ఇమ్రాన్‌ పొదుపు మంత్రం!

Imran Khan Austerity Drive Goes Viral In Pakistan - Sakshi

కార్లు వేలం, అపార్ట్‌మెంట్‌లో నివాసం

పాక్‌లో భిన్నాభిప్రాయాలు 

పైసా పైసా పొదుపు, అదే భవితకు మలుపు అంటున్నారు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌. లగ్జరీ లైఫ్‌ అనుభవించే ప్రభుత్వ అధికారులపై కొరడా ఝుళిపించారు. వీఐపీ కల్చర్‌ అన్న పదాన్నే తుడిచేయాలని చెబుతున్నారు. ఆయన తీసుకుంటున్న పొదుపు చర్యలు చాలా మందిని విస్మయానికి గురి చేస్తున్నాయి.  ప్రభుత్వంలో కొందరు ఇదెక్కడి పొదుపంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొందరు దుబారాకు కళ్లెం పడాల్సిందేనని ఇమ్రాన్‌కు మద్దతు పలుకుతున్నారు. ఇక విపక్షాలు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ అంటూ కొట్టిపారేస్తున్నాయి. 

ప్రధాని అధికారిక నివాసం కాదని అపార్ట్‌మెంట్‌లోకి 
ఇమ్రాన్‌ పొదుపు చర్యల్ని మొదట తనతోనే మొదలు పెట్టారు. 134 ఎకరాల్లో విస్తరించిన రాజప్రాసాదం, 524 మంది సిబ్బంది ఉన్న ప్రధాని అధికారిక నివాసాన్ని కాదనుకొని 3 బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. కేవలం ఇద్దరు సర్వెంట్స్‌ని మాత్రమే పనిలో ఉంచారు. ప్రధాని నివాసాన్ని యూనివర్సిటీగా మారుస్తానని ప్రకటించారు

విమానాల్లో ఫస్ట్‌క్లాస్‌ ప్రయాణాలు నిషేధం 
పాక్‌లో అత్యున్నత అధికారులు విమానాల్లో ఫస్టక్లాస్‌ ప్రయాణాలపై నిషేధం విధించారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఫస్ట్‌క్లాస్‌ బదులుగా ఇక బిజినెస్‌ క్లాసులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. 

వంటల్లోనూ పొదుపు
ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాల సమయంలో గత ప్రభుత్వాలు రకరకాల నోరూరించే వంటకాలతో లంచ్‌ ఏర్పాటు చేసేవారు. ఆ సమయంలో విపరీతంగా ఆహారం వృథా అయ్యేది. ఇమ్రాన్‌ వాటన్నింటినీ తగ్గించేశారు. ఇప్పుడు సమావేశాల సమయంలో కనీసం బిస్కెట్లు కూడా ఇవ్వడం లేదని ఒక అధికారి వాపోయారంటే తిండిఖర్చుని ఎంత తగ్గించారో అర్థమవుతుంది. 

అత్యవసరమైతేనే విదేశీ ప్రయాణాలు
మూడోసారి ప్ర«ధానిగా ఉన్న సమయంలో నవాజ్‌ షరీఫ్‌ 64 సార్లు విదేశీ ప్రయాణాలు చేశారు.  వెళ్లినప్పుడల్లా 631 మంది సిబ్బంది ఆయన వెంట ఉండేవారు. ఇందుకోసం 65 కోట్లు రూపాయలు ఖర్చు చేశారు. అంత వృథా ఖర్చు ఎందుకని భావించిన ఇమ్రాన్‌ అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి తప్ప మరెవరూ ఇతర దేశాలకు వెళ్లాల్సిన పని లేదని తేల్చేశారు. 

ప్రధాని లగ్జరీ కార్లు వేలం
ప్రధాని నివాసంలో అంతగా వినియోగంలో లేని 33 లగ్జరీ కార్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రధాని నివాసంలో సెప్టెంబర్‌ 17న ఈ వేలం జరుగుతుంది. ఎనిమిది బీఎండబ్ల్యూ కారులు,  నాలుగు మెర్సెడెస్‌ బెంజ్‌ కార్లు, 16 టయోటా కార్లతో పాటుగా నాలుగు బుల్లెట్‌ ప్రూప్‌ వాహనాలు, ఒక హోండా సివిక్‌ కారు, మూడు సుజుకి వెలికల్స్‌తో పాటుగా 1994 మోడల్‌కు చెందిన హినో బస్సు కూడా వేలం వేస్తారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బుల్ని ఖజానాలో జమచేస్తారు. 

హెలికాప్టర్‌ ప్రయాణం వివాదాస్పదం
ఇలా పైసా పైసా పొదుపు చేస్తున్న ఇమ్రాన్‌ తన నివాసం నుంచి సెక్రటేరియెట్‌కి ప్రతీరోజూ హెలికాప్టర్‌లో వెళ్లి వస్తూ ఉండడం వివాదాన్ని రేపింది. పొదుపు చెయ్యాలనిఅందరికీ సుద్దులు చెబుతున్న ఇమ్రాన్‌ హెలికాప్టర్‌లో వెళ్లడమేంటని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. అయితే హెలికాప్టర్‌లో వెళ్లితే కిలోమీటర్‌కి 50–55 రూపాయలకు మించి అవదంటూ పాక్‌ సమాచార మంత్రి ఫవాద్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. సోషల్‌ మీడియా ఇమ్రాన్‌ను టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడింది. ఇమ్రాన్‌ ప్రయాణిస్తున్న అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఎడబ్ల్యూ139లో కిలోమీటర్‌కి 1600 రూపాయల వరకు అవుతుందని పరిశోధనలు చేసి మరీ తేల్చారు. దీంతో ప్రభుత్వం మాట మార్చింది.  కార్లలో వెళితే భద్రత కోసం నాలుగైదు కార్ల కాన్వాయ్‌ మొత్తం తరలివెళ్లాలని, ఆ సమయంలో ట్రాఫిక్‌ ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని అంటోంది. కార్ల కాన్వాయ్‌ అంతటికీ అయ్యే ఖర్చుతో పోలిస్తే హెలికాప్టర్‌ ప్రయాణం చీప్‌గా అయిపోతుందంటూ సమర్థించుకుంది. 

ఇలాంటి పొదుపుతో ఒరిగేదేంటి ?
పాకిస్తాన్‌ పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. విదేశీ రుణాలే 9,100 కోట్ల డాలర్లు దాటి పోయాయి. ఈ అప్పుల్ని తీర్చడానికే ఆరునెలల్లో 800 కోట్ల డాలర్లు కావాలి. అంత డబ్బు ఎలా వస్తుందన్న ఆందోళనలో సర్కార్‌ ఉంది. సమగ్రమైన ఆర్థిక ప్రణాళికను ప్రకటించకుండా ప్రభుత్వం ఇలాంటి చిన్నా చితక పొదుపుల వల్ల ఒరిగేదేమీ ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్‌ రక్షణ కోసం ప్రతీ ఏటా 1200 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. పాక్‌ ఆర్థిక పరిస్థితికి అది చాలా ఎక్కువ. ఇక పాక్‌ మిలటరీకి చెందిన వ్యక్తులు వ్యాపారాలు చేస్తే పన్నులు చాలా తక్కువగా వేస్తారు.ఇమ్రాన్‌ సర్కార్‌ నిజంగానే పొదుపు పాటించాలంటే రక్షణ బడ్జెట్‌ని తగ్గించి, మిలటరీ వ్యాపారులపై పన్నులు విధించాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top