మరో క్షిపణి ప్రయోగానికి ఉ.కొరియా సన్నాహాలు!

వచ్చే వారం అమెరికా, ద. కొరియా సంయుక్తంగా నావికా విన్యాసాలు

సియోల్‌: కొరియా ద్వీపకల్పంలో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, ద. కొరియాలు వచ్చే వారం సంయుక్తంగా నావికా విన్యాసాలు చేపట్టాలని నిర్ణయించటంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉత్తరకొరియా మరోమారు బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా, దక్షిణ కొరియా దేశాలు భావిస్తున్నాయి. ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా ప్యాంగ్‌యాంగ్, ఉత్తర పోంగ్యాన్‌ ప్రావిన్సు దగ్గర బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని దక్షిణ కొరియాకు చెందిన డోంగా ఐబో అనే పత్రిక పేర్కొంది.

ఈ క్షిపణులు హ్వాసంగ్‌–14 ఖండాంతర క్షిపణి లేదా హ్వాసంగ్‌–12 మధ్యంతర క్షిపణిగా దక్షిణ కొరియా మిలటరీ అధికారులు భావిస్తున్నారు. కాగా, వీటి కంటే మెరుగైన హ్వాసంగ్‌–13 ఖండాంతర క్షిపణి అయ్యే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారని ఆ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని తాము పరిశీలిస్తున్నామని, దీనిపై మాట్లాడేందుకు సిద్ధంగా లేమని ఓ మిలటరీ అధికారి తెలిపారు. ఈ వారంలో జపాన్, దక్షిణ కొరియాతో కలిసి అమెరికా తన రెండు సూపర్‌ సోనిక్‌ హెవీ బాంబర్‌ హెలికాప్టర్లతో తొలిసారి రాత్రివేళలో విన్యాసాలు చేపట్టింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top