ఇలపై అరుణగ్రహం

ఇలపై అరుణగ్రహం

మార్స్‌.. మనకేమో ‘మంగళ’ ప్రదమైన గ్రహంగా మారితే, చైనాకు మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది. అరుణగ్రహాన్ని శోధించడానికి చైనా చేపట్టిన ప్రయోగాలు వరుసగా విఫలం కావడంతో.. భూమ్మీదే మార్స్‌ను సృష్టించాలని నిర్ణయించింది. కానీ అదెలా సాధ్యం? అనే అనుమానం రావొచ్చు. చైనాకు ఏదైనా సాధ్యమే! ఎలాగంటే భూమిపైనే మార్స్‌ తరహా వాతావరణ పరిస్థితులు సృష్టించడం. దీని కోసం టిబెట్‌ పీఠభూమిలోని క్వింఘాయ్‌ ప్రావిన్స్‌ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఎందుకంటే ఈ ప్రాంతమంతా ఎర్రగా, అచ్చంగా మార్స్‌ను పోలినట్టుగానే ఉంటుంది. అయితే ఈ ప్రాంతం పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన హయాగ్జి మంగోలియన్‌ ప్రాంతం కావడంతో అక్కడివారితో చైనా ఒప్పందం కూడా కుదుర్చుకుంది.ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలను చేపట్టనుంది. మార్స్‌ కమ్యూనిటీ, మార్స్‌ కాంప్‌సైట్‌ పేరుతో రెండు బేస్‌లను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భవిష్యత్తులో ఇవి ఖగోళశాస్త్ర పరిశోధనలకు, ఖగోళ విద్యకు ఎంతో ఉపయోగకరంగా ఉండడమే కాకుండా మంచి పర్యాటక కేంద్రం గా  కూడా అభివృద్ధి చెందడం ఖాయంగా చెబుతున్నారు. 2020 నాటికి మార్స్‌పై అడుగు పెట్టాలన్న లక్ష్యంతోనే చైనా ఈ భారీ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. అక్కడి నుంచి మట్టి, ఇతర నమూనాలను సేకరించి, పరిశోధనలు కొనసాగించాలని నిర్ణయించింది. 
Back to Top