కరోనా: పేషెంట్లకు యాంటీ క్లాటింగ్‌ డ్రగ్‌!

Covid-19 Thick Blood Clots In Kidneys Lungs Of Patients Scare Doctors - Sakshi

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తూ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారిపై పంజా విసరుతోంది. ఇక న్యూయార్క్‌లో మహమ్మారి సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వేలాది మంది కరోనాతో మృత్యువాత పడగా... లక్షలాది మంది వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మౌంట్‌ సినాయ్‌ ఆస్పత్రి వైద్యులు పలు కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో డయాలసిస్ పేషెంట్లు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న వారి శరీరంలో రక్తం గడ్డకట్టడం గమనించామన్నారు. ఈ విషయం గురించి నెఫ్రాలజిస్టులు, పల్మనాలజిస్టులు, న్యూరోసర్జన్లు చర్చించుకున్న తర్వాత వివిధ వ్యాధులతో బాధ పడుతున్న పేషెంట్లలో ఇలాంటి లక్షణాలే ఉన్నాయని గుర్తించామని... దీంతో రక్తం గడ్డకట్టకుండా రోగులకు మెడిసిన్‌ ఇస్తున్నామని తెలిపారు.(క‌రోనాలో హెచ్ఐవీ వైర‌స్ ఆన‌వాళ్లు)

ఈ విషయం గురించి న్యూరో సర్జన్‌ జే మోకో మాట్లాడుతూ.. ‘‘ లంగ్‌ డిసీజ్‌ కంటే కరోనా కలిగించే అనారోగ్యం తీవ్ర స్థాయిలో ఉంది. చిన్నా, పెద్ద అందరిపైనా దీని ప్రభావం ఉంటోంది. రక్తం గడ్డకట్టిన రోగులు చాలా మంది కరోనాతో బాధపడుతున్నారు. నేను చికిత్స అందించిన 32 పేషెంట్లలో దాదాపు సగం మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇది ఆలోచించాల్సిన విషయం’’అని పేర్కొన్నారు. ఇక మరో డాక్టర్‌ డేవిడ్‌ రీచ్‌ మాట్లాడుతూ.. బ్లడ్‌ కాటింగ్‌ను కట్టడి చేయగలిగితే వైరస్‌ తీవ్రతను తగ్గించగలిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రక్తం సరఫరా నిలిచిపోవడంతో సరిగా శ్వాస తీసుకోలేకపోతున్నామని పేషెంట్లు చెబుతున్నారని.. కరోనా లక్షణాల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. (12 లక్షణాల కరోనా!)

ఈ క్రమంలో మౌంట్‌ సినాయి ఆస్పత్రి వర్గాలు చైనాలోని హుబే ప్రావిన్స్‌ డాక్టర్లతో మాట్లాడి వైరస్‌ ప్రభావం గురించి ఒక అంచనాకు వచ్చారని తెలిపారు. కొంతమంది వైద్యులు బృందంగా ఏర్పడి ఈ విషయంపై పరిశోధనలు చేయగా.. వైరస్‌ ప్రవేశించిన కారణంగానే చాలా మంది పేషెంట్లలో రక్తం గడ్డకట్టినట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగంలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు రక్తాన్ని పలుచగా చేసే హెపారిన్‌ ఇస్తున్నామని తెలిపారు. అదే విధంగా కోవిడ్‌ నుంచి కోలుకున్న పేషెంట్ల నుంచి సేకరించిన ప్లాస్మాను ఎక్కిస్తున్నామన్నారు. ఇక కోవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించిన ది బేత్‌ ఇజ్రాయెల్‌ డీకోనెస్‌ మెడికల్‌ సెంటర్‌ కరోనాతో బాధ పడుతున్న పేషెంట్లకు యాంటీ క్లాటింగ్‌ డ్రగ్‌ టీపీఏ ఉపశమనం కలిగిస్తుందా అన్న అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top