భారతీయులు.. చలో కెనడా! 

Express entry program to the Indians At Canada - Sakshi

అమెరికా వలస విధానంతో విసిగిపోవడమే కారణం 

కెనడాలోకి అత్యంత సులభంగా ప్రవేశించేందుకు ఆ దేశం ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ కార్యక్రమం పేరుతో సులభతర వలస విధానానికి తలుపులు తెరిచింది. దీంతో ఉపాధి కోసం అమెరికావైపు చూసిన అభివృద్ధి చెందుతున్న దేశాల యువతరం మొదలుకొని కాస్త ప్రశాంత జీవితాన్ని కోరుకునే వారంతా ఇప్పుడు కెనడా వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. అక్కడి వలస విధానంతోపాటు పౌరుల ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలూ తదితరాల్లో ఆ దేశంలో ఉన్న సౌలభ్యాలన్నీ కూడా వలసదారుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

అక్కడ స్థిరపడాలనుకునే భారతీయుల సంఖ్య కూడా కెనడా వలసలను రెట్టింపు చేసింది. ట్రంప్‌ వలస విధానాలతో ఠారెత్తిన భారతీయులు సహా ఇతర దేశాల పౌరులు ఇప్పుడు కెనడా వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ కార్యక్రమం కెనడాలో ఆర్థిక వలసలకు కీలకంగా మారింది. ఈ స్కీం కింద 2017లో కెనడా 86,022 మందికి వీసాలు ఇవ్వగా అందులో దాదాపు 42% (36,310) మంది భారతీయ పౌరసత్వం కలిగిన వారే కావడం విశేషం. అలాగే 2016లో ఇచ్చిన వీసాలతో పోలిస్తే 2017లో అవి రెట్టింపు అయ్యాయి. 2016లో కెనడా మొత్తం 33,782 మంది వీసాలకు అనుమతినిస్తే 2016లో భారతీయులకు 11,037 వీసాలు అందించింది. అంటే 2016కంటే 2017లో 200 శాతం అధికంగా భారతీయులకు కెనడా ఆçహ్వానం పలికింది. 

కెనడాపై ఆపేక్షకు కారణాలివే..
కెనడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ–2017 రిపోర్టు ప్రకారం కెనడాలో శాశ్వత నివాసం కోసం దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 86,022 దరఖాస్తులను కెనడా అనుమతించింది. వారిలో 65,401 మంది శాశ్వత నివాసాన్ని ఆశించేవారు, వారి కుటుంబాలూ కెనడాకు చేరుకున్నాయి.  

కెనడా ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. 
- 2016లో భారత్‌ నుంచి 11,037 (33%), చైనా నుంచి 2,741 (8%), నైజీరియా నుంచి 1,041 (3%) మంది కెనడాకు అధికారికంగా వలస వెళ్లారు. 
- 2017లో భారత్‌ నుంచి 36,310 (42%), చైనా నుంచి 7,466 (9%), నైజీరియా నుంచి 5,130 (6%) మంది పౌరులు కెనడా వెళ్లారు. 
- 2017లో ప్రపంచవ్యాప్తంగా కెనడా వెళ్లిన 86,022 మందిలో దాదాపు 40 శాతం అంటే 26,000 మందికిపైగా భారతీయులు స్థిర నివాసమేర్పర్చుకున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top