'రాత్రికి రాత్రే యుద్ధానికి సిద్ధం'

'రాత్రికి రాత్రే యుద్ధానికి సిద్ధం'


న్యూజెర్సీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ మాటలతో ఉత్తరకొరియాను లొంగదీయాలనే ఆలోచనను మానుకోవడం లేదు. తాజాగా ఆయన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌కు అల్టీమేటం జారీ చేశారు. అమెరికాను ఢీ కొట్టి నిలవాలనే ఆలోచన ఉత్తరకొరియా మానుకోవాలనే దిశలో ట్రంప్‌ ప్రసంగం సాగింది.ఒకవేళ ఉత్తరకొరియా గ్వామ్‌పై దాడి చేస్తే రాత్రికి రాత్రే యుద్ధానికి సిద్ధమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. వెనిజులా సంక్షోభంపై మిలటరీని ప్రయోగించాలని భావిస్తున్నట్లు కూడా ట్రంప్‌ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచమార్కెట్లు కుదేలయ్యాయి. యుద్ధ భూతం రెక్కలు విప్పుకుంటుందేమోననే నిపుణుల సందేహాలు మరింత భయాందోళనలను పెంచుతున్నాయి.కొరియన్‌ మీడియా అయితే యుద్ధం జరిగితే తమ ప్రాంతం నాశనం అవుతుందని ఆందోళన వెలిబుచ్చింది. ట్రంప్‌ సంయమనంతో మాట్లాడాలని కోరింది. గ్వామ్‌ ద్వీపానికి ఏదైనా జరిగితే ఉత్తరకొరియాపై అణుదాడికి బీ-1బీ సూపర్‌సోనిక్‌ విమానాలు పసిఫిక్‌ మహాసముద్రంలో సిద్ధంగా ఉన్నాయని ట్రంప్‌ చెప్పారు. అయితే, ట్రంప్‌ న్యూజెర్సీలో ఈ ప్రకటన చేసే ముందు వరకూ ఉత్తరకొరియా సముద్రజలాల్లో అమెరికా నేవీ లేదా వాయుదళానికి చెందిన హడావుడి ఏదీ కనిపించలేదు.కానీ, యుద్ధానికి తాము సన్నద్ధంగా ఉన్నామని ట్రంప్‌ చెప్పడం వింతగా అనిపిస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండానే అమెరికా అన్నింటిని సమకూర్చుకుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ట్రంప్‌ వ్యాఖ్యలు కిమ్‌ను మాటలతో మెడలు వంచడానికేనని తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు ఆందోళనకర పరిస్ధితులకు దారి తీస్తున్నాయి.

Back to Top