తల ఒక్కింటికి.. 100 రియాళ్లు!

తల ఒక్కింటికి.. 100 రియాళ్లు!


ఆర్థిక సంక్షోభం గట్టెక్కేందుకు వలస కుటుంబాలపై సౌదీ కన్ను

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సౌదీ అరేబియా విదేశీ వలస ఉద్యోగులపై పడింది. సౌదీలో నివాస వీసాపై ఉంటున్న విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యులపై నెలకు పన్ను విధించింది. పైగా ఈ పన్ను మొత్తాన్ని మరో మూడేళ్ల పాటు ఏటా పెంచనుంది. సౌదీలో ఉన్న విదేశీ ఉద్యోగుల్లో భారతీయులే అధికంగా ఉండటం.. వారిలోనూ తెలుగు రాష్ట్రాలవారి సంఖ్య మరీ ఎక్కువ కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ భారాన్ని తప్పించుకోవడానికి తమ కుటుంబ సభ్యులను స్వదేశానికి పంపేస్తున్నారు.



ఎందుకీ పన్ను?

చమురు నిక్షేపాలపైనే ఆధారపడిన సౌదీ వంటి దేశాలు అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకోవడానికి వలసదారులపై ‘ఆశ్రిత పన్ను’ విధించింది. వాస్తవానికి ఇప్పటికే సౌదీ అరేబియాలోని కంపెనీల ఉద్యోగుల్లో స్థానికుల కన్నా విదేశీయులు ఎక్కువ ఉంటే.. ఒక్కొక్కరి  నుంచి నెలకు 200 సౌదీ రియాళ్ల చొప్పున పన్నుగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు విదేశీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి నుంచి నెలకు 100 సౌదీ రియాళ్లు (సుమారు రూ. 1,723) చొప్పున ‘ఆశ్రిత పన్ను’ వసూలు చేయనున్నారు. పైగా ఈ పన్నును ముందస్తుగానే.. అంటే కుటుంబ సభ్యుల నివాస అనుమతిని పునరుద్ధరించుకునే సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది.



ప్రభావం ఏమిటి?

సౌదీ అరేబియాలో నెలకు 5,000 రియాళ్లు (సుమారు రూ.86,000), ఆపై వేతనం గల వారికి అక్కడి సర్కారు కుటుంబ వీసా ఇస్తుంది. భార్య, ఇద్దరు పిల్లలతో సౌదీలో నివసించే ఒక విదేశీ ఉద్యోగి.. తన కుటుంబ సభ్యుల కోసం ఆశ్రిత పన్ను కింద నెలకు 300 రియాళ్లు (సుమారు రూ.5,400) చెల్లించాల్సి ఉంటుంది.


పైగా ఈ పన్ను 2020 వరకూ ఒక్కొక్కరికి ఏటా 100 రియాళ్ల చొప్పున పెరుగుతుంది. అంటే 2020 నాటికి భార్య, ఇద్దరు పిల్లలు గల విదేశీ ఉద్యోగి నెలకు 1,200 రియాళ్లు (సుమారు రూ. 21,600) పన్నుగా చెల్లించాలి. ఈ లెక్కన పన్ను అమల్లోకి వచ్చే జూలైలో భార్య, ఇద్దరు పిల్లల కోసం 3,600 రియాళ్లు (సుమారు రూ. 64,000) ముందుగా చెల్లించాల్సి వస్తుంది. అదే 2020 నాటికి వస్తే.. భార్య, ఇద్దరు పిల్లల కోసం ఏడాదికి 14,400 రియాళ్లు (సుమారు రూ. 2,60,000) చెల్లించాల్సి వస్తుంది.



మనోళ్లు ఎంతమంది?

సౌదీ అరేబియాలో దాదాపు 400కి పైగా సంస్థల్లో సుమారు 41 లక్షల మంది భారతీయులు ఉండగా.. అందులో 10 లక్షల మందికి పైగా తెలుగువారు ఉన్నారు. వారిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తమ కుటుంబాలతో అక్కడే నివాసముంటున్నారు. వారు పన్నుభారం తప్పించుకోవడానికి కుటుంబ సభ్యులను స్వదేశానికి పంపేస్తున్నారు.


•  ఒక్కో కుటుంబ సభ్యుడిపై నెలకు 100 రియాళ్ల చొప్పున ‘ఆశ్రిత పన్ను’

•  మూడేళ్లపాటు ఏటా ఒక్కొక్కరిపై మరో 100 రియాళ్లు పెంపు

•  భార్య, ఇద్దరు పిల్లలుంటే.. ఇప్పుడు 64,000 కట్టాల్సిందే

•  మూడేళ్ల తర్వాత వసూలు చేసేది ఏకంగా రూ. 2,60,000

సౌదీ వలసల్లో 41,00,000 మందితో భారతీయులదే అగ్రస్థానం

అందులోనూ 10,00,000 మంది తెలుగు రాష్ట్రాల వారే

•  ‘ఆశ్రిత పన్ను’ కారణంగా స్వస్థలాలకు తరలుతున్న కుటుంబాలు




 - సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top