యూఎస్‌ విమానాల్లో మరో కొత్త నిషేధం

యూఎస్‌ విమానాల్లో మరో కొత్త నిషేధం


వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన కొన్ని విమానాల్లో ఇకపై పలు రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకెళ్లడానికి వీల్లేని పరిస్థితి తలెత్తనుంది. ముఖ్యంగా రాయల్‌ జోర్డానియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు తదితర వస్తువులను తమ లగేజీతో తీసుకెళ్లేందుకు అనుమతించకుండా నిషేధం విధించనున్నట్లు సదరు ఎయిర్‌లైన్స్‌ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే, మొబైల్‌ ఫోన్లను, వైద్యపరమైన వస్తువులకు మాత్రం మినహాయింపు ఉన్నట్లు పేర్కొంది.అయితే, ఇతర ఎయిర్‌లైన్‌ సంస్థలు కూడా ఇదే నిర్ణయాన్ని అమలు చేయనున్నాయా? ఎంతకాలం అమలుచేస్తాయి? దీని ఉద్దేశం ఏమిటి? అనే వివరాలు మాత్రం పూర్తి స్థాయిలో తెలియరాలేదు. వారాంతపు చర్చలో భాగంగా అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల కార్యదర్శి జాన్‌ కెల్లీ పలువురు చట్టసభల ప్రతినిధులకు ఫోన్లు చేసి ఏవియేషన్‌ రక్షణ సంబంధమైన విషయాలు చర్చించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వస్తువుల బ్యాన్‌పై అధికారిక నిర్ణయం వెలువరిస్తే ఎలాంటి ప్రభావం చూపనుందని వారి వద్ద ఆరా తీశారంట. అయితే, పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ అమెరికా అధికారి మాత్రం ఈ నిషేధం కొద్ది వారాలపాటే చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Back to Top