అంబరమంత సంబరం!

October Festival Germany - Sakshi

ప్రపంచంలో అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటి

జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగే అక్టోబర్‌ ఫెస్ట్‌

అట్టహాసంగా ప్రారంభమైన పండగ

భారీగా తరలివెళుతున్న భారతీయులు

అది జర్మనీలోని మ్యూనిక్‌ నగరం. ఏటా సెప్టెంబర్‌ వచ్చిందంటే చాలు అక్కడి జనాలకు, ప్రపంచ దేశాల్లోని ఔత్సాహిక పర్యాటకులకు పండగే పండగ. ఎందుకంటే అక్కడో పెద్ద పండగ జరుగుతుంది. దానిపేరే మ్యూనిక్‌ అక్టోబర్‌ ఫెస్ట్‌. 16 రోజుల పాటు జరిగే ఈ పండగను అక్కడి జనం ‘వీసన్‌’అని పిలుచుకుంటారు. ఏటా సెప్టెంబర్‌ మూడో శనివారం ప్రారంభమై అక్టోబర్‌ మొదటి ఆదివారంతో ముగుస్తుంది. ఈ ఉత్సవాలకు హాజరయ్యేందుకు గతేడాది నుంచి భారతీయులు భారీగా వెళుతున్నారని హైదరాబాద్‌ నుంచి అక్కడికి వెళ్లిన పి.రాజగోపాలరాజు చెప్పారు.

ఈ పండగ విశేషాలు మీకోసం..
సెప్టెంబర్‌ మూడో శనివారం అంటే నిన్నటితో (సెప్టెంబర్‌ 22) ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్కడి జనం ఈ అక్టోబర్‌ ఫెస్టివల్‌లో అంబరాన్ని తాకేలా సంబరాలు చేసుకుంటారు. ప్రపంచంలో అత్యంత అద్భుతంగా వినోద పర్యాటకంగా నిర్వహించే అతిపెద్ద ఆటవిడుపు ఇది. తెలుగు వారికి చెందిన శ్రీ బాలాజీ ఇండియన్‌ మార్కెట్‌ దుకాణానికి అతి దగ్గరగా ఈ ఉత్సవం జరిగే ప్రదేశం ఉంది. గతేడాది ఈ ఉత్సవాలకు దాదాపు 65 లక్షల మంది ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చారు. అక్కడ జరిగిన అమ్మకాల విలువ బిలియన్‌ యూరోలు ఉంటుందని అంచనా.   

సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట!
ఫెస్టివల్‌ ప్రారంభానికి ముందు మ్యూనిక్‌ నగరం మధ్య నుంచి ఈ ఉత్సవం జరిగే ప్రదేశం వరకు ఈ గుర్రాల ఊరేగింపు ప్రారంభ సూచకంగా నిర్వహిస్తారు. ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొనడాన్ని స్థానిక బవేరియన్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో వ్యవసాయ ప్రధానమైన జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగిన సమయాల్లో ఈ ఉత్సవాలను ఆపేశారు. ఆ తర్వాత 1950 నుంచి అక్టోబర్‌ ఫెస్టివల్‌ జరుగుతూ వస్తోంది. ఈ వేడుకలను అక్కడి మేయర్‌తో ప్రారంభింపజేయడం ఆనవాయితీ. పెద్ద పెద్ద గుడారాలను నిర్మించి ప్రముఖ మద్యం కంపెనీలు మద్యాన్ని సరఫరా చేస్తాయి. అయితే ఈ మద్యం మాత్రమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని నిర్వాహకుల తాపత్రయం. ఇక్కడ మాత్రమే దొరికే బీర్‌ అంటూ ప్రత్యేకంగా కుళాయి ద్వారా పెద్ద పెద్ద గ్లాసుల్లో నింపుకుని తాగడం ఇక్కడి ప్రత్యేకత. ఈ బీరు పేరు గోల్డెన్‌ అంటారు. ఇవి మాత్రమే కాదు, రకరకాల సంప్రదాయక వంటకాలతో అక్కడికి వచ్చిన వారి నోరూరిస్తారు.

ఇదీ చరిత్ర..
ఈ ఫెస్టివల్‌కు కొన్ని శతాబ్దాల చరిత్రే ఉంది. 1810 అక్టోబర్‌ 12న ఇక్కడి బవేరియా రాజకుమారుడు లుడ్విగ్‌ సమీప రాకుమారి థెరిసెతో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఖరీదైన విందు వినోదాలు మళ్లీ జరపాలనే ఆలోచన నుంచి ఆవిర్భవించిందే ఈ అక్టోబర్‌ ఫెస్టివల్‌. ఈ పెళ్లి మొదటి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన గుర్రాల పరుగు పందేలు చాలా కాలం వరకు జరిగాయి. ఇప్పటికీ ఫెస్టివల్‌ ప్రారంభంలో జరిగే బ్రెవరీ కంపెనీల ఊరేగింపుల్లో గుర్రాలు ముందు నడుస్తూ కనువిందు చేస్తాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top