నియంత కిమ్‌కు అదే గతి: ట్రంప్‌ వార్నింగ్‌

Donald Trump warns kim jong un in south korea - Sakshi

సియోల్‌ ‌: అమెరికాను తక్కువగా అంచనా వేయొద్దని, తమతో పెట్టుకున్న లిబియా, ఇరాక్‌ మాజీ అధినేలకు ఏ గతి పట్టిందో తెలుసుకదా అంటూ ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఉత్తర కొరియాను హెచ్చరించారు. నార్త్‌ కొరియా రూపొందిస్తున్న అణ్వాయుధాలు వారికే హానీ తలపెడతాయంటూ నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఓ కార్యక్రమంలో ట్రంప్‌ ప్రసంగిస్తూ.. ప్యోంగ్‌ యాంగ్‌ ఆగడాలను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలి. నార్త్‌ కొరియాలో ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే నియంత కిమ్‌ ఆటలు కట్టించాల్సిన సమయం ఆసన్నమైంది.

నార్త్‌ కొరియా అంటే నరకం. అక్కడి ప్రజలు అలాంటి పాలనను ఇష్టపడటం లేదు. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మాత్రం అమెరికాను లక్ష్యంగా చేసుకుని అణ్వాయుధాలు రూపొందిస్తున్నాడు. కిమ్‌ ఒక్క విషయం గుర్తుంచుకో. అమెరికా సొంతంగానే నీ పిచ్చి చేష్టలను ఆపగలదు. కానీ ఏదైనా కఠినమైన నిర్ణయాన్ని తీసుకునైనా ఉత్తర కొరియాలో ప్రశాంత వాతావారణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం. చైనా, రష్యాలు నియంత కిమ్‌పై ఆర్థిక, రాజకీయ అంశాల కారణంతో ఒత్తిడి తీసుకురావాంటూ’  ఆయన పిలుపునిచ్చారు.  

ఇటీవల ఉత్తర కొరియా అణ్వాయుధాలను కచ్చితత్వంతో గుర్తించి, స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడి చేయడమే ఏకైక మార్గమని అమెరికా రక్షణ కార్యాలయం పేర్కొంది. ట్రంప్‌ మాత్రం యుద్ధానికి ఇప్పుడే తొందరేమీ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఐదు ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్‌.. బుధవారం దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని చైనాకు బయలుదేరారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top