గర్భిణులూ జ్వరంతో జాగ్రత్త

Pregnant women must Be careful with fever

గర్భం దాల్చిన తొలి మూడు నెలల్లో జ్వరమొస్తే.. పుట్టబోయే పిల్లలకు సమస్యలు రావొచ్చు. ఈ విషయం చాలా కాలంగా తెలిసినా దీనికి కారణాన్ని అమెరికాలోని డ్యూక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా కనుక్కున్నారు. గుండె, ముఖం, దవడ వంటి శరీర భాగాల తయారీలో కీలకపాత్ర పోషించే న్యూరల్‌ క్రెస్ట్‌ కణాలు ఉష్ణోగ్రత పెరుగుదలకు స్పందిస్తాయని, అందుకే సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొన్ని రకాల చేపలు, కోళ్ల పిండాలపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఎరిక్‌ బెన్నెర్‌ తెలిపారు. గర్భధారణ జరిగిన తొలి మూడు నెలల్లో జ్వరం వచ్చిన సమయం.. ఉష్ణోగ్రత, జ్వరం కొనసాగిన సమయం వంటి అంశాల ఆధారంగా పుట్టబోయే పిల్లల్లో గుండె సమస్యలు, గ్రహణం మొర్రి వంటివి వచ్చే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తొలి 3 నెలల్లో వచ్చే జ్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. గర్భానికి ముందే శరీరానికి పుష్టినిచ్చే విటమిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌ వంటివి డాక్టర్ల సలహా మేరకు తీసుకోవాలని చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top