌ను ఉరితీయించారు. తన వ్యతిరేకులందరినీ నిర్దాక్షిణ్యంగా జైలు పాలు చేశారు.

ఉత్తర కొరియాలో లక్ష మందికిపైగా రాజకీయ ఖైదీలు ఉన్నారని ఒక అంచనా. ఇక మానవ హక్కుల ఉల్లంఘనలు సరేసరి. కిమ్‌ వ్యక్తిగత జీవితం కూడా అత్యంత గోప్యం. ఆయన రిసోల్‌ జుని వివాహం చేసుకున్నారని ఆ దేశ మీడియా బయటపెట్టే దాకా ఎవరికీ తెలీదు. అయితే ఆర్థిక ఆంక్షల తీవ్రత కారణంగానో, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలన్న భావనతోనో కిమ్‌ ఇటీవల కొంచెం దిగి వచ్చారు. అణు పరీక్ష కేంద్రాలను« మూసివేయడంతోపాటు భార్యతో కలసి దక్షిణ కొరియాలో పర్యటించారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితో భేటీ కాబోతున్నారు.

ఇంతకు ముందు మాటల తూటాలు
ఇప్పుడు ట్రంప్, కిమ్‌ భేటీ అవుతున్నారుగానీ.. ఇంతకుముందు వారిద్దరూ పెద్ద ఎత్తున మాటల తూటాలు పేల్చుకోవడం గమనార్హం. నా టేబుల్‌పై అణుబాంబులు ప్రయోగించే బటన్‌ ఉందని కిమ్‌ కవ్విస్తే.. నా దగ్గర ఉన్న బటన్‌ అంతకంటే పెద్దదంటూ ట్రంప్‌ దీటుగా బదులిచ్చారు.

కిమ్‌ ఏదో ఒక రోజు ఉత్తర కొరియాను నాశనం చేసేస్తాడని ట్రంప్‌ విమర్శిస్తే.. కిమ్‌ మరో అడుగు ముందుకు వేసి ట్రంప్‌ శారీరకంగా, మానసికంగా ముసలివాడు (డొటార్డ్‌ ) అంటూ వ్యక్తిగత దూషణలకు దిగారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. తాను ముసలివాడినైనా.. కిమ్‌ను పొట్టి, లావు అని ఎప్పుడూ అనలేదు కదా అంటూ పరోక్షంగా కిమ్‌ శరీరాకృతిపై విమర్శలు చేశారు.

సింగపూర్‌లోనే భేటీ ఎందుకు?
ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా ఈ భేటీ సింగపూర్‌లోనే జరగడానికి కొన్ని కారణాలున్నాయి. దౌత్య వ్యవహారాలు నడపడానికి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడానికి సింగపూర్‌ పెట్టింది పేరు. ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఆ దేశానికి ఉంది. ధనిక దేశం కావడంతో కళ్లు చెదిరే ఆతిథ్యం ఇవ్వగలదు. అటు ఉత్తర కొరియాతోనూ, ఇటు అమెరికాతోనూ సత్సంబంధాలు నెరుపుతున్న దేశం సింగపూర్‌. సింగపూర్‌ వాసులు, అక్కడి రాజకీయ నేతలు, దౌత్యాధికారుల పట్ల ప్రపంచ దేశాల్లో గౌరవం ఉంది.

ట్రంప్‌ ఆశిస్తున్నదేంటి?
 ఉత్తర కొరియా అణ్వస్త్రరహిత దేశంగా మారిపోవాలి.
♦  కొరియా భూభాగంలో అమెరికా పట్టు పెరగాలి.
♦  ఉభయ కొరియాలను చైనా నుంచి వేరు చేసే ఎల్లో సముద్రంపై కొంతవరకైనాఆధిపత్యం సాధించాలి.
♦  కొరియా సరిహద్దుల్లో 30 వేల మంది బలగాలను ఉంచుతున్న కారణంగా పెరిగిపోతున్న సైనిక వ్యయాన్ని తగ్గించుకోవడం.
 చైనా కార్యకలాపాలను ఓ కంట కనిపెట్టే వ్యూహం.

కిమ్‌ కోరుకుంటున్నదేంటి?
ప్రపంచ దేశాల్లో తన పరిపాలనకు ఒక గుర్తింపు.
ఉత్తర కొరియాకు అణు దేశం అన్న హోదా దక్కాలి.
ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలు తొలగిపోవాలి. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి.

నేపాలీ గూర్ఖాల భద్రత
ట్రంప్, కిమ్‌ల భేటీ సందర్భంగా ప్రపంచంలో అత్యంత పోరాట పటిమను ప్రదర్శించే గిరి జన తెగ నేపాలీ గూర్ఖాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో భద్రతా ఏర్పాట్ల కోసం సింగపూర్‌ పోలీసులు ఏరికోరి నేపాలీ గూర్ఖాలను తీసుకొని శిక్షణ ఇస్తుంటారు. వీరి చేతిలో ఎప్పుడూ అత్యాధునికమైన పెద్ద రైఫిల్స్, దుస్తుల్లో పిస్టల్స్‌ ఉంటాయి. సింగపూర్‌లో గతంలో ప్రధాని మోదీ, అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ వంటివారి పర్యటన సమయంలోనూ నేపాలీ గూర్ఖాలే భద్రత నిర్వహించడం గమనార్హం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top