పిజ్జా ఫ్రీగా ఇస్తాం..కానీ ఓ కండిషన్‌!

California Restaurant Offers Free Pizzas To Who Gave Up Their Smartphones While Eating - Sakshi

నేటి డిజిటల్‌ యుగంలో సెల్‌ఫోన్‌ చేతిలో లేకుంటే ఒక్క క్షణం కూడా గడవదు. ఆడా- మగా.. చిన్నా-పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌కు బానిసలే. ఒకరోజు అన్నం తినకుండానైనా ఉంటామేమో గానీ..ఫోన్‌ను మాత్రం విడిచి ఉండలేమని చెప్పే వారు కోకొల్లలు. మరికొందరికైతే ఎక్కడ, ఎవరితో ఉన్నాం, ఏం చేస్తున్నాం అనే ధ్యాస లేకుండా ఫోన్లలో మునిగిపోయి.. పక్కన ఉన్న వారిని నిర్లక్ష్యం చేయడం అలవాటు. అటువంటి వాళ్ల కోసమే కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్‌ ఫ్రీ పిజ్జా స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. కనీసం ఓ గంటపాటైనా ఆత్మీయులతో మనస్ఫూర్తిగా మాట్లాడేలా చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చెబుతోంది.

స్థానిక మీడియా కథనం ప్రకారం...అమెరికాలోని కర్రీ పిజ్జా అనే కంపెనీ ‘టాక్‌ టూ ఈచ్‌ అదర్‌ డిస్కౌంట్‌’  పేరిట ఓ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. ఇందుకోసం రెస్టారెంట్‌కు వచ్చిన స్నేహితుల బృందంలో కనీసం నలుగురు వ్యక్తులు ఉండాలి. లోపల అడుగుపెట్టగానే తమ సెల్‌ఫోన్లను రెస్టారెంట్‌ లాకర్లలో భద్రపరచుకోవాలి. అనంతరం స్నేహితులతో ముచ్చటిస్తూ పిజ్జాను ఆస్వాదించాలి. అలా చేసినట్లైతే మరోసారి ఈ రెస్టారెంట్‌కు వచ్చిన వారికి ఉచితంగా పిజ్జా సర్వ్‌ చేస్తారు. లేదా పార్సిల్‌ కూడా తీసుకువెళ్లవచ్చు. ఒకవేళ సేవాభావం ఉన్నట్లైతే అవసరం ఉన్న వాళ్లకు దానిని దానం చేయవచ్చు కూడా.

ఈ విషయం గురించి రెస్టారెంట్‌ సహ యజమాని వరీందర్‌ మల్హి మాట్లాడుతూ..‘ ఫోన్‌ వాడకం తగ్గించుకోవడం ద్వారా ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉన్నాను. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సమయం దొరుకుతోంది. అందుకే ఇలాంటి ఆఫర్‌ పెట్టాం. మేము ప్రతీనెలా పిజ్జాలు దానం చేస్తూ ఉంటాం. ఈ ఆఫర్‌ ద్వారా కుటుంబాలను దగ్గర చేయడంతో పాటు.. సేవాభావాన్ని కూడా పెంపొందించవచ్చు. సెల్‌ఫోన్‌ అనే వ్యసనం నుంచి దృష్టిని కాసేపైనా మరల్చి జీవన ప్రమాణంలో కొన్ని గంటలు పెంచుకోవచ్చు’ అని తమ ఉద్దేశాన్ని చెప్పుకొచ్చారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top