భార్య కోసం 35 మైళ్లు కాలినడకన.. | Steven Simoff: Iowa man commutes 35 miles to work on foot | Sakshi
Sakshi News home page

భార్య కోసం 35 మైళ్లు కాలినడకన..

Mar 3 2015 2:03 PM | Updated on Sep 2 2017 10:14 PM

భార్య కోసం 35 మైళ్లు కాలినడకన..

భార్య కోసం 35 మైళ్లు కాలినడకన..

నేటి యాంత్రిక యుగంలో కిలోమీటరు దూరంలోని ఆఫీసుకు కాలి నడకన వెళ్లాలంటే అంత దూరం నడవాలా అబ్బా ? అంటూ ఒళ్లు విరిచేవారు, లిఫ్టు కోసం స్టైల్‌గా బొటనవేలు చూపేవారు మనమధ్య కోకొల్లలు.

డావిస్: నేటి యాంత్రిక యుగంలో కిలోమీటరు దూరంలోని ఆఫీసుకు కాలి నడకన వెళ్లాలంటే అంత దూరం నడవాలా అబ్బా ? అంటూ ఒళ్లు విరిచేవారు, లిఫ్టు కోసం స్టైల్‌గా బొటనవేలు చూపేవారు మనమధ్య కోకొల్లలు. అమెరికాలోని డావిస్ నగరంలో నివసిస్తున్న స్టీవెన్ సిమాఫ్ మాత్రం తాను పనిచేసే కాసినోకు  రోజూ 35 మైళ్లు కాలినడకన వెళ్లి వస్తాడని తెలిస్తే నమ్మబుద్ధి కాదు. నమ్మితే...వాడికి పిచ్చా, వెర్రా...! అంటూ ఎగతాలి చేస్తాం. అతనికి ఒకరకం పిచ్చే. భార్యంటే వల్లమాలిన పిచ్చి. అంతకుమించి బాధ్యత. తొమ్మిదేళ్ల క్రితం భార్య రెనీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంతకుముందు మూడు సార్లు గుండెపోటు వచ్చింది.

ఆమె వైద్యానికి మంచినీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చవుతోంది. ఉద్యోగం చేసే చోట ఇల్లు తీసుకోవాలంటే అద్దె ఆకాశాన్నంటుతుంది. అందుకే పనిచేసే చోటుకు 35 మైళ్ల దూరంలోవున్న ఈ డావిస్ నగరంలో ఉంటున్నాడు. అద్దె కేవలం 400 డాలర్లు మాత్రమే. అద్దె, ఇంటి ఖర్చులు పోనూ తాను సంపాదించే సొమ్ము ఆమె వైద్యానికి సరిపోతుందని సంతృప్తి పొందుతున్నాడు స్టీవెన్ సిమాఫ్. ఆయన ఐయోవాకు సమీపంలోని ఓసియోలాలోని ఓ కాసినోలో పనిచేస్తాడు. అక్కడ గంటకు దాదాపు 600 రూపాయలు ఇస్తారు. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తాడు.

రాత్రి 11 గంటలకు ప్రారంభమయ్యే షిప్టు డ్యూటీ కోసం  స్టీవెన్ సాయంత్రం మూడున్నర, నాలుగు గంటలకే కాలి నడకన బయల్దేరుతాడు. డావిస్ నగరం నుంచి ఓసియోలాకు నాలుగులేన్ల రోడ్డు. ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అందుకనే సమయానికి చేరుకోవడం కోసం వీలైనంత ముందుగా బయల్దేరుతాడు. వెళ్లే ముందు మాత్రం తప్పకుండా భార్యను ఆప్యాయంగా ముద్దు పెట్టుకొని, వేళకు వేసుకోవాల్సిన మందుల గురించి మరీ మరీ చెప్పి వెళతాడు. గాలి, ఎండ, వాన, మంచు అనకుండా గత పదేళ్లుగా స్టీవెన్ తాను పనిచేసే కాసినోకు కాలిన డకనే వెళ్లి వస్తున్నాడు.

అక్కడికి వెళ్లాక కూడా ఆయన చేసే పని ఎనిమిది గంటలు నిలబడి చేసే క్లీనింగ్ పనే. మధ్యలో ఓ పదిహేను నిమిషాలు విశ్రాంతి, భోజనం విరామానికి ఓ అరగంట సమయం ఉంటుందట. డ్యూటీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం స్టీవెన్‌కు కొంత ఊరట ఉంటుంది. ఉదయం అవడం వల్ల రోడ్డు రద్దీగా లేకపోవడం, అదే కాసినోలో పనిచేసే తోటి ఉద్యోగుల్లో ఎవరో ఒకరు మార్గమధ్యంలో వదిలిపెట్టడం ఆయనకు కొంత సౌలభ్యం. కొడుకులు, కూతుళ్లు ఎవరూ లేరు. 22 ఏళ్ల మనవడు తనతోనే ఉంటాడు. అయితే అతను నిరుద్యోగి. ఉద్యోగం వేటలో తిరుగుతున్నాడట.  ఇంతకు ఇప్పుడు స్టీవెన్ వయస్సెంతో తెలుసా..! 61 ఏళ్లు. ఆరోగ్యం అనుకూలించినంతవరకు, కాళ్లలో సత్తువున్నంత వరకు ఇలాగే కాలినడకన వచ్చిపోతూ ఉద్యోగం చేస్తానని చెబుతున్నాడు స్టీవెన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement