విషాద జ్ఞాపకానికి 18 ఏళ్లు..

Eighteen Years Complete To Terror Attack On World Trade Center - Sakshi

2001 సెప్టెంబ‌రు 11న వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై ఉగ్రదాడి

ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు

నేటికి 18 ఏళ్లు పూర్తి

వాషింగ్టన్‌: అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై  (2001 సెప్టెంబ‌రు 11) బీన్‌ లాడెన్ టీమ్ జ‌రిపిన ఉగ్ర దాడులు చ‌రిత్ర మ‌ర‌వ‌లేదు. ఈ ఘటనతో ప్ర‌పంచ దేశాల‌న్నీ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల‌పై ఆల్‌ఖైదా ప‌క్కా వ్యూహంతో జ‌రిపిన దాడుల‌వి. 9/11 దాడులు ప్రపంచ చరిత్రలో  ఇప్పటికీ విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది. వేలమంది అమాయక పౌరులను పొట్టనపెట్టకుంది.  సౌదీ అరేబియా, ఇత‌ర అర‌బ్ దేశాల‌కు చెందిన వారే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు త‌ర్వాతి కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్ప‌టి ఆల్‌ఖైదా నాయ‌కుడు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం వ‌హించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి  18 ఏళ్లు ముగిసింది. ఈ సందర్భంగా అమెరికాలో 9/11 మృతులకు నివాళి అర్పించారు.

ఏం జరిగింది..
ఆ రోజు ఉద‌యం 10 మంది ఆల్‌ఖైదా తీవ్ర‌వాదులు.. వాణిజ్య సేవ‌లందించే నాలుగు ప్ర‌యాణికుల జెట్ విమానాల‌ను దారి మ‌ళ్లించారు. హైజాక‌ర్లు రెండు విమానాల‌ను న్యూయార్క్‌లోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌ (ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌)కు చెందిన జంట సౌధాల‌ను ఢీకొట్టించారు. ఈ ఘటనతో వేలమంది పౌరులు మృతిచెందిన విషయం తెలిసిందే. వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికులంద‌రూ, భ‌వ‌నాల్లో ప‌నిచేస్తున్న అనేక మంది ఇత‌రులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. రెండు సౌధాలు(భ‌వ‌నాలు) అంద‌రూ చూస్తుండ‌గానే గంట‌ల వ్య‌వ‌ధిలో కుప్ప‌కూలిపోయాయి. స‌మీపంలోని భ‌వనాలు ధ్వంసం అవ‌డం, మ‌రికొన్ని పాక్షికంగా దెబ్బ‌తిన‌డం జ‌రిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థపై జరిగిన దాడుల్లో దుర్మరణం పాలైన 2,752 మంది బాధితుల్లో 343 మంది అగ్నిమాపకదళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం మరియు పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. పెంటగాన్‌పై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు.

ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు..
ఇక మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ డీసీకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్‌పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణీకులు మరియు విమాన సిబ్బంది తిరిగి దానిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు, గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో అది కుప్పకూలింది. విమానాల్లో ప్రయాణించిన ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థ‌లు నివేదించాయి.

తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించడం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రతిస్పందించింది. అల్‌ఖైదా తీవ్రవాదులకు సాయం చేసే తాలిబన్‌లను తుదముట్టించే విధంగా ఆఫ్గనిస్తాన్‌పై దండెత్తింది. అంతేకాక  ఉగ్రవాదాన్ని ఏరివేతకు కఠిన చట్టాన్ని అమలుచేసింది. పలు ఇతర దేశాలు కూడా వాటి తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని బలోపేతం చేసుకోవడం మరియు చట్టం యొక్క అమలు అధికారాలను విస్తరించుకున్నాయి. కొన్ని అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు దాడుల నేపథ్యంలో వారంలోని మిగిలిన రోజుల్లో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశాయి. ఫలితంగా తిరిగి ప్రారంభించే సమయానికి తీవ్ర నష్టాలను చవిచూశాయి. బిలియన్ల డాలర్లు విలువ చేసే కార్యాలయ ప్రాంతం ధ్వంసమవడం ద్వారా లోయర్ మన్‌హట్టన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది.
చదవండి: 9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు

తెర వెనుక ఇంత జ‌రిగిందా..
సెప్టెంబర్ 11 దాడుల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్‌. 1996లో అతను తన వ్యూహాన్ని ఒసామా బిన్ లాడెన్‌కు వివరించాడు. ఆ సమయంలో, బిన్ లాడెన్ మరియు అల్‌ఖైదాలు మార్పు దశలో ఉన్నాయి. సూడాన్ నుంచి తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు మకాం మార్చుకున్నారు. 1998 ఆఫ్రికన్ దౌత్యకార్యాలయంపై బాంబు దాడులు బిన్ లాడెన్ 1998 ఫత్వా ఒక మలుపును గుర్తించాయి. అంటే బిన్ లాడెన్ అమెరికా సంయుక్తరాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో ఉన్నట్లు అర్థమైంది. డిసెంబరు, 1998లో విమానాల దారిమళ్లింపుకు వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం సహా యూఎస్‌ఏలో దాడులకు అల్‌ఖైదా సన్నద్ధమవుతోందని అ‍ప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధన కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ర‌క్ష‌ణ శాఖ ఎంతో శ‌క్తివంత‌మైన‌ది, సీఐఏ ఎంతో ముందుచూపు క‌లిగి ఉన్న‌దైన‌ప్ప‌టికీ ఆల్‌ఖైదా టీమ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో అనుకున్న విధంగా వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పైన దాడులు జ‌ర‌ప‌గ‌లిగింది. ప్రపంచ దేశాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top