రక్తం చిందే ఆ ఆటపై ఎంతో ఆసక్తి!

Fight Between Dog And Wild Boar In Indonesia - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆడు బగాంగ్‌’ అన్నది ఒక ఆటవిక ఆట. అందులో గాయాలవుతాయి. వాటిలో నుంచి రక్తం చిమ్ముతుంది. గాయానికో లెక్క. ఎన్ని గాయాలయితే చూసే వారికి, బెట్‌ కాసేవారికి అంత ఆనందం. ఇది మనుషులు ఆడే ఆట కాదు. మనుషులు ఆడించే ఆట. తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పందేల లాంటిదేగానీ కొంత తేడా. తమిళనాడులో గేదెల మధ్య, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల మధ్య ఆటలు సాగితే అక్కడ కుక్క, అడవి పంది మధ్య హింసాత్మక పోటీలు జరుగుతాయి. 
‘ఆడు బగాంగ్‌’ అన్నది ఇండోనేసియాలో కనిపించే గ్రామీణ క్రీడ. ఇది ఇప్పుడు ఎక్కువగా జావా రాష్ట్రంలో కనిపిస్తోంది.

చిత్తడి చిత్తడిగా ఉన్న ఓ ప్రదేశం చుట్టూ గుండ్రంగా తడికెలతో ఓ దడి కడతారు. అందులోకి శిక్షణ ఇచ్చిన కుక్క పిల్లలను, అడవి పందులను బరిలోకి దింపుతారు. అవి వీరావేశంతో కొట్లాడుకుంటుంటే దడి చుట్టూ నిలబడి వందలాది మంది ప్రజలు చూస్తుంటారు. ఆ సందర్భంగా ఆనందంగా తాగే వారు తాగుతుంటే బెట్‌ కాసే వారు భారతీయ కరెన్సీలో వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కాస్తారు. ఈ క్రీడను మగవారితోపాటు మహిళలు, పిల్లలే కాకుండా పోలీసులు, సైనికులు కూడా ఆసక్తిగా తిలకిస్తారు. 

ఇందులో బెట్టింగ్‌ ఒక సైడే ఉంటుంది. పందెంలో పాల్గొంటున్న ఓ కుక్క, తన ప్రత్యర్థి అడవి పందికి ఎన్ని గాయాలు చేస్తుందన్నదే లెక్క. పంది ప్రాణాలపై కూడా పందెం కాస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో అడవి పంది పోరాడే శక్తిని కోల్పోయినప్పుడు ఆ పందిని బరి నుంచి తప్పించి మరో పందిని ప్రవేశపెడతారు. పందిని తెచ్చి బరిలో ప్రవేశ పెట్టే వారికి కూడా పందెం నిర్వాహకులు కొంత డబ్బు చెల్లిస్తారు. వారి పందికి ఎన్ని గాయాలైతే అంత డబ్బు లెక్కగట్టి ఇవ్వడంతోపాటు వాటికి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా చెల్లిస్తారు. ఈ గ్రామీణ క్రీడను రక్తి కట్టించేందుకు కుక్కలను బలిష్టంగా మేపడమే కాకుండా వాటికి తగిన శిక్షణ ఇస్తారు. 

కేవలం ఈ పోటీల కోసమే బలమైన కుక్క జాతుల మధ్య క్రాస్‌ బ్రీడింగ్‌ ద్వారా కుక్క పిల్లలను పుట్టిస్తారు. బెట్టింగ్‌ రాయుళ్లకు, పందిని తీసుకొచ్చే వారికి ఏ మాత్రం డబ్బు గిట్టుబాటు అవుతుందో తెలియదుగానీ కుక్కల యజమానులు మాత్రం లక్షల కొద్దీ రూపాయలు సంపాదిస్తున్నారు. జీవకారుణ్య కార్యకర్తల డిమాండ్‌ మేరకు ఇండోనేసియా ప్రభుత్వం 2017లో ఈ క్రీడను రద్దు చేసింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను నగర మేయర్లకు అప్పగించడంతో వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందాల్లాగా ఆ దేశంలో ఈ పోటీలు యధేశ్చగా కొనసాగుతున్నాయి. 

‘కప్‌’ల పేరిట కూడా ఈ పోటీలను నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మద్యం తాగడాన్ని అక్కడి షరియా చట్టం నిషేధించినప్పటికీ ఈ పోటీలప్పుడు ప్రజలు మాత్రం జాతి, మత భేదాల్లేకుండా ఆనందంగా తాగడం కనిపిస్తోంది. 1960 నుంచి ఈ పోటీలు అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట రైతులు అడవి పందుల నుంచి తమ పంట పొలాలను కాపాడుకునేందుకు కుక్కలను పెంచేవారు. అవి వాటిని తరిమి తరిమి కొట్టేవి. ఈ వేటను ఆనందించిన రైతుల నుంచే ఈ పోటీలు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top