విమానంలో ప్రయాణికునితో పాటు..!

German Man Flies To Russia Carrying 20 Live Snakes - Sakshi

మాస్కో : విమానంలో మనుషులతో పాటు నల్లులు కూడా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో నల్లులు మాత్రమే విమానంలో ప్రయాణించాలా.. మేం ఎందుకు విమానాయానం చేయకూడదు అనుకున్నయోమో పాములు కూడా విమానయానం చేయడం ప్రారంభించాయి. అలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 20 పాములు విమానంలో ప్రయాణం చేశాయి. పాములేంటి.. విమానంలో ప్రయాణించడమేంటి అనుకుంటున్నారా.. అయితే మీరే చదవండి. ఈ వింత సంఘటన రష్యా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం రష్యాలోని షెరెమెట్యివో అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు జర్మనీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి సంచిలో 20 పాములు ఉన్నట్లు గుర్తించారు. సదరు ప్రయాణికుడు ఆ పాములను చిన్న చిన్న పెట్టెల్లో ఉంచి, వాటిని ఓ సంచిలో పేర్చి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణికుడు ఈ పాములను జర్మనీలో కొని వాటిని రష్యాకు తీసుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ విషయం గురించి విమానాశ్రయం అధికారి ఒకరు ‘పాములను కొన్నదానికి సంబంధించి సదరు ప్రయాణికుడి వద్ద అన్ని పత్రాలు ఉన్నాయి. అందువల్లే జర్మనీలోని విమానాశ్రయంలోని అధికారులు అతడిని అడ్డగించలేదు. కానీ అక్కడి నుంచి పాములను రష్యాకు తెచ్చేందుకు ఎలాంటి అనుమతుల్లేవు’ అంటూ వివరించారు. ఈ విషయం గురించి సదరు ప్రయాణికుడు తన వద్ద ఉన్న పాములు విషపూరితమైనవి కావని.. అలానే పాములను ఓ చోట నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లడం తమ దేశంలో నేరం కాదని తెలిపాడు. ప్రస్తుతం ఆ పాములు మాస్కోలోని జంతు సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో ఉన్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top