మాకింక మీ సాయం అక్కర్లేదు : మాల్దీవులు

Maldives Envoy Tells India To Pull Out Military Choppers And Personnel - Sakshi

న్యూఢిల్లీ : మాల్దీవులపై ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పోటీపడుతున్న చైనా.. భారత్‌పై పైచేయి సాధించే దిశగా చేసిన ప్రయత్నాలు సఫలమైనట్లుగా కన్పిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్‌ సాయంతో లబ్ధిపొందిన మాల్దీవులు ఇప్పుడా మిత్రధర్మాన్ని తుంగలో తొక్కేందుకు సిద్ధమవుతోంది. చైనాకు దగ్గరయ్యేందుకు తహతహలాడుతున్న మాల్దీవులు ప్రభుత్వం.. భారత్‌ను క్రమంగా దూరం పెడుతోంది. ఇప్పటికే దాయాది పాకిస్థాన్‌తో ఓ విద్యుత్‌ ప్రాజెక్టు కోసం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే భారత్‌ ఇచ్చిన మిలిటరీ హెలికాప్టర్లు,  సైన్యం తమకు అక్కరలేదని తెగేసి చెప్తోంది. 

మిత్రధర్మాన్ని చాటుతూ గతంలో గడ్డు పరిస్థితుల్లో మాల్దీవులు ఉన్నప్పుడు భారత్‌ ఈ సాయాన్ని అందజేసింది. తాజాగా ఈ హెలికాప్టర్లు, సైన్యం వెనక్కి తీసుకోవాలంటూ భారత ప్రభుత్వాన్ని మాల్దీవులు కోరింది. సముద్రతలంపై నిఘా, తప్పిపోయిన నౌకలను వెతికేందుకు ఉద్దేశించిన హెలికాప్టర్లను అందించేందుకు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

మా సొంతంగా తయారు చేసుకోగలం..
భారత్‌లో మాల్దీవుల రాయబారి అహ్మద్‌ మహ్మద్‌ మాట్లాడుతూ.. భారత్‌కు సంబంధించిన రెండు మిలిటరీ హెలికాప్టర్లను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. ఇన్నాళ్లుగా వైద్య సేవల కోసం ఉపయోగించుకుంటున్న ఈ రెండు హెలికాప్టర్లతో ఇక పనిలేదని, తాము సొం‍తంగా ఇటువంటి హెలికాప్టర్లను తయారు చేసుకునే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. భారత్‌ కుదిరిన ఒప్పందం జూన్‌లోనే ముగిసిపోయిందన్న అహ్మద్‌.. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని తెలిపారు. హెలికాప్టర్లతో పాటుగా ఇన్నాళ్లుగా మాల్దీవుల్లో మోహరించిన 50 మంది మిలిటరీ అధికారుల(పైలట్లు, సహాయక సిబ్బంది సహా) వీసాల గడువు ముగిసినందున వారిని కూడా తిరిగి భారత్‌కు పంపించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికీ అక్కడే ఉన్నాయి..
భారత్‌కు చెందిన మిలిటరీ హెలికాప్టర్లు, సిబ్బంది ఇప్పటికీ మాల్దీవుల్లోనే ఉన్నాయన్నని  భారత నైకాదళ అధికార ప్రతినిధి తెలిపారు. మాల్దీవులతో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించే విధంగా విదేశాంగ శాఖ చర్చలు జరుపుతోందని పేర్కొన్నారు. కాగా ఈ విషయం గురించి విదేశాంగ శాఖ ఇంతవరకు స్పందించలేదు.

చైనా ప్రోద్బలంతోనేనా?
భారత్‌కు రక్షణపరంగా ఎంతో వ్యూహాత్మకంగా ఉన్న మాల్దీవుల్లో 1100లకు పైగా దీవులు ఉన్నాయి. ఈ కారణంగా మాల్దీవులకు భారత్‌ ఎప్పటినుంచో రక్షణ కల్పిస్తూ వస్తోంది. అయితే, మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్‌ యమీన్‌ గయూమ్‌ గద్దెనెక్కిన నాటి నుంచి చైనాతో సంబంధాలకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే కొన్ని దీవులను చైనాకు లీజుకు కూడా ఇచ్చారు. అలాగే పాకిస్తాన్‌తో కూడా సరికొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

ఎమర్జెన్సీ సమయంలోనూ..
మాల్దీవుల్లో 45 రోజుల పాటు ఎమర్జెన్సీ(ప్రతిపక్ష నేతలను విడుదల చేయయాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తర్వాత) విధించిన సమయంలోనూ భారత్‌ మధ్యవర్తిత్వాన్ని ఆ దేశం తిరస్కరించింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం పాకిస్తాన్‌​ సైన్యాధికారి జావేద్‌ బాజ్వాను తమ దేశంలో పర్యటించాలంటూ ఆహ్వానించింది. చైనా పెట్టుబడులకు ప్రోత్సాహం అందించబోతున్నామని, ఈ సమయంలో చైనా, భారత్‌లతో సంబంధాల విషయంలో వచ్చే సమస్యలపై కూడా తమ దేశానికి అవగాహన ఉందని ఆ దేశ ప్రతినిధులు ప్రకటనలు కూడా చేశారు. కాగా ప్రస్తుతం భారత్‌తో మాల్దీవులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చైనా విజయం సాధించినట్లుగానే కన్పిస్తోందని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top