అమెరికాకు మరిన్ని 'గిఫ్ట్‌ ప్యాకేజీలు'

అమెరికాకు మరిన్ని 'గిఫ్ట్‌ ప్యాకేజీలు' - Sakshi

సాక్షి, జెనీవా: వరుస అణు పరీక్షల నిర్వహిస్తున్న ఉత్తరకొరియాపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఆ దేశం మాత్రం ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. ఆదివారం హైడ్రోజన్‌ బాంబును ప్రయోగించి తీవ్ర భౌగోళిక రాజకీయ యుద్ధపూరిత వాతావరణాన్ని సృష్టించిన ఉత్తరకొరియా, అగ్రరాజ్యం నుంచి గట్టిగా హెచ్చరికలు వచ్చినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అమెరికాకు మరిన్ని గిఫ్ట్‌ ప్యాకేజీలు పంపుతామంటూ ఉత్తరకొరియా టాప్‌ డిప్లమెంట్‌ మంగళవారం హెచ్చరించారు.

 

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో డెమొక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా(డీపీఆర్‌కే) అంబాసిడర్‌ హాన్ టే సాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.'' రెండు రోజుల క్రితమే అంటే సెప్టెంబర్‌3న, వ్యూహాత్మక అణు శక్తి నిర్మాణ ప్రణాళిక కింద ఖండాతర బాలిస్టిక్ రాకెట్ కోసం డీపీఆర్‌కే విజయవంతంగా హైడ్రోజన్ బాంబు పరీక్ష చేపట్టింది. మా దేశ ర‌క్ష‌ణ కోసం పరీక్షించిన ఈ హైడ్రోజ‌న్ బాంబు 'ఓ గిప్ట్ ప్యాకేజ్'..'' అని అభివ‌ర్ణించారు. తమ నుంచి అమెరికా ఇలాంటి మరిన్ని 'గిఫ్ట్‌ ప్యాకేజీ'లను అందుకుంటుందని హెచ్చరించారు.  

 

త‌మ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా నిర్ల‌క్ష్య‌పూరితంగా చేస్తోన్న రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌ను మానుకోనంత‌వ‌ర‌కు తాము ఇటువంటి పరీక్ష‌లు చేస్తూనే ఉంటామ‌ని చెప్పారు. అమెరికా చేస్తోన్న వ్యాఖ్య‌లు త‌మ‌పై ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌బోవ‌ని వ్యాఖ్యానించారు. హైడ్రోజన్‌ బాంబును పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొరియాకు వ్యతిరేకంగా అత్యంత తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటామని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉత్తరకొరియా మరిన్ని గిఫ్ట్‌ ప్యాకేజీలు ఉంటాయంటూ ప్రకటించడం మరింత యుద్ధపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోంది. 

 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top