
డోనాల్డ్ ట్రంప్ యోగ్యుడా.. కాదా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మరుక్షణం నుంచే తరచుగా వార్తల్లో నిలిచిన వ్యక్తి డోనాల్డ్ ట్రంప్.
- ట్రంప్ ను అమెరికన్లు నమ్మడం లేదు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మరుక్షణం నుంచే తరచుగా వార్తల్లో నిలిచిన వ్యక్తి డోనాల్డ్ ట్రంప్. వివాదాస్పద చర్యలతో ట్రంప్ విదేశీయులకు, అమెరికాకు వలసవచ్చే వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడం, హెచ్1 బీ వీసాల విధానంలో నూతన పద్ధతులు అవలంభించి.. ఇవన్నీ కేవలం అమెరికా వాసుల రక్షణ కోసం, ఉద్యోగాల కోసమేనని ట్రంప్ నొక్కి వక్కాణించినా దేశప్రజలు మాత్రం అధ్యక్షుడిని నమ్మడం లేదట. ట్రంప్ ప్రభావం ఎంతంగా ఉందంటే.. ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్ లాంటి దేశాలు కూడా విదేశీవలసలను నియంత్రించేందుకు వీసా నియమాలకు సవరణ చేపట్టాయి. సర్వేమంకీ అనే సంస్థ తాజాగా చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు కావస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ సర్వే చేసింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడని, ఆ పదవికి ఆయన యోగ్యుడని కేవలం 25 శాతం మంది విశ్వసిస్తున్నారు. 75 శాతం అమెరికన్లు ట్రంప్ ను నమ్మడం లేదు. గత ఫిబ్రవరిలో చేపట్టిన సర్వేల్లో 31 శాతం అమెరికన్లు ట్రంప్ పాలనపై తమకు నమ్మకం ఉందని చెప్పగా, తాజా సర్వేలో ట్రంప్ తన విశ్వసనీయతను మరింత కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. దేశ ప్రజల రక్షణకు, వారి ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తూ, వలసవచ్చిన వారి బాగోగులను పక్కనపెట్టినా.. ట్రంప్ పై అమెరికన్లకు వ్యతిరేకత తగ్గలేదు. అధ్యక్ష పదవికి ట్రంప్ అర్హుడిగా 47 శాతం మంది భావిస్తే.. అనర్హుడని 52 శాతం ప్రజలు సర్వేలో ఓటేశారు.
మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 29న) ట్రంప్ అధ్యక్షుడయి 100 రోజులు పూర్తిచేసుకోనున్నారు. అధ్యక్షుడి వంద రోజుల పాలనపై సర్వే నిర్వహించడం మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ కాలం నుంచి కొనసాగుతోంది. మరోవైపు ట్రంప్ మాత్రం ఈ సర్వేలను తాను పట్టించుకోనని, అవి అర్థరహితమైనవిగా పేర్కొన్నారు. ఇలా సర్వే నిర్వహించే సంప్రదాయాన్ని సైతం అధ్యక్షుడు తప్పుబట్టడం గమనార్హం.