రోబో గీసిన చిత్రం

Robot drawn picture - Sakshi

ఇవన్నీ చిన్న చిన్న పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలన్నింటినీ కలిపి ఒక దగ్గర ఉంచినట్లు ఉన్నాయి కదూ! అయితే ఇవి ఏ ఫొటోగ్రాఫర్‌ కెమెరా నుంచో లేక ఏ చిత్రకారుడి కుంచె నుంచో జాలువారినవి కావండోయ్‌.. కృత్రిమ మేధ నుంచి పుట్టుకొచ్చిన చిత్రాలు. ప్రముఖ మైక్రోప్రాసెసర్‌ తయారీ సంస్థ ఎన్‌విడయా రూపొందించిన జనరేటివ్‌ అడ్వర్సరీ నెట్‌వర్క్‌ అనే కృత్రిమ మేధ వీటిని గీసింది. కెమెరాతో తీసినవి కావు.. కుంచెతో గీసినవి కావు.. మరి ఇంత సహజంగా ఎలా వచ్చాయనే కదా అనుమానం.

మరదే కృత్రిమ మేధస్సు అంటే.. ఎవరైనా మనిషి బొమ్మను గీయాలని ఓ చిత్రాకారుడిని అడిగితే తన టాలెంట్‌ను ఉపయోగించి గీస్తాడు. అయితే మరీ అచ్చు గుద్దినట్లయితే రావడం కష్టమే. కానీ ఈ కృత్రిమ మేధ మాత్రం ప్రముఖ సెలబ్రిటీల ఫొటోలను ఆధారంగా చేసుకుని వీటిని 99 శాతం పోలికలతో గీసేసింది. మన మెదడులోని నాడీకణాల మాదిరిగా పనిచేసే ఈ వ్యవస్థతో ఇది సాధ్యమైంది. అంటే మనం ఏదో ఊహించుకుంటాం.. మన మనసుకు కన్పించిన చిత్రానికి ప్రాణం పోయాలంటే మనకు చాలా కష్టం.. ఈ కృత్రిమ మేధ మాత్రం ఈజీగా గీసేస్తుందన్న మాట.

ఇంకో విషయమేంటంటే గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్‌ వ్యవస్థ వేవ్‌నెట్‌ పేరుతో మనిషి గొంతును అనుకరించడాన్ని అభివృద్ధి చేసింది. ఇంకోవైపు లైర్‌బర్డ్‌ అనే మరో కంపెనీ కూడా కేవలం ఒక్క నిమిషం ఆడియోతో ఆ మనిషిని పోలిన గొంతుతో మాట్లాడే రోబోను తయారు చేసింది. ఇంకో సంస్థ మన సంతోషాన్ని, బాధ, కోపాలను కాపీ కొట్టగల నేర్పును కంప్యూటర్లకు అందించింది. ఇంకొన్నేళ్లు గడిస్తే.. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడం అసాధ్యంగా మారిపోతుందేమో! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top