ఓ విశిష్టమైన వ్యక్తి చైర్‌లో ఉన్నారు: స్పీకర్‌

New Zealand Speaker Feeds MP Baby in Parliament Wins Hearts - Sakshi

పదవి చేపట్టగానే దాని స్థాయితో సంబంధం లేకుండా అధికార దర్పం ప్రదర్శించే ఎంతో మంది వ్యక్తులను మనం రోజూవారీ జీవితంలో చూస్తూనే ఉంటాం. మునుపటిలా వారితో మాట్లాడబోయి బిక్కముఖం వేయాల్సి రావడం దాదాపుగా ప్రతీ ఒక్కరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంటారు. అత్యున్నత పదవిలో ఉన్నా సరే ఎదుటి వారికి సముచిత గౌరవం ఇచ్చి హుందాగా ప్రవర్తిస్తారు. న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ ట్రెవర్‌ మలార్‌‍్డ కూడా ఈ కోవకు చెందిన వారే. కివీస్‌ ఎంపీ టమాటి కాఫే బుధవారం తన నెలల పాపాయితో కలిసి పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ క్రమంలో చిన్నారి ఆకలితో ఏడ్వడం గమనించిన స్పీకర్‌ ట్రెవర్‌ తనను దగ్గరకు తీసుకున్నారు. తనతో పాటు స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టుకుని బాటిల్‌తో పాలు పట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

గొప్ప సందేశం ఇచ్చారు సారూ!
‘సాధారణంగా ప్రిసైడింగ్‌ అధికారులు స్పీకర్‌ స్థానంలో కూర్చుంటారు. అయితే ఈరోజు ఓ విశిష్టమైన వ్యక్తి నాతో పాటు ఇక్కడ ఆసీనులయ్యారు. ఓ కొత్త సభ్యుడు కుటుంబంలోకి వచ్చిన సందర్భంగా టమాటీ కాఫే, టిమ్‌లకు శుభాకాంక్షలు’ అంటూ ఎంపీ జంటకు ట్రెవర్‌ అభినందనలు తెలిపారు. ఇక పాపాయితో ఉన్న ట్రెవర్‌ ఫొటోలకు ఫిదా అయిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘తండ్రులకు చాలా గొప్ప సందేశం ఇచ్చారు సార్‌. మగవాళ్లకు కూడా పిల్లల పెంపకంలో భాగం ఉంటుందనే విషయాన్ని హుందాగా చాటిచెప్పారు. పాపాయిలను చక్కగా ఎత్తుకోవడంలో, వారికి పాలుపట్టడంలో ఏమాత్రం ఇబ్బంది కలగదని విధులు నిర్వర్తిస్తూనే వివరించారు. అద్భుతం సార్‌! మా హృదయాలు గెలుచుకున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top