పుతిన్‌తో మోదీ భేటీ

PM Narendra Modi Meets Vladimir Putin In Sochi - Sakshi

సోచి : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ రష్యన్‌ తీరప్రాంత నగరం సోచిలో సోమవారం భేటీ అయ్యారు. భారత్‌, రష్యాలు చిరకాల మిత్రులని, ఇరు దేశాలూ ప్రస్తుతం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంతో కలిసి సాగుతున్నాయని ఈ సందర్భంగా పుతిన్‌తో మోదీ అన్నారు. తనను చర్చలకు ఆహ్వానించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన నేపథ్యంలో భారత్‌, రష్యాలపై ఆర్థిక ప్రభావం, ఆప్ఘనిస్ధాన్‌, సిరియాలో పరిస్థితులు, ఉగ్రవాద ముప్పు, ఎస్‌సీఓ, బ్రిక్స్‌ సదస్సులు సహా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. మరోవైపు భారత్‌-రష్యా పౌర అణు సహకారాన్ని తృతీయ దేశాలకు విస్తరించడం, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్‌ (ఐఎన్‌ఎస్‌టీసీ) ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడంపైనా మోదీ, పుతిన్‌లు దృష్టిసారించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

అమెరికా ఇరాన్‌ డీల్‌ నుంచి తప్పుకున్న అనంతరం ట్రంప్‌ యంత్రాంగం విధించిన ఆంక్షలతో ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు నెరిపే దేశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. సౌదీ అరేబియా, ఇరాక్‌ తర్వాత భారత్‌కు అతిపెద్ద ముడిచమురు సరఫరాదారు ఇరాన్‌ కావడం గమనార్హం. ఉక్రెయిన్‌లో సైనిక జోక్యం, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలదూర్చడం వంటి ఆరోపణలపై రష్యాపై అమెరికా ఈ ఏడాది ఆరంభంలో ఆంక్షలు విధించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top