వేడితో కరెంటు

Power Generation With Heat - Sakshi

నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటోంది. ఫోన్‌ను ఎక్కువ సేపు వాడితే వేడి అవుతుంటుంది. అయితే ఆ వేడి ఏమవుతుంది..? వృథా అవుతుంది. కానీ ఆ వేడిని వృథా కానీయకుండా.. విద్యుత్‌ తయారుచేస్తే..! సెల్‌ఫోన్లే కాదు ఫ్రిజ్‌లు, కార్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి వెలువడే వేడితో విద్యుత్‌ను తయారుచేస్తే.. చాలా అద్భుతమైన ఐడియా కదా..? అయితే ఇలాంటివన్నీ అనుకోవడానికే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో ఎలా సాధ్యమవుతుందని మూతి విరవకండి. ఎందుకంటే ఆ ఆలోచనను నిజం చేశారు.. అమెరికాలోని ఉటా యూనివర్సిటీ పరిశోధకులు. సిలికాన్‌ చిప్పులను ఉపయోగించి ఉష్ణం నుంచి విద్యుత్‌ను పుట్టించి చూపించారు.

ఇందుకు 5 మి.మీ.ల పరిమాణంలోని రెండు సిలికాన్‌ చిప్‌లను 100 నానోమీటర్ల దూరంలో ఉంచి.. ఒకదాన్ని చల్లబరిచి.. మరోదాన్ని వేడి చేశారు. దీంతో ఉష్ణం వెలువడి.. దాని నుంచి విద్యుత్‌ తయారైంది. సిలికాన్‌ చిప్‌ల మధ్య ఎంత దూరం తక్కువగా ఉంటే.. అంత ఎక్కువగా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చని పరిశోధనల్లో పాలుపంచుకున్న ప్రొఫెసర్‌ మాథ్యూ ఫ్రాంకోయెర్‌ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో భవిష్యత్తులో ఎలక్ట్రానిక్‌ వస్తువులు వేడి కావడాన్ని తగ్గించొచ్చు. వాటి బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగుపరచవచ్చు. సౌర ఫలకాల పనితీరు కూడా మెరుగుపరచవచ్చని, వాహనాల ఇంజన్‌ నుంచి వెలువడే ఉష్ణ శక్తితో ఎలక్ట్రానిక్‌ వస్తువులు పనిచేసేలా, కంప్యూటర్లలో వాడే ప్రాసెసర్ల పని తీరు మెరుగుపర్చేలా దీన్ని వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top