కూతురి కోసం ఓ తండ్రి వింత పని..

Father Glued His Hand To School Gate For Daughter - Sakshi

లండన్‌ : చెవికి కమ్మ పెట్టుకుందన్న కారణంతో ఓ బాలికను స్కూల్‌ నుంచి ఇంటికి పంపేశారు. తన కూతురు కమ్మ పెట్టుకోవటానికి ఆరోగ్యపరమైన కారణం ఉందని బాలిక తండ్రి ఎంత చెప్పినా స్కూల్‌ యాజమాన్యం వినలేదు. దీంతో ఆ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. స్కూల్‌ గేటుకు తన రెండు చేతుల్ని బంకతో అతికించేసుకుని నిరసన తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌కు చెందిన బాబీమే గత కొద్దిరోజులుగా మైగ్రేయిన్‌తో బాధపడుతోంది. దీంతో ఆమె ఆక్యూపంక్షర్‌ విధానాన్ని అనుసరించి చెవికి కమ్మ కుట్టించుకుంది. ఎప్పటిలాగే మామూలుగా స్కూలుకు వెళుతుండేది. అయితే ఓ రోజు బాబీమే చెవికి కమ్మ ఉండటం గమనించిన టీచర్లు ఆమెను ఇంటికి పంపేశారు.

కొద్ది సేపటి తర్వాత స్కూలు వద్దకు వచ్చిన ఆమె తండ్రి.. మైగ్రేయిన్‌ నొప్పిని అదుపులో ఉంచడానికే తన కూతురు కమ్మ పెట్టుకుందని, కమ్మ కుట్టించుకోవటం  ఆక్యూపంక్షర్‌ విధానంలో భాగమని వారికి  వివరించాడు. అయినా స్కూలు యాజమాన్యం దీన్ని పెడచెవిన పెట్టింది. కమ్మ తీసేస్తేనే స్కూల్‌లోకి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహించిన బాబీమే తండ్రి తన చేతులను స్కూలు గేటుకు అతికించుకుని నిరసన వ్యక్తం చేశాడు. బాబీమేను స్కూల్‌ల్లోకి అనుమతించే వరకు అక్కడినుంచి కదలనని భీష్మించుకున్నాడు. అతడి చేష్టలను భరించలేకపోయిన స్కూల్‌ యాజమాన్యం  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. గేటునుంచి చేతులు వెనక్కు తీసుకోవాలని అతడిని ఆజ్ఞాపించారు. పోలీసుల ఆదేశాల మేరకు అతడు చేతులు గేటునుంచి వెనక్కుతీసుకోక తప్పలేదు. అయితే, బాబీమే తన చెవికమ్మను తొలగించిన మరుక్షణమే స్కూలులోకి ఆహ్వానించబడుతుందని స్కూలు యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా మైగ్రేయిన్‌ నొప్పితో అల్లాడిపోతున్న కూతురికి ఆ చెవి కమ్మ ఎంతో మేలు చేస్తోందని, అలాంటిది కమ్మ తీసేస్తే చిన్న పిల్ల నొప్పి ఎలా భరించగలదని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top