భారత్‌కు చైనా వార్నింగ్‌.. భారత్‌ కౌంటర్‌

China Oppose Narendra Modi Visiting Arunachal Pradesh - Sakshi

మోదీ అరుణాచల్ ప్రదేశ్‌ పర్యటనపై చైనా అభ్యంతరం

ఈటానగర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణచల్‌ ప్రదేశ్‌ పర్యటన వివాదాస్పదంగా మారింది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కొరకు మోదీ నేడు (శనివారం) అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. దీనిపై సరిహద్దు దేశం చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదాస్పద భూభాగంలో మోదీ పర్యటించారని ఇటువంటి చర్యలకు దిగి సరిహద్దు సమస్యలను మరింత క్లిష్టతరం చేయొద్దని భారత్‌ను హెచ్చరించింది.

‘ద్వైపాక్షిక సంబంధాల నిబంధనలను దృష్టిలో ఉంచుకొని భారత్‌ ప్రవర్తించాలి. చైనా అభిప్రాయాలను గౌరవిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. సరిహద్దు సమస్యలను వివాదం చేసే చర్యలకు భారత్‌ దూరంగా ఉండాలి’ అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. కాగా చైనా ఇలాంటి చర్యలకు పాల్పడం ఇదేం తొలిసారి కాదు. గతంలో మోదీ పర్యటించన సందర్భంలో కూడా డ్రాగన్‌ ఇదేవిధంగా వక్రబుద్ధిని ప్రదర్శించింది.  బౌద్ధమత గురువు దలైలామా పర్యటించడాన్ని కూడా గతంలో చైనా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ పర్యటన వల్ల సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చైనా వ్యాఖ్యానించింది.

డ్రాగన్‌ ప్రకనటపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భామేనని, తమదేశ నేతలు ఖచ్చితంగా పర్యటించి తీరుతారని కౌంటరిచ్చింది. ఇదే విషయాన్ని గతంలో అనేక సార్లు చైనాకు స్పష్టంగా చెప్పినట్లు భారత్‌ ప్రకటించింది. కాగా ప్రధాని నరేంద్రమోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. హొల్లొంగిలోని గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రెండు దూరదర్శన్‌ ఛానల్స్‌ను ఆయన ప్రారంభించారు. 110 మెగావాట్ల పరే హైడ్రోఎలక్ట్రిక్‌ ప్లాంట్‌ను మోదీ జాతికి అంకితం చేశారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top