పాక్‌ ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్‌ ఖాన్‌

Imran Khan Elected As Pakistan New Prime Minister - Sakshi

ఎన్నుకున్న జాతీయ అసెంబ్లీ

రేపే ఇమ్రాన్‌ ఖాన్‌​ ప్రమాణస్వీకారం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ నూతన ప్రధాన మంత్రిగా మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికయ్యారు. పాక్‌ 22వ ప్రధాన మంత్రిగా శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణ ఎన్నికల అనంతరం నేషనల్‌ అసెంబ్లీ సభ్యులతో ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడం పాకిస్తాన్‌లో ఆనవాయితీ. ఈ మేరకు పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు 176 ఓట్లు రాగా, షాబాజ్‌ షరీఫ్‌కు 96 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రధానిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.

ప్రధానిగా ఎన్నికవ్యాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌కు నలుగురు సభ్యుల అదనపు మద్దతు లభించింది. అధికారుల సమాచారం ప్రకారం శనివారం ఉదయం 9.15 నిమిషాలకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా జూలై 25న దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ 116 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. 272 స్థానాల్లో పోటీ చేసిన పీటీఐ అధికారానికి  కేవలం 21 స్థానాల దూరంలో  నిలిచిపోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top