ట్యాంక్‌లు, క్షిపణులు దేశాన్ని కాపాడలేవు..

Pakistan Minister Says Tanks, Missiles Alone Can Not Save Country - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా లేకుంటే కేవలం ట్యాంక్‌లు, క్షిపణులే దేశాన్ని కాపాడలేవని పాక్‌ దేశీయాంగ మంత్రి అషన్‌ ఇక్బాల్‌ అన్నారు. 1990ల్లో భారత ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ పాక్‌ మంత్రి సర్తాజ్‌ అజీజ్‌ అనుసరించిన ఆర్థిక వ్యూహాలను భారత్‌లో విజయవంతంగా అమలుపరిచారని ఇక్బాల్‌ అన్నట్టు ఎక్స్‌‍ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంది.బంగ్లాదేశ్‌ సైతం ఇవే వ్యూహాలను అమలుపరిచినా, పాకిస్తాన్‌ మాత్రం రాజకీయ అస్థిరతతో సొంత ప్రణాళికలను అమలుపరచలేకపోయిందని ఇక్బాల్‌ ఆందోళన ‍వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రారంభోత్సవం సందర్భంగా పాక్‌ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి, సుస్థిరత ఆర్థిక పురోగతికి కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. మనకన్నా ఒకప్పుడు వెనుకబడిన దేశాలు ఇప్పుడు ఎందుకు ముందున్నాయో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చైనా తలసరి ఆదాయం పాకిస్తాన్‌ కన్నా చాలా తక్కువగా ఉండేదని, ఇప్పుడు చాలా అధికంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇతర దేశాలు మనల్ని అధిగమిస్తుంటే ఎంతకాలం మనం వేచిచూడాలని ప్రశ్నించారు. ఆర్థికంగా పటిష్టంగా లేకుంటే క్షిపణులు, ట్యాంక్‌లు దేశాన్ని కాపాడలేవని స్పష్టం చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top